23, ఆగస్టు 2020, ఆదివారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*16.1 (ప్రథమ శ్లోకము)*

*ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా|*

*హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్॥6896॥*

*శ్రీశుకుడు వచించెను* - "పరీక్షిన్మహారాజా! దేవతలు ఈ విధముగ స్వర్గమునుండి పారిపోయి దాగికొనగ దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతట దేవమాతయైన అదితి అనాథవలె మిగుల దుఃఖించెను".

*16.2 (రెండవ శ్లోకము)*

*ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్|*

*నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్॥6897॥*

"ప్రజాపతియైన కశ్యపుడు చాలదినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడప్ఫుడతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అచట సుఖశాంతులుగాని, ఏవిధమైన ఉత్సాహముగాని, అలంకరణములు గాని, లేకుండుట గమనించెను".

*16.3 (మూడవ శ్లోకము)*

*స పత్నీం దీనవదనాం కృతాసనపరిగ్రహః|*

*సభాజితో యథాన్యాయమిదమాహ కురూద్వహ॥6898॥*

"మహారాజా! అచటికి వెళ్ళి, సుఖాసీనుడైన పిదప అదితి విధ్యుక్తముగా ఆయనను సత్కరించెను. అపుడు అదితి ముఖము దైన్యముతో వాడిపోయి యుండుటను జూచి కశ్యపుడు ఆమెతో ఇట్లనెను"

*16.4 (నాలుగవ శ్లోకము)*

*అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేఽధునాఽఽగతమ్|*

*న ధర్మస్య న లోకస్య మృత్యోశ్ఛందానువర్తినః॥6899॥*

"కల్యాణీ! ఇప్పుడు బ్రాహ్మణులకు ఎట్టి ఆపదయు కలుగలేదుగదా! ధర్మపాలన చక్కగా కొనసాగుచున్నదిగదా! భయంకరమైన కాలమునకు వశులైన జనులకు ఎట్టి అశుభమూ ప్రాప్తింపలేదుగదా!"

*16.5 (ఐదవ శ్లోకము)*

*అపి వాకుశలం కించిద్గృహేషు గృహమేధిని|*

*ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినామ్॥6900॥*

"గృహిణీ! యోగసాధన చేయని వారికి గూడ గృహస్థాశ్రమమున యోగసాధన ఫలము లభించును. ఈ గృహస్థాశ్రమము నందు ధర్మార్థ కామములను ఆచరించుటలో ఏవిధమైన విఘ్నములును వాటిల్లలేదుగదా!"

*16.6 (ఆరవ శ్లోకము)*

*అపి వాతిథయోఽభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా|*

*గృహాదపూజితా యాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్॥6901॥*

*16.7 (ఏడవ శ్లోకము)*

*గృహేషు యేష్వతిథయో నార్చితాః సలిలైరపి|*

*యది నిర్యాంతి తే నూనం ఫేరురాజగృహోపమాః॥6902॥*

"దేవీ! నీవు గృహకార్యములయందు నిమగ్నురాలవై అలసిసొలసి ఉండవచ్చును. అప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు నీ చేత అతిథి సత్కారములు అందుకొనకయే మరలిపోయి యుండవచ్చును. అందువలన నీకు ధైర్యము కల్గియుండవచ్చును. కనీసము నీరైనను త్రాగకుంఢ అతిథులు వెళ్ళిపోయినచో, అట్టి గృహము నక్కల నివాసమునకు సమానము".

*16.8 (ప్రథమ శ్లోకము)*

*అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి|*

*త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్॥6903॥*

"శుభాంగీ! నేను ఎప్పుడైననూ బయటికి వెళ్ళినప్పుడు ఉద్విగ్నతకు లోనై నీవు అగ్నులయందు హవిస్సులను సకాలమున సమర్పింపలేదా? యేమి?"

*16.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యత్పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్వితః|*

*బ్రాహ్మణోఽగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖమ్॥6904॥*

"బ్రాహ్మణులు, అగ్ని, సర్వదేవమయుడైన శ్రీహరికి ముఖము వంటివారు. ఈ ఇద్దరిని పూజించిన గృహస్థుడు సకలకోరికలు పూర్తిగా నెరవేరునట్టి లోకములను పొందును".

*16.10 (పదియవ శ్లోకము)*

*అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని|*

*లక్షయేఽస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహమ్॥6905॥*

"సాధ్వీ! నీవు సర్వదా ప్రసన్నురాలవై యుందువు. కాని, ఇప్పుడు నీ ముఖ లక్షణములను చూచినచో, నీ చిత్తము ఏదో ఒక ఆందోళనకు గురియైనట్లు తోచుచున్నది. నీ పుత్రులు అందరును క్షేమమేగదా!"

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

కామెంట్‌లు లేవు: