23, ఆగస్టు 2020, ఆదివారం

తార్కిక నిగూఢ రహస్యాలు

ఆధునిక సైన్స్ పరిశోధించిన తరువాత ఒక స్థాయి దాటిన తరువాత ఇంక ఇది ఎందుకు అలా అయిందో తెలియలేదు, తరువాత ఏమవుతుందో అని చెప్తూ ఇలా జరగవచ్చు లేదా ఇలా అయి ఉండవచ్చు అని అంటుంది. ఈ విషయం భవిష్యత్ లో ప్రయోగాలు ద్వారా నిరూపింపబడే అవకాశం ఉంది అంటారు.

సనాథనాధర్మం అదే సైన్స్ తర్కాన్ని అంటే పురుషుడు-ఎనర్జీ, ప్రకృతి-మేటర్ తో మొదలుపెట్టి ఇంకా శోధించి ముందుకు తీసుకుపోయి ఉన్నది ఒకటే దానిలో కలిస్తే ఇక చివరికి ఏదీ ఉండదు అని చెపుతుంది. ఉన్నవి రెండు కాదు ఒకటే అని చెపుతుంది.

ఇది సులువుగా అర్ధం కావడానికి రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తారు..

ఒక ఉప్పు మనిషి తన ఉనికి కి మూలం ఏమిటీ అన్ని శోధించి చివరకు అనంతమైన సముద్రం దగ్గరకు వచ్చి దానిలో దిగి శోధిద్దామనుకుంటాడు. ఒక సారి దిగిన తరువాత సముద్రంలొ కలిసి ప్రత్యేక ఉనికి కోల్పోతాడు. అంటే ఆధ్యాత్మికత ప్రకారం ప్రయత్నం చేస్తూ ఆ స్టేజ్ కి చేరినవాడికి ప్రత్యేక ఉనికి ఉండదు. ఆ పరబ్రహ్మము లోనే లీనమై దానిలోనే అవిభాజనీయంగా ఐక్యం అయి పోతాడు.

అయితే హిందూ గ్రంధాల ప్రకారం. ఈ చివరి స్థితికి చేరడానికి కఠోర పరిశ్రమ చేయవలసి ఉంటుంది (ఒక ఆధునిక శాస్త్రజ్ఞుడి లాగానే..)

ఇబ్బంది ఏమిటంటే ఒక ఆధునిక శాస్త్రవేత్త చాలా పెద్ద ప్రయోగం తలపెట్టినపుడు  అంతకు ముందు ఎవరూ కనిపెట్టనవి, లేదా మానవాళికి చాలా బాగా ఉపయోగపడేవి, ఆ శాస్త్రజ్ఞునికి విపరీతమైన పేరు తెచ్చేవి ఈ ప్రయోగం మధ్యలో తారసపడవచ్చు. కొందరు శాస్త్రజ్ఞులు తాము అనుకున్న లక్ష్యం చేరడానికి ముందే ఈ విధమైన ఆకర్షణీయమైన ఆశలకు, అడ్డంకులకు లొంగిపోయి (చివరి లక్ష్యం వరకు చేరినా  మధ్యలో దొరికినవి తరువాత కూడా లభిస్తాయి అన్న స్పృహ తొందరగా పేరు రావాలి అన్న ఆశ వల్ల ఆ నిమిషంలో కోల్పాతాడు ) ఈ చిన్న చిన్న ఆశలకు లొంగిపోవడం వల్ల తను మొదట్లో నిర్దేశించుకున్న లక్ష్యం చేరడానికి ముందే ప్రయోగం మధ్యలో ఆపేస్తాడు. ఇటువంటి వారికి సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ పేరుప్రఖ్యాతులకు కొందరు పూర్తిగా సంతృప్తి చెంది ముందు అనుకున్న నిర్దిష్ట గమ్యం గురించి పట్టించుకోరు. కానీ కొందరిలో తాము ముందుగా అనుకున్న గమ్యం చేరలేకపోయామే అన్న అసంతృప్తి బాగా లోపల ఉంటుంది. అందువల్లే ఆ గమ్యం చేరడానికి మళ్లీ కొత్త ప్రయోగాలు మొదలుపెడతాడు. 

ఇదే ఆధ్యాత్మిక సాధనలోనూ ఇబ్బంది.
నిజంగా బాగా కఠోర పరిశ్రమ చేసి అన్ని స్టేజిలు దాటుకుంటూ మధ్యలో దొరికిన వాటిని నిర్లక్ష్యం చేస్తూ వెళ్తేనే అంతిమ లక్ష్యం చేరుకోగలరు. 

కానీ ఇబ్బంది ఏమిటంటే ఒక్కో స్టేజి దాటున్న కొద్దీ కొన్ని మహత్యాలు ప్రదర్శించగల సిద్ధులు లభిస్తాయి. ఈ సిద్ధులు చాలా ఆకర్షణీయ ప్రలోభాలుగా గా ఉంటాయి. వాటినే 'అణిమాది అష్ట సిద్ధులు ' అని పేర్కొన్నారు.

అవి. 
1.అణిమ (అణువు కంటే చిన్న ఆకారం ధరించడం)
2.మహిమ(దేహం ఊహించనంత పెద్దది చేసుకోవడం)
3.లఘిమ(దూది పింజలా బాగా తేలిక అయిపోవడం)
4.ప్రాప్తి (దూరాలు రెప్ప పాటులో వెళ్లడం, లేదా దూరంగా ఉన్నదాని/వాటి గురించి చెప్పగలగడం)
5. ప్రాకామ్యం ( విన్నవి ,చూసినవి తనకు ఇష్టం వచ్చినట్లు చేయగలగడం)
6. ఈశత్వం (భూత పిశాచులను సంకల్ప మాత్రంతో ప్రేరేపించడం)
7.వశిత్వం (వశీకరణ)
8. ఆఖరిది -సత్య సంకల్పం
(అంటే తాను సంకల్పించిన దానిని వెంటనే జరిగే టట్లు చేయగలగడం)

కొందరు  పైన చెప్పిన అడ్డంకులకు (అంటే ఈ సిద్ధులు)  లొంగిపోయి ఆ సిద్ధులు లభించగానే తమ ఆధ్యాత్మిక శోధన ఆపేసి మహిమలు గల సిద్ధపురుషులుగా, బాబాలుగా ఉండిపోతారు. వారికి మహిమలూ ఉంటాయి ఇక్కడ ప్రాపంచిక విషయాలతో సంబంధాలు కూడా కలిగి ఉంటారు. వారికి లభించిన సిద్ధులు వినియోగించడం  దేహనంతరం మళ్లీ పునర్జన్మ చక్రంలో నే తిరుగుతూ వుంటారు ఇంకా పై స్టేజికి వెళ్లే సాధన చేసి సాధించేవరకు. 

అదే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, చంద్రశేఖర సరస్వతి వంటి వారు చివరి వరకూ వెళ్లి లక్ష్యం చేరుకున్నారు.

రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వంటి వారు ప్రాపంచిక లోకంలో ఉన్నా తాము రోజూ వారీ చేసే కర్మలకు కూడా బద్ధులు కారు.
వారికి జగత్తు అంతా మనకి ఒక సినిమా 
చూసినట్లే ఉంటుంది. సినిమాలో జరుగుతున్న వాటికి ప్రేక్షకులకు ఏ విధంగా సంబంధం ఉండదో అలాగే వారికి జగత్తులో జరిగే విషయాలతో సంబంధం ఉండదు ఒట్టి పరిశీలకులుగా మాత్రమే వుంటారు. వీరికి అణిమాది సిద్ధులు అన్ని ఉంటాయి. కానీ వారు వాటిని పనికిరానివిగా, తుచ్ఛమైనవిగా పట్టించుకోరు కావాలని వాటిని ప్రదర్శించరు.  కానీ అప్పుడప్పుడు అవి అసంకల్పితంగా వ్యక్తం
అవుతూ మహత్యాలుగా మనకు కనిపిస్తాయి.

మన పూర్వీకులు పైన చెప్పినదంతా ఏ శోధనా లేకుండా ఊరికే నవలలు రాసినట్లు ప్రాచీన గ్రంధాల్లో రాసారు అని హేతువాదులు అంటూ ఉంటారు.  ఎంత లోతైన విచారణ చేస్తే కానీ ఇటువంటి తార్కిక నిగూఢ రహస్యాలు తెలుసుకోగలరు? మరో ధర్మంలో కానీ సంస్కృతి లోని కానీ ఇటువంటి ఉన్నతమైన తాత్విక చింతన చూడగలమా?
********************

కామెంట్‌లు లేవు: