23, ఆగస్టు 2020, ఆదివారం

*ఇది మన సంప్రదాయం*

*జైశ్రీమన్నారాయణ - జైశ్రీహనుమాన్*

సందేహం;- ప్రతి విషయంలోను *ఇది మన సంప్రదాయం* అంటూ ఉంటారు. సంప్రదాయం అంటే ఏమిటి?

సమాధానం;- మన ప్రాచీన ఋషులు, పెద్దలు, తాతలు అంటే పూర్వీకులు  మనకిచ్చిన సంస్కారం, ధర్మం, సంస్కృతి ఇవే సంప్రదాయం అంటే. తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమించే సంపదను *దాయం* అంటారు.

ఈ దాయం ఏ రూపంలోనైనా ఉండవచ్చు. దాయాదులు, దాయభాగం అన్న మాటలు *దాయం* లోంచి వచ్చినవే. ఇలా వచ్చిన ఆస్తిపాస్తులు స్థిరంగా ఉండేవి కావు. అవి పెరుగుతాయి, తరుగుతాయి, వస్తాయి, పోతాయి.

ఇలా కాకుండా, మన జీవితాన్ని ఉన్నత మార్గంలో నడుపుకోవడానికి, మనం పదిమందిలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగేటట్లుగా మనల్ని తీర్చిదిద్దే సంస్కార పరంపరే సంప్రదాయం. ఇది తరతరాలకూ తరగని బంగారు గని. ఇది ఏ ఒక్క వ్యక్తి  కూడబెట్టలేనిది. విదేశాల నుంచి అరువు తెచ్చుకోలేనిది. అందుకే ఇది సంప్రదాయం అయింది.

పెద్దల వల్ల వచ్చినది దాయం. చక్కగా, సదాచారయుతంగా అందించబడేది ప్రదాయం. ప్రేమతో విశిష్టంగా ప్రదానం చేయబడేది సంప్రదాయం. సంప్రదాయ వాదులు అభివృద్ధి నిరోధకులు, మత దురభిమానులు, పిడివాదులు కారు. ఈ అపార్థం తొలగిపోవాలి.

ఈ సంప్రదాయం సనాతనం కూడా అవుతుంది. సనాతనం అంటే ప్రాచీనం పాతచింతకాయ పచ్చడి కాదు. సనాతనం అంటే త్రైకాలికం. గతంలో ఎలా ఉందో, వర్తమానంలోనూ, భవిష్యత్తులోను అలాగే ఉండేది. అది నిత్య నూతనం.

తోటి వారిని గౌరవించడం, పెద్దలను, గురువులను, అతిథి అభ్యాగతులను పూజించడం, ఆదరించడం, మాధవసేవగా సర్వ ప్రాణి కోటి సేవ చేయడం, స్వీయ ఆరాధన, సర్వాదరణ, దయ, ప్రేమ, సహానుభూతి సనాతన సంప్రదాయ ప్రతిరూపాలే *సంప్రదాయం* అంటే.

*శుభంభూయాత్*
***************

కామెంట్‌లు లేవు: