23, ఆగస్టు 2020, ఆదివారం

ఋణాను బంధo

*ఆధ్యాత్మికత అంటే..!*_
_{అందరినీ ప్రేమించటం }_

_ఆధ్యాత్మికత ఆంటే మనం నిత్యంచేసే పనుల్ని వదిలిపెట్టకుండా ఇంకా నైపుణ్యంతో చేయాలి అని అర్ధం._

_నీలోని నీశక్తి గ్రహించి, నువ్వంటే ఎవరివో తెలుసుకుని జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడమే  ఆధ్యాత్మికత._

_ఈ ఆధ్యాత్మికత మనల్ని ఇంకా శక్తి మంతుడిని, జ్ఞానిని, ప్రతిభావంతుడిని చేస్తుంది._

_అందుకే  *"నహి జ్ఞానేన సదృశం"* అన్నది భగవద్గీత. మనలో జ్ఞానం ఆధ్యాత్మికత ఎంత ఉన్నాయో కనీసం వారానికి. ఒక్కరోజు అయినా పరిశీలించు కోవడం మంచింది. కాలం కర్పూరం కొద్దిగా కూడా ఉపయోగించక పోయినా కరిగి  పోతాయి._

_గతంలో మనం చేసుకున్న సత్కర్మల వలన లభించే గొప్ప అవకాశాలు మన నిర్లక్ష్యం బద్ధకం అజాగ్రత్త వలన చేజారి పోతాయి._

_ఆధ్యాత్మిక ప్రస్థానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్షణ కాలమైనా దాని పైనుండి దృష్టి మరల్చని స్థితియే ఏకాగ్రత. ఏ ఆకర్షణలు లౌకికమైన ఇంద్రియ సుఖాలు, ఆఖరికి జీవితంలోని మమతా మొహాలు కూడా నీ దృష్టిని మరల్చకూడదు._
     
_నీవు నీఆధ్యాత్మిక ప్రస్థానంతో తాదాత్మ్యం కావాలి. ఇదే సమయంలో మనం మన స్వధర్మాలను ఎంత మాత్రం మరచి పోకూడదు. నిత్య జీవితంలోని మనం నెరవేర్చ వలసిన ప్రతి పనిని మరింత నైపుణ్యంతో శ్రద్ధగా చేయాలి. లక్ష్యం స్థిరంగా ఉండాలి._

_ఆధ్యాత్మికత పేరుతో దీనికి లోపం కలిగిస్తే ఏ వ్యక్తితో మనకి ఉన్న ఈ జన్మలో తీర్చ వలసిన కర్మ ఋణాన్ని తీర్చక పోతే, అది రాబోయే జన్మ జన్మలకి వాయిదాపడే ప్రమాదముంది. ఇది కుటుంబంలోని వ్యక్తులకీ వర్తిస్తుంది, అనుబంధాలకీ, శత్రుత్వాలకీ కూడా వర్తిస్తుంది._

_ఈ కారణంగానే మనం కోరుకున్న వారితో కంటే, మనం కోరుకోని  వారితోనే వేదనా భరితంగాఎక్కువ  జీవితం గడపవలసి వస్తుంది. అనివార్యమైన బంధాలు బంధనాల్లా, వేదనకు గురి చేసినా సహనంతో భరించక తప్పదు.._

_మీకు ఓ సందేహం రావచ్చు. వేధిస్తూ మనతోటే అనివార్యంగా జీవించే వారిని ఎదిరించి దూరంగా వెళ్ళి పోకూడదా అని..?_

_అన్ని బంధాలను వదిలించుకోవడం సాధ్యం కాదు. 'ఋణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాదాయా' అన్నారు._

_జీవులని ఋణాలు కలుపుతాయి. ప్రేమలూ కలుపుతాయి. రుణం తీరి పోతుంది. ప్రేమతో ఏర్పడ్డ బంధం పెరుగుతుంది. రుణం తీరిపోయిన వాళ్ళు ఒక్క క్షణం కూడా మనతో ఉండరు._

_ప్రేమ బంధం కలిగిన వారు ఎప్పటికి వెంటే ఉంటారు._

_అందరినీ ప్రేమిద్దాం. అందరితో ఋణానుబంధం కాక ప్రేమానుబంధం పొందుదాం. ఏకాగ్రత సాధిద్దాం !_
*******************

కామెంట్‌లు లేవు: