9, ఆగస్టు 2020, ఆదివారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*



*అష్టమ స్కంధము - నవమ అధ్యాయము*

*మోహినీరూపమును దాల్చిన శ్రీహరి అమృతమును పంచుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*9.11 (పదకొండవ శ్లోకము)*

*ఇతి తే క్ష్వేలితైస్తస్యా ఆశ్వస్తమనసోఽసురాః|*

*జహసుర్భావగంభీరం దదుశ్చామృతభాజనమ్॥6642॥*

*శ్రీశుకుడు వచించెను* రాజా! మోహినియొక్క కపటపు వచనములకు దైత్యులమనస్సులలో ఇంకను విశ్వాసము కల్గెను. వారు తమలో తాము నవ్వుకొనుచు అమృత కలశమును ఆమె చేతులయందు ఉంచిరి.

*9.12 (పండ్రెండవ శ్లోకము)*

*తతో గృహీత్వామృతభాజనం హరిర్బభాష ఈషత్స్మితశోభయా గిరా|*

*యద్యభ్యుపేతం క్వ చ సాధ్వసాధు వా కృతం మయా వో విభజే సుధామిమామ్॥6643॥*

శ్రీహరి అమృతకలశమును తీసికొని, కొద్దిగా దరహాసము చేయుచు మధురముగా ఇట్లు పలికెను- "నేను   చేయబోవు కార్యము ఉచితమైనను, అనుచితమైనను ఈ అమృతమును మీకు పంచెదను".

*9.13 (పదమూడవ శ్లోకము)*

*థఇత్యభివ్యాహృతం తస్యా ఆకర్ణ్యాసురపుంగవాః|*

*అప్రమాణవిదస్తస్యాస్తత్తథేత్యన్వమంసత॥6644॥*

దైత్యప్రముఖులు ఆ మోహినియొక్క మధురవచనములను వినిరి. కాని, వారు ఆ పలుకుల అంతరార్థమును గ్రహింపలేకపోయిరి. కావున వారు ముక్తకంఠముతో *మాకు సమ్మతమే* అని పలికిరి. మోహినియొక్క వాస్తవస్వరూపము వారికి తెలియక యుండుటయే దీనికి నిజమైన కారణము.

*9.14 (పదునాలుగవ శ్లోకము)*

*అథోపోష్య కృతస్నానా హుత్వా చ హవిషానలమ్|*

*దత్త్వా గోవిప్రభూతేభ్యః కృతస్వస్త్యయనా ద్విజైః॥6645॥*

*9.15 (పదునైదవ శ్లోకము)*

*యథోపజోషం వాసాంసి పరిధాయాహతాని తే|*

*కుశేషు ప్రావిశన్ సర్వే ప్రాగగ్రేష్వభిభూషితాః॥6646॥*

*9.16 (పదునారవ శ్లోకము)*

*ప్రాఙ్ముఖేషూపవిష్టేషు సురేషు దితిజేషు చ|*

*ధూపామోదితశాలాయాం జుష్టాయాం మాల్యదీపకైః॥6647॥*

సురాసురులు, ఆమె అనుజ్ఞతో స్నానాదికములను ముగించు కొనిరి. హవిష్యాన్నమును అగ్నికి ఆహుతిగా సమర్పించిరి. విప్రులకును, ఇతర ప్రాణులకును దానములను ఒనర్చిరి. గోవులకు గ్రాసమును సమర్పించిరి. పిమ్మట బ్రాహ్మణులు స్వస్త్యయనములను పల్కిరి. వారు తమ తమ అభిరుచులకు తగినట్లుగా నూతన వస్త్రములను, ఆభరణములను ధరించిరి. తూర్పు వైపుకొనలుగల కుశాసనముపై ఆసీనులైరి. దేవతలు, దైత్యులు ప్రాఙ్ముఖముగా కూర్చున్నపిమ్మట సుగంధ ధూపములచే, మాలలచే, దీపములచే భవనమును అలంకరించిరి.

*9.17 (పదునేడవ శ్లోకము)*

*తస్యాం నరేంద్ర కరభోరురుశద్దుకూల- శ్రోణీతటాలసగతిర్మదవిహ్వలాక్షీ|*

*సా కూజతీ కనకనూపురశింజితేన కుంభస్తనీ కలశపాణిరథావివేశ॥*

అంతట మోహినీదేవి అమృతకలశమును చేబూని, సభామంటపమున ప్రవేశించెను. ఆమె అందమైన వస్త్రములను ధరించియుండెను. నితంతభారముచే మెల్లమెల్గగ నడచుచుండెను. ఆమె మదవిహ్వలమైన కన్నులతో ఒప్పుచుండెను. కలశములతో సమానమైన స్తనశోభలతోను, ఊరు వైభవముతోను ఒప్పుచుండెను. ఆమె ధరించిన అందెల సవ్వడులు సభాభవనమున ప్రతిధ్వనించు చుండెను.

*9.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తాం శ్రీసఖీం కనకకుండలచారుకర్ణనాసాకపోలవదనాం పరదేవతాఖ్యామ్|*

*సంవీక్ష్య సమ్ముముహురుత్స్మితవీక్షణేన  దేవాసురా విగలితస్తనపట్టికాంతామ్॥6649॥*

ఆమె అందమైన చెవులయందు బంగారు కుండలములను ధరించియుండెను. ఆమె నాసిక, కపోలములు, ముఖము పొందికగా ఉండెను. శ్రీహరి మోహినీరూపములో సాక్షాత్తు లక్ష్మీ దేవి యొక్కప్రియసఖివలె భాసిల్లుచుండెను. మోహిని తన చిరునవ్వులతో, క్రీగంటిచూపులతో దైత్యులను, దేవతలను మోహములో ముంచెత్తుచుండెను. ఆ సమయమున ఆమె కంచుకము కొద్దిగా జారియుండెను.

*9.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*అసురాణాం సుధాదానం సర్పాణామివ దుర్నయమ్|*

*మత్వా జాతినృశంసానాం న తాం వ్యభజదచ్యుతః॥6650॥*

అసురులు జన్మతః క్రూరులు. వారికి అమృతమును పంచుట పాములకు పాలు పోసినట్లేయని మోహినీరూపములోనున్న శ్రీహరి భావించెను. అందువలన, ఆ స్వామి అసురులకు అమృతములో భాగమును ఇయ్యకుండెను.

*9.20 (ఇరువదియవ శ్లోకము)*

*కల్పయిత్వా పృథక్ పంక్తీరుభయేషాం జగత్పతిః|*

*తాంశ్చోపవేశయామాస స్వేషు స్వేషు చ పంక్తిషు॥6651॥*

ఆ జగన్నాథుడు దేవతలను, అసురులను రెండు పంక్తుల క్రింద విభజించెను. పిమ్మట వారిని వారివారి స్థానములలో కూర్చుండజేసెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: