9, ఆగస్టు 2020, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*


*శ్రీమాత్రేనమః*



*60వ నామ మంత్రము* 11.8.2020

*ఓం కదంబ వనవాసిన్యై నమః*

కదంబ వనమునందు వసించు శ్రీమాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కదంబ వనవాసినీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును  *ఓం కదంబ వనవాసిన్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు ఆ జగన్మాత సర్వము తానుగా, తానే అమ్మ స్వరూపంగాను మరియు వారు అమ్మను సర్వాతీత శక్తిగాను గుర్తిస్తారు మరియు ఆ తల్లి కరుణచే తరిస్తారు.

కడిమి (కదంబ) చెట్ల వనమునందు  పరాశక్తి నివసించునది.

ఇక్కడ కదంబ వృక్షములు, కదంబ కుసమముల గూర్చి వివరణ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
రావి, తులసి, కదంబము, మారేడు, పారిజాతము - వీటిని దేవతా వృక్షములంటారు. లక్ష్మీప్రదమైనవి. అందునా కదంబ కుసుమములు జగన్మాతకు ప్రియమైనవి, కదంబవృక్షము క్రింద ఉండుట జగన్మాతకు అత్యంత ప్రియకరము. అందుకే జగన్మాతను *కదంబవనవాసినీ* యనియు *కదంబ కుసుమప్రియా* అనియు స్తుతించుతాము. ఇక్కడ కదంబ వృక్షము అంటే  - కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోను, పశ్చిమగోదావరిజిల్లా ముక్కామలలోను బాలత్రిపురసుందరి, ఆలయములలో కదంబ వృక్షములు గలవు. ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం (వినుకొండ సమీపం) లో అయితే అమ్మవారి ఆలయం ఉన్న చెరువు కరకట్టయందు కదంబ కుసుమ వృక్షములు ఉన్నవి. అక్కడ ఒకనాడు కదంబ వనమే ఉండేదని అంటారు. ఈ కదంబం పూలు అరుణారుణవర్ణంతో పొడవైన సుమారు ఎనిమిది అంగుళముల తొడిమపై గెలల మాదిరిగా ఉండి అటువంటి తొడిమలు వృక్షము నిండా ఉంటాయి. అలాగే వీటి కేశరములు పసుపు రంగులో ఉంటాయి. ఈ కదంబ కుసుమమల గూర్చి మహా భాగవతంలో ఒక శ్లోకం ఉటంకించ బడుచున్నది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమద్భాగవతము - ద్వితీయ స్కంధము - రెండవ అధ్యాయము

*(తొమ్మిదవ శ్లోకము)*

*ప్రసన్నవక్త్రం  నలినాయతేక్షణం కదంబకింజల్కపిశంగవాసనమ్|*

*లసన్మహారత్నహిరణ్మయాంగదమ్ స్బురన్మహారత్నకిరీటకుండలమ్॥855॥*

భగవంతుని ముఖకమలము సర్వదా ప్రసన్నమై, దరహాస శోభితమై ఒప్పుచుండును. ఆ స్వామి నేత్రములు పద్మముల వలె విశాలములైనవి. ఆ ప్రభువు ధరించిన వస్త్రము *కడిమిపూలు కేసరములవలె  పసుపుపచ్చని వన్నెతో విలసిల్లుచుండును*. ఆ పరమాత్మ భుజముల యందు శ్రేష్ఠములైన రత్నములు పొదిగిన బంగారు భుజకీర్తులు శోభిల్లు చుండును. శిరస్సుపైగల రత్నకిరీటము, చెవులయందలి మణికుండలములు ధగధగ మెరయుచుండును.

మరియు ఆ కదంబకుసుములు అరుణారుణ వర్ణములో ఉండును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సాధారణంగా బంతిపువ్వు సైజులో కదంబం పువ్వు చూస్తూ ఉంటాము. అది కదంబ కుసుమమే కావచ్చు. కాని అమ్మవారికి ప్రియమైన కదంబ వనంలోని కదంబ కుసుమం మాత్రం  కాదు.

*దీనికి కారణము అమ్మవారి కదంబ కుసుమములు, కదంబ వృక్షములు వ్యాప్తిలో లేవు. కనీసం గూగుల్ లో వాటి వివరములు కూడా లభించుట లేదు.*

ఇంకను వేదవ్యాసులవారి శ్రీమద్భాగవతంలో దృష్టాంతములు కలవు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కడిమి (కదంబ) వృక్ష వనము నందలి మహాపద్మవాటిక యందుండే చింతామణి గృహంలో - పంచబ్రహ్మాసనాసీనయై శ్రీదేవి విరాజిల్లుచున్నది. చెంగల్వ, కడిమి, నెమలి అతి ముఖ్యమైనవి. కడిమి చెట్లనూ, భూమ్యాకాశములను వర్షధారలు కలుపుతాయి. ఈ వర్షధారలలో అపస్సులు ప్రపంచానికి దోహదము చేస్తాయి. ఈ పవిత్ర సంబంధాన్ని సదా కోరుకునేది కడిమి చెట్లు. అందుకొరకే విశ్వస్వరూపిణి అయిన జగన్మాతకు ఈ చెట్లు గల ఉద్యానవనము చాలా ఇష్టము. కావున కడిమి వృక్షాల మధ్యలో చింతమణి గృహమందు శ్రీదేవి నివాసము. అందుచేత కదంబ వనవాసిని అనబడుచున్నది.

కదంబవనవాసిని అయిన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కదంబ వనవాసిన్యై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.

కామెంట్‌లు లేవు: