9, ఆగస్టు 2020, ఆదివారం

*వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం*



*నాలుగవ అధ్యాయము*

*శ్రీనారదుని ఆగమనము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*4.1 ఒకటవ శ్లోకం*

*వ్యాస ఉవాచ*

*ఇతి బ్రువాణం సంస్తూయ మునీనాం దీర్ఘసత్రిణామ్|*

ఈ విధముగా సూతగోస్వామి పలికినంతట దీర్ఘకాల యజ్ఞదీక్షితులైన ఋషులలో శ్రేష్ఠుడును, వృద్ధుడును అగు శౌనకముని అతనిని ఇట్లు సంబోధించుచు అభినందించెను

*4.2 (రెండవ శ్లోకం)*

*శౌనక ఉవాచ*

*సూత సూత మహాభాగ వదనో వదతాం వర|*

*కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ఛుకః॥*

శౌనకుడు పలికెను:ఓ సూతగోస్వామీ!  మహాభాగుడైన నీవు వక్తలలో అత్యంత శ్రేష్థుడవు. కనుక ఘనుడును, పరమ శక్తిమండును అగు శ్రీశుకదేవగోస్వామి పలికిన శ్రీమద్భాగవత పవిత్ర కథను దయతో మా కిపుడు వినిపింపుడు.

*4.3 (మూడవ శ్లోకం)*

*కస్మిన్ యుగే పవృత్తేయం స్థానే వా కేన హేతువా|*

*కుతః సంచోదితః కృష్ణః కృతవాన్ సంహితాం మునిః॥*

ఈ శ్రీమద్భాగవతము ఏ సమయమునందు మరియు ఎచ్చోట తొలుత ప్రారంభింపబడినది? అదియునుగాక ఏ కారణము చేత అది ఆరంభింపబడినది? ఈ సంహితము రచించుటకు మహామునియైన కృష్ణద్వైపాయన వ్యాసుడు ఎవరి నుండి స్ఫూర్తిని పొందియుండెను?

*4.4 (నాలుగవ శ్లోకం)*

*తస్య పుత్రో మహాయోగీ సమదృక్ నిర్వికల్పకః|*

*ఏకాన్తమతిరున్నిద్రో గూఢో మూఢ ఇవేయతే॥*

అతని (వ్యాసదేవుని) తనయుడు గొప్ప భక్తుడు. సమదర్శి, నిర్వికల్పుడైన అతడు సదా ఏకాంతమతుడైనట్టివాడు. సమస్త భౌతిక కార్యములకు పరుడైనట్టి అతడు గూఢముగా నున్నందున బాహ్యమునకు జడుని వలె గోచరించును.

*4.5 (ఐదవ శ్లోకము)*

*దృష్ట్వానుయాన్తమృషిమాత్మ జమప్యనగ్నం*
*దేవ్యో హ్రియా పరిదధుర్న సుతస్య చిత్రమ్|*

*తద్వీక్ష్య పృచ్ఛతి మునౌ జగదుస్తవాస్తి*
*స్త్రీపుంభిదా న తు సుతస్య వివిక్తదృష్టేః॥*

శ్రీవ్యాసదేవుడు తన తనయుని అనుసరించుచు చనునప్పుడు నగ్నముగా జలకములాడు సుందరులైన దేవతాస్త్రీలు అతడు నగ్నముగా లేకున్నను వెంటనే వస్త్రములు ధరించిరి. కాని అతని తనయుడు తమ ఎదుటగా ప్రయాణించి నప్పుడు వారట్లు వర్తించలేదు. కాని అతని తనయుడు తమ ఎదుటగా ప్రయాణించి నప్పుడు వారట్లు వర్తించలేదు. ఈ విషయమును గూర్చి వ్యాసదేవుడు ప్రశ్నించగా అతని తనయుడు పవిత్రుడనియు, స్త్రీపురుష భేదములు గాంచని వాడనియు ఆ యువతులు ప్రత్యుత్తరమిచ్చిరి. కాని వ్యాసదేవుడు అట్టి భేదభావములను చూపియుండెను.

*4.6 (ఆరవ శ్లోకము)*

*కథమాలక్షితః పౌరైః సంప్రాప్తః కురుజాంగలన్|*

*ఉన్మత్తమూకజడపద్విచరన్ గజసాహ్వయే॥*

కురుజాంగల ప్రాంతములందు సంచరించిన పిదప హస్తినాపురమున ప్రవేశింపగా ఉన్మత్తుడును, మూగవాడును, జడుని వలె గోచరించువాడును అగు అతనిని (వ్యాసుని తనయుడైన శ్రీల శుకదేవుని) జనులెట్లు గుర్తించిరి.

*4.7 (ఏడవ శ్లోకము)*

*కథం వాం పాండవేయస్య రాజర్షేన్మునినా సహ|*

*సంవాదః సమభూత్తాత యత్రైషా సాత్యతీ శృతిః॥*

అట్టి శుకదేవగోస్వామిని పరీక్షిన్మహారాజు కలియుట ఎట్లు సంభవించెను? ఆ కలయిక వలననే వేదముల దివ్యసారమును (శ్రీమద్భాగవతము) కీర్తించుటకు అతనికి అవకాశము కలిగెను.

*4.8 (ఎనిమిదవ శ్లోకము)*

*స గోదోహనమాత్రం హి గృహేషు గృహమేధినామ్|*

*అవేక్షతే మహాభాగస్థీర్థీ కుర్వంస్తదాశ్రమమ్॥*

అతడు (శుకదేవగోస్వామి) గృహస్థుని ఇంటి ముంగిట గోదహనకాలము వరకే నిలిచియుండు నైజము గలవాడు. తాను దర్శించు గృహమును పునీత మొనర్చుటకే అతడట్లు చేసెను.

*4.9 (తొమ్మిదవ శ్లోకము)*

*అభిమన్యుసుతం సూత ప్రాహుర్భాగవతోత్తమమ్|*

*తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహి నః॥*

పరీక్షిన్మహారాజు భాగవతోత్తముడనియు, అతని జన్మకర్మలు అత్యంత ఆశ్చర్యకరములనియు చెప్పబడుచుండును. దయచేసి అతనిని గూర్చి తెలియజేయుడు.

*4.10 (పదవ శ్లోకం)*

*స సామ్రాట్ కస్య వా హేతోః పాండూనాం మానవర్ధనః|*

*ప్రాయోపవిష్ఠో గంగాయామనాదృత్యాధిరాట్శ్రియమ్॥*

పరీక్షిన్మహారాజు గొప్ప సామ్రాట్టు మరియు గొప్ప రాజ్యసంపదను కలిగినట్టివాడు. పాండవవంశ యశస్సును వృద్ధిచేయునటువంటి అతడు ఏ కారణము చేత సమస్తమును త్యజించి గంగాతటమున ప్రాయోపవిష్ఠుడయ్యెను?

*4.11 (పదకొండవ శ్లోకము)*

*నమన్తి యత్పాదనికేతమాత్మనః*
      *శివాయ హానీయ ధనాని శత్రవః*

*కథం స వీరః శ్రియమంగ దుస్త్యజాం*
      *యుజవైషతోత్ర్సష్టుమహో సహాసుభిః॥*

పరీక్షిన్మహారాజు శత్రువులు తమంతట తామే  అతని పాదములకు వందనములొసగి  ధనసంపత్తులనన్నింటినీ స్వీయక్షేమము కోసం అర్పించెడివాడు. అటువంటి ఘనచక్రవర్తియైన అతడు పూర్ణశక్తిని, పూర్ణయౌవనమును, అసాధ్యమైన రాజ్యవైభవములను కలిగియుండెను. అట్టి యెడ ప్రాణముతో సహా సమస్తమును ఎందులకై అతడు త్యజింపగోరెను?

*4.12 (పన్నెండవ శ్లోకము)*

*శివాయ లోకస్య భవాయ భూతయే*
      *య ఉత్తమశ్లోకపరాయణా జనాః|*

*జీవన్తి నాత్మార్థమసౌ పరాశ్రయం*
      *ముమోద నిర్విద్య కుతః కలేవరమ్॥*

దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తికే అంకితమైనవారు ఇతరుల క్షేమము, ఆనందము, అభ్యుదయముల కోసమే జీవింతురు. తమ స్వలాభము కోసం వారెన్నడును జీవించరు.  పరీక్షిన్మహారాజు కూడా ఆ విధముగా సమస్త లౌకిక సంపదల సంగమ నుండి ముక్తుడై యున్నను ఇతరులకు ఆశ్రయమైన తన దేహమును ఎందులకు పరిత్యజించెను?

*4.13 (పదమూడవ శ్లోకము)*

*తత్సర్వం నః సమాచక్ష్వ పృష్టో యదిహ కించన|*

*మన్యే త్వాం విషయే వాచాం స్నాతమన్యత్ర ఛాందసాత్॥*

వేదములందలి కొంత భాగము మినహా సర్వశాస్త్రభావములందును పారంగతుడవైనందున మేము వేసిన ప్రశ్నలన్నింటికినీ నీవు స్పష్టముగా సమాధానమొసగగలవని మేమెరిగియున్నాము.

*4.14 (పదునాల్గవ శ్లోకము)*

*సూత ఉవాచ*

*ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే|*

*జాతః పరాశరోద్యోగీ వాసవ్యాం కలయా హరేః॥*

సూతగోస్వామి పలికెను: ద్వాపరయుగము త్రేతాయుగమునందును వ్యాపించినట్టి సమయమున వ్యాసదేవుడు పరాశరుని ద్వారా వసుతనయయైన సత్యవతి గర్భమున జన్మించెను.

*4.15 (పది హేనవ శ్లోకము)*

*స కదాచిత్సరస్వత్యా ఉపస్పృశ్య జలం శుచిః|*

*వివిక్త ఏక ఆసీన ఉదితే రవిమండలే॥*

అతడు (వ్యాసదేవుడు) ఒకమారు సూర్యోదయ సమయమున సరస్వతీనదీ జలముల యందు స్నానాదులను గావించి ధ్యానము సల్పుటకు ఏకాంతమున ఆసీనుడయ్యెను.

*4.16 (పదహారవ శ్లోకము)*

*పరాశరజ్ఞః స ఋషిః కాలేనావ్యక్తరంహసా|*

*యుగధర్మవ్యతికరం ప్రాప్తం భువి యుగే యుగే॥*

మహామునియైన వ్యాసదేవుడు యుగధర్మములందు కలిగిన విపరీతములను గాంచగలిగెను. పుడమియందు అటువంటి విపరీతములు కాలప్రభావముచే వివిధ యుగములందు కలుగుచుండును.

*4.17 (పదిహేడవ శ్లోకము)*

*భౌతికానాం చ భావానాం శక్తిహ్రాసం చ తత్కృతమ్|*

*అశ్రద్దధానాన్నిఃసత్త్వాన్దుర్మేధాన్ హ్రసితాయుషః|*

*4.18 (పద్దెనిమిదవ శ్లోకము)*

*దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్య మునిర్దివ్యేన చక్షుసా|*

*సర్వవర్ణాశ్రమాణాం యద్దధ్యౌ హితమమోఘదృక్॥*

జ్ఞానసంపన్నుడైన ఆ మహర్షి యుగప్రభావము వలన భౌతికమైన సమస్తము నశింపనున్నదని తన దివ్యదృష్టిచే గాంచగలిగెను. శ్రద్ధారహితమైన జనసామాన్యము యొక్క ఆయుఃప్రమాణము క్షీణించుటయే గాక, సత్త్వగుణము లోపించుట వలన వారు దౌర్భాగ్యులగుటయు అతడు దర్శింపగలిగెను. అంతట అతడు సర్వవర్ణాశ్రమముల వారికి శుభమును కలుగజేయు  విషయమును గూర్చి చింతింపదొడగెను.

*4.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*చాతుర్హోత్రం కర్మ శుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికమ్|*

*వ్యదధాద్యజ్ఞసన్తత్యై వేదమేకం చతుర్విధమ్|*

మానవుల కర్మలు శుద్ధిపడుటకు వేదములందు తెలుపబడిన యజ్ఞములే మార్గమని అతడు గాంచగలిగెను. అట్టి యజ్ఞములను జనుల యందు వ్యాప్తిచేయుటకై ఆ పద్ధతిని సులభమొనర్పదలచి అతడు ఏకముగా నున్న వేదమును నాలుగు భాగములుగా విభజించెను.

*4.20 (ఇరువదవ శ్లోకము)*

*ఋగ్యజుఃసామాథర్యాఖ్యా వేదాశ్చత్వార ఉద్ధృతాః|*

*ఇతిహాసపురాణం చ పంచమో వేద ఉచ్యతే॥*

ఆ విధముగా జ్ఞానపు ఆదిమూలము యొక్క నాలుగు విభాగములు (వేదములు) విడిగా ఏర్పాటు చేయబడినవి. చారిత్రాత్మక విషయములు, ప్రామాణిక కథలను కలిగియున్న పురాణములు పంచమవేదముగా  పిలువబడినది.


*4.21 (ఇరవై ఒకటవ శ్లోకం)*

*తత్ర ఋగ్వేదధరః పైలః సామగో జమినిః కవిః|*

*వైశంపాయన ఏవైకో నిష్ణాతో యజుషాముత॥*

ఈ విధముగా వేదము నాలుగు భాగములుగా విభజింపబడిన పిమ్మట పైలఋషి ఋగ్వేదమునకు ఆచార్యుడయ్యెను. జైమినిఋషి సామవేదమునకు  ఆచార్యుడు కాగా వైశంపాయనుడు ఒక్కడే యజుర్వేదపారంగతుడయ్యెను.

*4.22 (ఇరవై రెండవ శ్లోకం)*

*అథర్వాంగిరసామిసీత్సుమన్తుర్దారుణో మునిః|*

*ఇతిహాసపురాణానాం పితా మే రోమహర్షణః॥*

అత్యంత శ్రద్ధావంతుడైన సుమంతముని అంగీరునికి అథర్వవేదము నివ్వగా, నా జనకుడైన రోమహర్షుణునికి పురాణేతిహాసములు ఇవ్వబడినవి.

*4.23 (ఇరవై మూడవ శ్లోకం)*

*త ఏత ఋషయో వేదం స్వం స్వం వ్యస్యన్ననేకధా|*

*శిష్యైః ప్రశిష్యైస్తచ్ఛిష్యైర్వేదాస్తే శాఖినోఽభవన్॥*

ఈ ఋషులందరును తమకు అప్పగింపబడిన వేదములను తిరిగి తమ శిష్యులకు,ప్రశిష్యులకు, ప్రశిష్యుల శిష్యులకు నిచ్చిరి. ఈ విధముగా వేదముల ననుసరించువారల ఆయా శాఖలు ఉనికీలోనికి వచ్చినవి.

*4.24 (ఇరవై నాలుగవ శ్లోకం)*

*త ఏవ వేదాదుర్మే ధైర్ధార్యన్తే పురుషైర్యథా|*

*ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణవత్సలః॥*

ఈ విధముగా కృపణవత్సలుడగు వ్యాసముని మందబుధ్ధులైన మానవులు గ్రహింపగలిగెడి రీతిలో వేదములను విభజించెను.

*4.25 (ఇరువది ఐదవ శ్లోకం)*

*స్త్రీ శూద్రద్విజబంధూనాం త్రయీ స శ్రుతిగోచరా|*

*కర్మ శ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ|*

*ఇతి భారతమాఖ్యానం కృపయా మునినా కృతమ్॥*

జనులకు ఇది జీవిత పరమలక్ష్యప్రాప్తిని కలుగజేయగలదని మహాముని కరుణతో భావించెను. ఆ విధముగా అతడు స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల నిమిత్తమై మహాభారతమనెడి గొప్ప ఇతిహాసమును రచించెను.

*4.26 (ఇరవై ఆరవ శ్లోకం)*

*ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజాః|*

*సర్వాత్మ కేనాపి యదా నా తుష్యద్ధృదయం తతః॥*

ఓ ద్విజులారా! ఈ విధముగా సర్వజనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకై నియుక్తుడైనను వ్యాసదేవుని మనస్సు తృప్తి చెందలేదు.

*4.27 (ఇరవై ఏడవ శ్లోకం)*

*నాతి ప్రసీదద్ధృదయః సరస్వత్యాస్తటే శుదౌ|*

*వితర్కయన్ వివిక్తస్థ ఇదం చోవాచ ధర్మవిత్॥*

ఈ విధముగా హృదయమునందు అసంతృప్తిని చెందినవాడైన ముని ధర్మసారము నెరిగియున్నందున వెంటనే ఆలోచనామగ్నుడై తనలో తాను ఇట్లు పలికెను.

*4.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకం)*

*ధృతవ్రతేన హి మయా ఛందాంసి గురవోఽగ్నయః|*

*మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనం॥*

*4.29 (ఇరవై తొమ్మిదవ శ్లోకం)*

*భారతవ్యపధేశేన హ్యామ్నాయార్థశ్చ ప్రదర్శితః|*
*దృశ్యతే యత్ర ధర్మాది స్త్రీశూద్రాదిభిరప్యుత॥*

దృఢవ్రతములను పాటించుచు నేను నిష్కపటభావముతో వేదములను, గురువును, యాగాగ్నులను అర్చించితిని.  సర్వవిధములైన ఆజ్ఞలకు లోబడి యుండి స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల వంటివారు కూడా ధర్మపథమును గాంచగల రీతిలో గురుశిష్యపరంఫరయొక్క భావమును మహాభారత వ్యాఖ్యానము ద్వారా తెలియజేసితిని.

*4.30 (ముప్పదవ శ్లోకము)*

*తథాపి బత మే దైహ్యోహ్యాత్మా చైనాత్మనా విభుః|*

*అసంపన్న ఇవాభాతి బ్రహ్మవర్చస్యసత్తమః॥*

వేదములు గోరెడి సమస్తమును సంపూర్ణముగా కలిగియున్నప్పటికిని నేను అసంపూర్ణతను అనుభవించుచున్నాను.

*4.31 (ముప్పది ఒకటవ శ్లోకం)*

*కిం వా భాగవతా ధర్మా స ప్రాయేణ నిరూపితాః|*

*ప్రియాః పరమహంసానిం త ఏవ హ్యచ్యుతప్రియాః॥*

పరమహంసలకు, అచ్యుతునకు ప్రియమైనటువంటి భాగవతధర్మమును నేను ప్రత్యేకముగా తెలుపకపోవుటయే దీనికి కారణము కావచ్చును.

*4.32 (ముప్పది రెండవ శ్లోకం)*

*తస్యైవం ఖిలమాత్మానం మన్యమానస్య భిద్యతః|*

*కృష్ణస్య నారదోఽభ్యాగాదాశ్రమం ప్రాగుదాహృతమ్॥*

పూర్వము తెలుపబడినట్లు వ్యాసదేవుడు ఆ విధముగా తన లోపములకు పశ్చాత్తాపము చెందుచుండగా నారదముని సరస్వతీనది తటమున గల అతని ఆశ్రమమునకు అరుదంచెను.

*4.33 (ముప్పది మూడవ శ్లోకం)*

*తమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః|*

*పూజయామాస విధివన్నారధం సురపూజితమ్॥*

నారదముని శుభాగమనమును గాంచిన శ్రీవ్యాసదేవుడు గౌరవముతో లేచి నిలబడి సృష్టికర్తయైన బ్రహ్మకు ఇవ్వవలసిన గౌరవముతో ఆయనను అర్చించెను.

*శ్రీమద్భాగవతము నందలి "శ్రీనారదుని ఆగమనము" అను ప్రథమ స్కంధములోని నాలుగవ అధ్యాయము సంపూర్ణము*


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
*****************

కామెంట్‌లు లేవు: