9, ఆగస్టు 2020, ఆదివారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - నవమ అధ్యాయము*

*మోహినీరూపమును దాల్చిన శ్రీహరి అమృతమును పంచుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*దైత్యాన్ గృహీతకలశో వంచయన్నుపసంచరైః|*

*దూరస్థాన్ పాయయామాస జరామృత్యుహరాం సుధామ్॥6652॥*

పిదప, శ్రీహరి అమృత కలశమును చేబూని, దైత్యులకు చేరువగా నడచెను. వారిని తన హావభావములతో, కటాక్షములతో మోహితులను జేసి, దూరముగా కూర్చొనియున్న దేవతల యొద్దకు వచ్చెను. ముసలితనమును, మృత్యువును పారద్రోలునట్టి అమృతమును వారికి పంచియిచ్చెను.

*9.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*తే పాలయంతః సమయమసురాః స్వకృతం నృప|*

*తూష్ణీమాసన్ కృతస్నేహాః స్త్రీవివాదజుగుప్సయా॥6653॥*

రాజా! అసురులు తాము చేసికొనిన ప్రతిజ్ఞకు కట్టుబడియుండిరి. వారు మోహినితో మైత్రిని గూడ చేసికొనియుండిరి. కనుక, స్త్రీ కారణముగా పోట్లాడుట వలన నిందకలుగునని భావించిరి. కనుక, వారు మౌనము వహించిరి.

*9.23  (ఇరువది మూడవ శ్లోకము)*

*తస్యాం కృతాతిప్రణయాః ప్రణయాపాయకాతరాః|*

*బహుమానేన చాబద్ధా నోచుః కించన విప్రియమ్॥6654॥*

వారికి మోహినిపై మిగుల మక్కువ ఏర్పడియుండెను. గట్టిగా తమ భాగమును గూర్చి మాట్లాడినచో, ఆమెపై గల ప్రేమ బంధము తెగిపోవునేమో యని భయపడిరి. మోహినియు మొదట వారిని గౌరవించి యుండెను. ఆ కారణముగా వారు మోహినితో ఏవిధముగను అప్రియముగా మాట్లాడలేదు.

*9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*దేవలింగప్రతిచ్ఛన్నః స్వర్భానుర్దేవసంసది|*

*ప్రవిష్టః సోమమపిబచ్చంద్రార్కాభ్యాం చ సూచితః॥6655॥*

పరమాత్మ దేవతలకు అమృతమును పంచుచున్నప్పుడు రాహువు అను అసురుడు దేవతల వేషమును ధరించి, వారిమధ్యలో కూర్చొనెను. దేవతలతోపాటు అతడును అమృతమును త్రాగెను. కాని, ఆ క్షణముననే సూర్యచంద్రులు అతని మోసమును శ్రీహరికి సూచించిరి.

*9.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*చక్రేణ క్షురధారేణ జహార పిబతః శిరః|*

*హరిస్తస్య కబంధస్తు సుధయాఽఽప్లావితోఽపతత్॥6656॥*

*9.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*శిరస్త్వమరతాం నీతమజో గ్రహమచీకౢపత్|*

*యస్తు పర్వణి చంద్రార్కావభిధావతి వైరధీః॥6657॥*

అతడు అమృతమును త్రాగుచున్నప్పుడే శ్రీహరి వాడియైన చక్రముతో అతని శిరస్సును ఖండించెను. ఆ రాహువు యొక్క మొండెమునకు అమృతస్పర్శ లేనందున అది శిరస్సు నుండి వేరై క్రిందపడెను. కాని శిరస్సు మాత్రము అమరత్వమును పొందెను. బ్రహ్మదేవుడు దానిని ఒక గ్రహముగా చేసెను. ఆ రాహువే సూర్యచంద్రులపై వైరమును పూని పూర్ణిమ, అమావాస్య దినములయందు వారిని ఆక్రమించుచుండెను.

*9.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*పీతప్రాయేఽమృతే దేవైర్భగవాన్ లోకభావనః|*

*పశ్యతామసురేంద్రాణాం స్వం రూపం జగృహే హరిః॥6658॥*

దేవతలు అందరును అమృతమును స్వీకరించుచుండగా సకల లోకములకు జీవన ప్రదాతయైన శ్రీహరి అసురులు చూచుచుండగనే మోహినీరూపమును త్యజించి, తన యదార్థరూపమును ధరించెను.

*9.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*ఏవం సురాసురగణాః సమదేశకాలహేత్వర్థకర్మమతయోఽపి ఫలే వికల్పాః|*

*తత్రామృతం సురగణాః ఫలమంజసాఽఽపుర్యత్పాదపంకజరజఃశ్రయణాన్న దైత్యాః॥6659॥*

రాజా! చూచితివా? దేవదానవులు ఒకే సమయమున ఒకే ప్రయోజనము కొరకు ఒకవస్తువును  ఆశించి, సమానముగా శ్రమపడియుండిరి. కాని, వారికి లభించిన ఫలితములలో పెద్ద మార్పులు జరిగినవి. దేవతలకు మాత్రము వారి పరిశ్రమకు ఫలితమైన అమృతము సులభముగా లభించెను. ఏలయన, వారు శ్రీహరి పాదపద్మములను ఆశ్రయించియుండిరి. శ్రీహరియెడ విముఖతగల వారగుటచే అసురులు శ్రమపడినను అమృతము మాత్రము వారికి దక్కలేదు.

*9.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*యద్యుజ్యతేఽసువసుకర్మమనోవచోభిర్దేహాత్మజాదిషు నృభిస్తదసత్పృథక్త్వాత్|*

*తైరేవ సద్భవతి యత్క్రియతేఽపృథక్త్వాత్సర్వస్య  తద్భవతి మూలనిషేచనం యత్॥6660॥*

మానవుడు తన ప్రాణములు, ధనము, కర్మలు, మనసు, వాక్కు మొదలగు వాటిద్వారా తన శరీరము కొరకు భార్యాపుత్రాదుల కొరకు ఎంతగా శ్రమించినను అది అంతయును వ్యర్థమేయగును. ఏలయన, మూలమునందు భగవద్బుద్ధి లేకపోవుటచే అతనికి భేదబుద్ధి కలుగును. కాని, మానవుడు ప్రాణములు మొదలగు వాటి ద్వారా భేదభావరహితముగా భగవంతుని సేవించినచో, అతని శరీరమునకును,బంధుమిత్రులకును, సమస్తలోకమునకును సత్ఫలితమే కలుగును. వృక్షము యొక్క మూలమును తడిపినచో, దాని కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు అన్నింటికిని నీరు లభించును. అట్లే, భగవంతుని కొరకు, భగవదర్పణ బుద్ధితో కర్మలను చేసినచో, వాటి సత్ఫలితములు అందరికిని లభించును.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే నవమోఽధ్యాయః (9)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము (9)

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
********************

కామెంట్‌లు లేవు: