9, ఆగస్టు 2020, ఆదివారం

రామాయణమ్ 25


...
మహాదేవుడు ప్రసాదించిన వరములతో ఇనుమడించిన దర్పముతో, రెట్టించిన ఉత్సాహంతో మరల వశిష్ట మహర్షి ఆశ్రమం మీద దండెత్తాడు విశ్వామిత్రుడు..
.
వెళ్ళీ వెళ్ళడంతోటే మొత్తం తపోవనాన్ని బూడిదకుప్పగా మార్చేశాడు ‌ఠారెత్తిన మునిగణం తలోదిక్కుకు పారిపోయారు!
ఆవరించిన నిశ్శబ్దముతో ,దైన్యాన్ని ప్రకటిస్తూ క్షణాలలో మరుభూమిగా మారిపోయింది వశిష్ట మహర్షి ఆశ్రమము .
.
ప్రాణిశూన్యమైన ఆశ్రమాన్ని చూసి వశిష్ట మహర్షి కోపంతో మూర్ఖుడా ! ఎంతోకాలం నుండీ పెంచిన ఆశ్రమాన్ని ,పోషించిన జీవజాలాన్ని అనాలోచితంగా నాశనం చేసావుగదా! రా! నీ ప్రతాపం నా పైచూపించు అని బ్రహ్మదండాన్ని ఎత్తిపట్టి మహోగ్రరూపం దాల్చి విశ్వామిత్రుడి కి ఎదురుగా నిలబడ్డాడు! .
.
విశ్వామిత్రుడు అవకాశం వచ్చింది కదా అని ఆగ్నేయ, వారుణ,రౌద్ర,ఐంద్ర,పాశుపత,ఐషికాస్త్రములన్నిటినీ ప్రయోగించినా కూడా అవి అన్నీ వశిష్ట మహర్షి బ్రహ్మదండంచేత నిలువరింపబడి నిర్వీర్యము చేయబడ్డవి! .
.
అప్పుడు విశ్వామిత్రుడు పట్టరాని క్రోధంతో సకలప్రపంచాలనూ భస్మీపటలం చేయగల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా దానిని కూడా వశిష్టుని బ్రహ్మదండం నిష్ప్రయోజనం చేసింది.
.
ఆ విధంగా సృష్టిలోని సకలాస్త్రములు ,విశ్వామిత్రుని క్షాత్రము,వశిష్టుడి బ్రహ్మతేజం ముందు వెలవెల పోయినవి.
.
అప్పుడు మరొక సారి భంగపాటు పొందిన విశ్వామిత్రుడి మదిలో ఆలోచన మొదలయ్యింది! అన్ని శస్త్రములు వికలమయినవి,అన్ని అస్త్రములు విఫలమయినవి ! ఆహా బ్రహ్మర్షి ఎంత శక్తివంతుడు ! ఇక నుండీ నా సర్వ శక్తులూ వినియోగించి బ్రహ్మర్షి పదం సిద్ధింపచేసుకుంటాను .
.
ఆ ఆలోచన రావడమే తరువాయి అమలులో పెట్టేశాడు విశ్వామిత్రుడు. తీవ్రమైన తపస్సు వేయిసంవత్సరములు చేశాడు ! అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీవు ఈ తపస్సువల్ల రాజర్షివైనావు అని పలికాడు! అదేమిటి నేను బ్రహ్మర్షిని కానా? అని అడిగాడు ,కావు! అని సమాధానమిచ్చి అంతర్ధానమయినాడు బ్రహ్మ.
.
సిగ్గుతో చితికి పోయి మరల తీవ్రమైన తపస్సు చేయనారంభించాడు! .
.
ఇలా తపస్సు చేస్తుండగా ఒక రోజు ఆయన వద్దకు త్రిశంకువు అనేరాజు వచ్చాడు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: