23, ఆగస్టు 2020, ఆదివారం

Srimadhandhra Bhagavatham -- 97

బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయబూనుట
దుర్యోధనునకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. దుర్యోధనుడు అందరూ సైన్యంతో వెళ్లి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యమును ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి సాంబుడిని ప్రతిఘటించారు. సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడి ధనుస్సు విరిచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారధిని నిర్జించి సాంబుడిని, సాంబుడు తీసుకుపోతున్న కన్యయైన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనునకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశాడు. ఈవార్త ద్వారకా నగరమునకు చేరింది. వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధనుని మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు.
బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉన్నది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు. ఈమాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు నేను వెళతాను. దుర్యోధనునకు నాలుగుమంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను’ అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్లి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరిబయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు మహా బలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటపుడు ఉద్ధవుడిని పిలిచి చాలా అద్భుతమైన వేదాంత బోధ చేస్తాడు.    బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధనుని వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్లి ఒకమాట చెప్పాడు. ‘మీ అందరిచేత పూజింపబడవలసిన వాడయిన బలరాముడు పెద్దలయిన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనను సేవించ వలసినది’ అని చెప్పాడు. బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకొని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సేవించాడు. బలరాముడిని పొగిడాడు. బలరాముడు ‘నా తమ్ముడయిన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తెయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నీవు వానిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. నీవు నా తమ్ముని కుమారుని, కోడలిని విడిచిపెట్టి నాతో పంపవలసింది’ అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ‘ఏమి చెప్పావు బలరామా! కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడ! యాదవులయిన మీరెక్కడ! మీరు పశువులను తోలుకునే వారు, రాజ్యాధికారం లేదు మీకు మా పిల్ల కావలసి వచ్చిందా! నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉన్నది’ అని యయాతి శాపం చేత అసలు యాదవులయిన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులన్నీ ధరిస్తున్నారు. రాజభోగములనన్నిటిని అనుభవిస్తున్నారు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుడిని చూసి మిమ్ములను చూసి ఎవరూ గౌరవించలేదు. మీరు దుర్యోధనుడి గురువుగారు అని కౌరవులతో మీకు సంబంధం ఉన్నది. మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రానురాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియ్యమందాలని కోరిక పుట్టిందే మీకు! ఇది జరిగే పని కాదు. మీ హద్దులో మీరు ఉండడం మంచిది’ అని చెప్పి దుర్యోధనుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేదు. ఆయనతో మాటలాడడమేమిటన్నట్లుగా వెళ్ళిపోయాడు. అపుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా! ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి.
ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఏ పరమేశ్వరుని మందిరం కల్పవృక్షముల తోటయో, అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో, ఏ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుని పాదయుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి తాపత్రయ పడుతుందో, నిరంతరము సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను, చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడయిన శ్రీకృష్ణపరమాత్మ గొప్పతనం చేత ఇవ్వాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు’ అన్నది పరమ యథార్థము. ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి తగిన బుద్ధి చెప్పి తీరాలని లేచి గంగానది ఒడ్డుకు వెళ్లి ఈ హస్తినాపురము నంతటిని నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను’ అని తన నాగలిని హస్తినాపుర నేల లోపలికంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు ఇన్ని రాజసౌధములతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు అంతఃపురము కదిలింది. దుర్యోధనుడు ఏమి జరిగిందని అడిగాడు. నీవు అన్న మాటకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు’ అన్నారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగుపరుగున వచ్చాడు.
 దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండని ప్రార్థించాడు. బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలను ఇచ్చి లక్షణను సాంబుడిని రథము ఎక్కించి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది. ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది.
బలరాముడు తీర్థయాత్రకు జనుట
బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమయిన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపివేశాడు. సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు. సత్త్వ గుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి? అనగా బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనక పోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు. ఒకనాడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి ఇతనికి బుద్ధి చెప్పాలనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సూతుని కంఠం మీద కొట్ట్టాడు. కొడితే సూతమహర్షి కంఠం తెగిపోయి కిందపడిపోయాడు. సభలో హాహాకారములు చెలరేగాయి. బలరాముడు ‘నాపట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు నేను ఆయన కంఠమును నరికేశాను’ అన్నాడు. అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు ‘బలరామా! నీవలన జరుగకూడని అపచారం జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము ‘నీకు తెలియని రహస్యములున్నాయా! నీకు తెలియని ధర్మ సూక్షములున్నాయా! ఆయనకు మేము బ్రహ్మాసనమును ఇచ్చాము. ఆయన బ్రహ్మయై కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు. బ్రహ్మగా కూర్చుని వాడు లేచి నిలబడవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు సూతునియందు దోషం లేదు. ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నీవు చేసినది సామాన్యమయిన పాపం కాదు’ అని చెప్పారు.
  బలరాముడు తానుచేసిన పనికి చాలా బాధపడి ఇప్పుడు నేను ఏమి చేయాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి’ అని అడిగాడు. మహర్షులు ‘నేను అనంతుడను’ అని అన్నావు కదా! ఆ ఈశ్వరశక్తితో సూతుడికి మరల ప్రాణం పోయవలసింది అన్నారు. బలరాముడు ‘నిజమే సూతుడు బ్రతక వలసిన వాడు. లోకమునకు పనికివచ్చేవాడు. ఈ సూతుడిని నా యోగ శక్తిచేత బ్రతికిస్తాను’ అన్నాడు. ఇకపై సూతునకు రోగమనేది ఉండదు. బుద్ధియందు ధారణశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. సామర్థ్యములను సూతునకిచ్చి పునఃజీవితమును ఇస్తున్నానని మరణించిన సూతుని బ్రతికించాడు. నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరు ఇంకా ఏదయినా అడగండి చేసిపెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చెయ్యడం తప్పుకాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిద్దిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది.
****************

కామెంట్‌లు లేవు: