ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే ‘వినాయక చవితి’ జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను (బంగారంతోగానీ, వెండితోగానీ, రాగితోగానీ, మట్టితోగానీ, ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని చేసినది) అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు(మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవికాక శాస్త్రంలో చెప్పబడిన 21పత్రాలతో పూజించాలి. ఇవన్నీ ఒషధీయ విలువలున్న పత్రాలు.
ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ప్రతి ఇంటా యథావిధి గణపతిని పత్రాలతో పూజించి ఆయనకు ప్రీతికరంగా ఉండ్రాళ్ళు, కుడుములు, వెలగ, అరటి, కొబ్బరి మొదలైన ఫలాలు నివేదించాలి.
పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వ్రేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఈస్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయి. వెంటనే దయ చూపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు.
***************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి