27, ఆగస్టు 2020, గురువారం

ధార్మిక గీత - 2

మనసును  మాట చేతయును
           మాన్యుల కుండును నేక పద్ధతిన్ ,
ననయము వారి జీవనము
           నందరి కుండును మార్గ దర్శియై,
మనసును మాట చేత నణు
           మాత్రము పొంతన లేక నుంద్రు దు
ర్మనుషులు లోకమందు ,
           మాన్యత లేకను మంచి లేకయున్.

గోపాలుని మధుసూదన రావు
                                     *****
          *శ్లో:- మన స్యేకం  వచ స్యేకం ౹*
                 *కర్మ ణ్యేకం మహాత్మనామ్*౹
                 *మన స్యన్యత్ వచ స్యన్యత్*౹
                 *కర్మ ణ్యన్యత్ దురాత్మనామ్*౹౹
                                        *****
*భా:- సన్మార్గులకు మనసు, మాట, చేత(పని) ఒకే విధంగా ఉంటాయి. ఇక దుర్మార్గులకు మనసులో ఒకటి, మాటలో మరొకటి, క్రియలో వేరే ఒకటి  ఉంటాయి.  మనం తలచే భావన,  మాట్లాడే మాట, చేసే పని ఒకే విధంగా ఉండాలి అని భావము. ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి  ఎదగాలంటే త్రికరణశుద్ధి అవసరము. ఈ త్రికరణ శుద్ధి వల్లనే  రాముడు, హరిశ్చంద్రుడు, శిబి, రంతి దేవుడు మున్నగు రాజన్యులు ప్రజారంజనముతో కీర్తిప్రతిష్ఠలను గడించి, శిఖరాగ్రాన భాసించ గలిగారు. సుయోధనుడు, కర్ణుడు, కంసుడు, శిశుపాలుడు, కీచకుడు మున్నగువారు సమర్థులైనప్పటికిని, దుస్సంగతివలన, మనోవాక్కాయలలో పొంతనలేనందున, దురాగతాలకు పాల్పడి, పాపకూపంలో కూరుకుపోయి చరిత్ర హీనులైనారు. ఇహపరసాధనకు కూడ త్రికరణాల ఐక్యత, పవిత్రత ఆలంబనము. భగవంతుని  అనుగ్రహప్ర్రాప్తికి  చిత్తశుద్ధి ; సత్యవాక్కు ; సత్ క్రియాచరణ  శాశ్వత సోపానాలని గ్రహించి మానవాళి పురోగమించాలని సారాంశము.*
                                   *****
                   *సమర్పణ   :   పీసపాటి*
******************

కామెంట్‌లు లేవు: