27, ఆగస్టు 2020, గురువారం

Voleti Venkateswarlu

Today is the birth day of great vidvan Sri Voleti Venkateswarlu 🙏
         🌷🌷🌷
'నిద్దుర నిరాకరించి,ముద్దుగ తంబుర బట్టి,శుద్ధమైన మనసుతో,సుస్వరముతో,పద్దుతప్పక భజియించే' ...తోడిరాగంలోని ఈ త్యాగయ్య కృతి వినగానే, నాకు ఒక గాయకుని ఆకృతి మదిలో మెదలుతుంది.  ఆయనెవరో కాదు...నిండైన విగ్రహంతో,ధవళ వస్త్రధారులై,తంబుర చేతబూని,కనులు మూసుకొని,తాదాత్మ్య స్థితిలో, గానాంబుధిలో తనిసి, తరించే ఓలేటి వేంకటేశ్వర్లుగారు.
ఒక విలక్షణమైన సంగీతం ఆయనది...గ్రీష్మఋతువులాంటి వెచ్చనైన కర్ణాటక సంగీతం పాడుతూ, అలవోకగా శరదృతువులో ప్రవేశించి, చల్లని వెన్నెలలాంటి హిందుస్థానీ సంగీతాన్ని స్పృశించి, పరవశింపజేయగల సవ్యసాచి ఆయన!
ఆయనకున్న స్వరజ్ఞానం అనన్యసామాన్యం. రేడియోలో ఎవరయినా ఒక కీర్తన పాడుతుంటే, వింటూ, అదే వేగంతో ఆ సాహిత్యాన్ని స్వరసహితంగా వ్రాసేసేవారాయన!
పుట్టింది- 27-8-1928న, రాజమహేంద్రిలో, సంగీతంలో తొలి పాఠాలు నేర్చింది- అచ్యుతరామయ్య శాస్త్రి, మునుగంటి వెంకటరావు పంతులుగార్ల వద్ద. అయితే, ఆయనకు బాణి నేర్పినవారు డా.శ్రీపాద పినాకపాణిగారు. 'ఓలేటిలాంటి ప్రజ్ఞాశాలి ఇక పుట్టడు' అంటారు గురువు పాణిగారు.
బెజవాడ ఆకాశవాణి చేసుకున్న అదృష్టమేమిటో! ఓలేటిగారి వంటి స్రష్టలను అక్కునచేర్చుకుంది. 1966 లో రేడియో ప్రవేశం చేసిన నాటినుండి, సంగీత ప్రయోక్తగా ఆయన నెరపని సంగీత ప్రక్రియలేదు. 'భక్తిరంజని' కోసం ఎంతో ప్రయాసకోర్చి, ఆధ్యాత్మరామాయణ కీర్తనలను సేకరించారు. సదాశివబ్రహ్మేంద్రసరస్వతి కీర్తనలను, నారాయణతీర్థ తరంగాలను స్వరపరచి, పదిలపరిచారు.  ఎన్నో యక్షగానాలకు రూపునిచ్చారు. లలితగీతాలకు బాణీలు కట్టారు.  ఆయన పాడిన 'హనుమాన్ చాలీసా' బహుళ ప్రసిద్ధమైనది.  'నగవులు నిజమని', 'కందర్ప జనక' లాంటి అన్నమయ్య కీర్తనలను, ' మనసౌనే ఓ రాధ', 'తలనిండ పూదండ' వంటి లలితగీతాలను, 'భజోరే భయ్యా'..వంటి హిందీ భజన్లు, స్వరపరచి, ఆలపించారాయన.
హిందుస్థానీ సంగీత దిగ్గజం- బడేగులాం ఆలీఖాన్, ఆయనకు దైవ సమానులు.  ఒకమారు ఖాన్ గారు హైదరాబాదులో కచేరీ నిమిత్తం వచ్చినపుడు వారి దర్శనంచేసుకున్న ఓలేటిగారు,  'మీరు అనుమతిస్తే, మీరు రికార్డులో పాడిన ఒక ఠుమ్రీని పాడి, వినిపిస్తాను' అన్నారట. 'పాడమని' సంజ్ఞచేశారు ఖాన్ సాహెబ్.  అంతే..ఓలేటిగారు కనులు మూసుకొని, గానం ఆరంభించారు.  ఖాన్ గారితో సహా అక్కడ ఉన్న యావన్మందీ మంత్రముగ్ధులయ్యారు. గానం పూర్తి అయింది.  ఖాన్ సాహెబ్ ఓలేటిగారితో 'నిజంగా ఆ రికార్డులో నేనింత బాగా పాడానా!' అన్నారట ఆనందంగా..
      ఓలేటిగారు,ఖాన్ గారికి ఎంత అభిమాని అంటే, తన గాత్రాన్నే కాదు, శరీరాకృతిని కూడా ఖాన్ గారిలా మార్చుకున్నారేమో! అనిపించేది.
ఓలేటిగారు నిగర్వి, అల్పసంతోషి.  'ఒక బహుళ అంతస్థుల భవంతి, తానే గొప్పని, ఎత్తైనదానినని విర్రవీగితే, ఏంలాభం?  చిన్న పిట్ట ఎగిరి, దాని నెత్తిమీద కూర్చోదుటండీ!  ఈనాటి ప్రతిభావంతులైన పిల్లలు పాడుతున్న సంగీతం ముందు, మన సంగీతమెంత సార్..?' అనేవారు మిత్రులతో ఆయన.  నిజం చెప్పాలంటే, ఆయనకు తెలుగునాటకన్నా, తక్కినచోట్లనే అభిమానులు మెండు.  మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో ఆయన చేసిన చిట్టచివరి కచేరీ వినే అదృష్టం కలిగింది నాకు.  వరాళి రాగం ఆనాటి ప్రధానాంశం. రసప్రవాహమై సాగిన నాటి కచేరీ అనంతరం, అసంఖ్యాక శ్రోతలు వేదికపైకి తోసుకొచ్చి, వోలేటిగారి పాదాలను తాకి నమస్కరించిన దృశ్యం నేను మరువలేను.  ఆనాడు కోయంబత్తూరు వంటి దూర నగరాలనుండి వచ్చిన సంగీత సభానిర్వాహకులు ఎందరో, తమ సభలో కచేరీ చేయవలసిందిగా అర్థిస్తే, 'నేను ప్రయాణం చేసి రాలేనని' సున్నితంగా వోలేటిగారు తిరస్కరించటం ఇంకా గుర్తుంది నాకు.
అదే..ఓలేటిగారి కచేరీ, ఒకసారి బెజవాడ రోటరీ ఆడిటోరియంలో జరిగితే, పట్టుమని పాతిక మంది లేరు.  కనులు మూసుకొని తన పాటలో లీనమైపోయిన ఓలేటిగారిని చూస్తే నాకప్పుడనిపించింది,  'ఏ శ్రోతలు వింటున్నారని కొమ్మ గుబురుల్లో దాగి, అంత కమ్మగా కోయిలమ్మ పాడుతుంది?' అని.
ఓలేటిగారు రేడియోలో నిర్వహించిన 'సంగీత శ్యామల' అనే రూపకంలో చిన్నప్పటి శ్యామశాస్త్రి పాత్రలో నటించే అవకాశం వచ్చింది నాకు.  అప్పుడు నాకు పధ్నాలుగేళ్ళు.  నాటరాగంలో బీజాక్షరాలతో కూడిన ఒక శ్లోకం పాడవలసి వచ్చింది.  రాగం మీదే దృష్టి పెడుతూ, శ్లోకం అనలేకపోతున్న నాతో, 'నువ్వు రాగం గురించి ఆలోచించకు.  అది ఎలాగూ తప్పురాదు నీకు.  ఉచ్చరించే అక్షరాలపై మనసుపెట్టి చూడు' అన్నారాయన.  ఆశ్చర్యం!  అది పాటించిన వెంటనే ఆశ్లోకాన్ని దోషరహితంగా పాడగలిగాను. నా గాత్రాన్ని మెచ్చుకొని, నన్ను ప్రోత్సహించేవారాయన.
ఓలేటిగారికి ముఖతః పెద్దగా శిష్యులు లేరనే చెప్పాలి.  అయితే, బెజవాడ రేడియోలో సుదీర్ఘ కాలం ఆయన నిర్వహించిన 'సంగీత శిక్షణ' ప్రసారం కోసం, తమిళనాట కూడా విద్యార్థులు ఎదురు చూసేవారు.  కొన్ని వందల కృతులు ఆవిధంగా ఆయన నేర్పారు.  రేడియో వారి 'వాణి' అనే పక్షపత్రికలో ఆ కృతుల స్వరలిపి ప్రచురింపబడేది.
మెహ్దీ హసన్, గులాం ఆలీ గజల్స్ అంటే ప్రాణమిచ్చేవారాయన!  ఆ గాయకులు ఆలపించిన బాణీలకు రజని, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గార్లవంటి కవులచే సాహిత్యం వ్రాయించుకొని, పాడేవారాయన!
కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు, 'సంగీత చూడామణి', 'సుర్ సింగార్' బిరుదులు మాత్రం లభించాయి ఆయనకు.  ప్రఖ్యాత వైలిన్ విద్వాంసులు లాల్గుడి జయరామన్ గారు, ఓలేటిగారి కోరిక మేరకు 'పహాడి' రాగంలో తిల్లానా రచించారు.
29-12-1989 న తనువు చాలించిన ఓలేటి వేంకటేశ్వర్లు గారిని తెలుగు రాష్ట్రాలవారు మరచినా, నరేంద్రనాథ్ మీనన్ గారి వంటివారు వారిని సంస్మరించుకుంటూ తమిళనాట, ఈనాటికీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

-Modumudi Sudhakar

కామెంట్‌లు లేవు: