23, ఆగస్టు 2020, ఆదివారం

దీపారాధన

దీపారాధన చేయటంలో అర్థం ఏమిటి? పూజా మందిరంలో దేవుని ముందు దీపం వెలిగించడం లో మన పూర్వీకులు చాలా వేదాంతం చేర్చిపెట్టారు. నూనె, వత్తి, జ్వాల ఈ మూడింటిని ఎలా వర్ణించారో చూద్దాం. నూనె ను కర్మ ఫలంగానూ, వత్తిని శరీరం గానూ, జ్వాల ను ప్రాణం గానూ భావించారు. కర్మ ఫలం అనే నూనె ఉన్నంతవరకే, వత్తి అనే శరీరంలో, జ్వాల అనే ప్రాణం ఉంటుంది. కర్మ ఫలం పూర్తి అవగానే ప్రాణం శరీరాన్ని వదిలి పెడుతుంది. జ్వాల వెలుగులో దేవున్ని స్పష్టం గా చూస్తూ, చుట్టూ ఉన్న చీకటి ని తొలగిస్తాం. అదేవిధంగా శరీరంలో ప్రాణం ఉండగానే అఙ్ఞానమనే చీకటిని తొలగించి, మనలో ఉన్న ఆత్మను దర్శించమని అర్థం. దేవుని ముందు దీపారాధన చేసేటప్పుడు రెండు ప్రమిదలలో ఒక్కొక్క వత్తి వేసి వెలిగిస్తాము. లేదా ఒకే ప్రమిదలో రెండు వత్తులు వేసి వెలిగిస్తాము. కర్మ ఫలం అనుభవించేటప్పుడు జీవాత్మ తో పాటు పరమాత్మ కూడా సాక్షిగా ఉంటాడు. అందుకే రెండు వత్తులు వేసి వెలిగిస్తారు. దీపం మధ్యలో ఆరిపోతే పాత వత్తి తీసి అదే నూనెలో ఇంకో వత్తి పెట్టి వెలిగిస్తారు. అంటే ఒకసారి ప్రాణం పోయిన శరీరం పనికిరాదని అర్థం. మానవుడు చనిపోయినప్పుడు శిరస్సు వద్ద ఒకే వత్తితో దీపం పెడతారు. అంటే జీవాత్మ పరమాత్మలో కలిసిపోయిందని అర్థం. ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర. సేకరణ
**************

కామెంట్‌లు లేవు: