27, ఆగస్టు 2020, గురువారం

అన్నమాచర్య చరితము -- 2

నారాయణయ్యను నందవరీకుడు
          కాపురంబుండె నా గ్రామమందు
బాల్యంబు నందునా బాలున కెందుకో
          చదువు లబ్బకనుండె సక్రమముగ
గురువులు పెట్టెడి గురుహింస వలనను
           విపరీత మైనట్టి విసుగుబుట్టె
బహు విరక్తియు బుట్టి బ్రతుకన్న యతనికి
           చావంగ దలచెను చదువు నొదలి
అంత చింతలమ్మ యను గ్రామదేవత
మందిరంబు చెంత మహినియున్న
పుట్ట లోన చెయ్యి పెట్టెనాతం డంత
సర్ప కాటు తోడ చచ్చు టకును 

అంత టమ్మవారు యద్భుత మహిమతో
కరుణ తోడ నతని గావ నెంచి
బాలు నెదుట తాను  ప్రత్యక్ష మయ్యును
పరమ వత్స లతతొ బలికె నిట్లు

"సాహసం బేల నీకిట్లు చచ్చుటకును
కలత చెందకు బాలక కలదు శుభము
తప్పకను నీదు మూడవతరము నందు
బాలుడుదయించు శ్రీహరి భావమందు "

అంతట శ్రీ నారాయణ
సంతోషము పొంది మిగుల స్వాంతము నందున్
గెంతుచు వెళ్ళియు గృహముకు
పంతుళ్ళకు జెప్పి మిగుల పరవశమొందెన్

అవని నారాయణయ్యయు యమ్మ కృపన
పెఱిగి పెద్దయ్యు ద్విజులందు పెంపు పొందె
పరిణయంబాడి పుత్రుని బడసి యతడు
పేరు నారాయణ నుచును బెట్టు కొనియె

నారాయణు కృప వల్లను
నారాయణ సూరి బెఱిగి నాలుగు చదువుల్
పారాయణ మొనరించియు
పారీణత పొందె మిగుల పండితు లందున్

గోపాలుని మధుసూదన రావు
**********************

కామెంట్‌లు లేవు: