ఇది స్మార్తమతము. ఇందు బ్రహ్మమని అవిద్యయని రెండుపదార్థములు కలవు. అందు బ్రహ్మము సత్యము, జ్ఞానానందాత్మకము, నిర్వికారము, నిరవయవము, నిత్యము, నిర్దోషము, విభువు. (సత్యము = కాలత్రయముచే బాధింపఁదగనిది. నిర్వికారము = రూపాంతరములు లేనిది. నిరవయవము = అవయవములు లేనిది. నిత్యము = కాలత్రయములయందు ఉండునది. విభువు = వ్యాపనము కలిగి ఉండునది.)
అవిద్య అపారమార్థికము, సదసద్విలక్షణము, జడము, సవికారము, సావయవము, అనాది సాంతము, అజ్ఞానరూపము. (అపారమార్థికము = మిథ్యా భూతము. బ్రహ్మతత్వజ్ఞానముచేత నివర్తించునది. ఇది వ్యావహారికసత్త అని చెప్పఁబడుచున్నది. వ్యవహారదశలో సత్తుగా తోఁచును కాని పరమార్థము కాదు. సదసద్విలక్షణము = సత్తనఁగా బ్రహ్మము, అసత్తనఁగా తుచ్ఛమయిన శశశృంగాది; పారమార్థికసత్తయిన బ్రహ్మముకంటెను ప్రమాణసిద్ధముగాని తుచ్ఛముకంటెను విలక్షణమైనది. బ్రహ్మమువలె పారమార్థికము కాదు, తుచ్ఛమువలె ప్రమాణములకు అవిషయమును కాదు.)
ఈయవిద్య సత్వరజస్తమోరూపగుణత్రయాత్మకము. దీనికి ఆచ్ఛాదకశక్తి, విక్షేపశక్తి అని రెండుశక్తులు ఉన్నవి. ఆచ్ఛాదకశక్తికల యవిద్యచేత ఆవరింపఁబడిన బ్రహ్మమునకు చీఁకటిలో ఉన్నమనుష్యునకువలె స్వస్వరూపజ్ఞానము చెడి విక్షేపరూపమయిన దేవతిర్యఙ్మనుష్యాది భేదజ్ఞానము కలుగుచున్నది. ఈదేవాదిభేదములు అన్నియు అవిద్యాపరిణామములుగాని పరమార్థములు కావు.
ఈచైతన్యరూపమయిన బ్రహ్మము శుద్ధ చైతన్యము, మాయావచ్ఛిన్నచైతన్యము, అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము, వృత్త్యవచ్ఛిన్నచైతన్యము, విషయావచ్ఛిన్నచైతన్యము అని అయిదు భేదములుగలది. శుద్ధమైన బ్రహ్మస్వరూపమునకు ఈభేదములు అవిద్య మొదలుగాఁగల యుపాధులచేత కలుగుచున్నవి.
అందు శుద్ధచైతన్యము అనునది శుద్ధబ్రహ్మస్వరూపము.
మాయావచ్ఛిన్నచైతన్యము అనునది ఈశ్వరుఁడు. అతఁడె జగత్సృష్ట్యాదికర్త, సర్వాంతర్యామి, సగుణ బ్రహ్మము.
అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము అనునది జీవుఁడు. ఆకాశగతములయిన సూర్యాదితేజములు తటాకాదులయందు ప్రతిబింబించునట్లు తేజోమయమయిన బ్రహ్మచైతన్యము అవిద్యాపరిణామములయిన అంతఃకరణములయందు ప్రతిఫలించుచున్నది. ఇందు బ్రహ్మము బింబము, అంతఃకరణములయందు తోఁచునట్టివి ప్రతిబింబములు, అవియె జీవులు. సూర్యాదిబింబములకును జలములయందు తోఁచునట్టి ప్రతిబింబములకును భేదము లేనట్లు, బ్రహ్మజీవులకు భేదము లేదు. ప్రతిబింబభూతజీవులకును అంతఃకరణ రూపోపాధిభేదమే కాక స్వరూపభేదము లేదు.
వృత్త్యవచ్ఛిన్నచైతన్యము అనునది అంతఃకరణ పరిణామరూపవృత్తులయందు ప్రతిఫలించు చైతన్యము. ఇదియె జ్ఞానము అని చెప్పఁబడుచున్నది. ఇది ప్రత్యక్షాదిభేదములచే అనేకవిధములు కలదిగా ఉన్నది.
విషయావచ్ఛిన్నచైతన్యము ఘటపటాదులు.
ఇందు మాయావచ్ఛిన్నచైతన్యమైన యీశ్వరుఁడు మొదట సృజింపఁగల ప్రాణివర్గముల తారతమ్యమునకు హేతువగు కర్మములను తోడుచేసికొని అపరిమితశక్తియుక్తమైన మాయను వశపఱిచికొని నామరూపాత్మకమైన సకలప్రపంచమును సృజియింప సంకల్పించి మొదట ఆకాశాది పంచభూతములను అపంచీకృతములను పుట్టించెను. అందు ఆకాశమునకు శబ్దమును, వాయువునకు శబ్దస్పర్శములను, తేజస్సునకు శబ్దస్పర్శరూపములను, అప్పునకు శబ్దాదులతోడ రసమును, పృథివికి శబ్దాదులతోడ గంధములును గుణములు.
పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశమును అను నీపంచభూతములును, గుణత్రయాత్మకమయిన యవిద్య యొక్క కార్యములుగాన ఇవియు త్రిగుణాత్మకములు. సత్యగుణయుక్తములు అయిన యీభూతములచేత త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనెడి జ్ఞానేంద్రియములు, మనోబుద్ధ్యహంకారచిత్తములు అనెడి యంతఃకరణ పరిణామములును పుట్టుచున్నవి. రజోగుణయుక్తములు అయిన యీభూతములచేత వాక్పాణిపాదపాయూపస్థములు అనెడి కర్మేంద్రియములు పుట్టుచున్నవి. రజోగుణముతోకూడిన భూతముల చేత ప్రాణాపాన వ్యానోదాన సమానములు అను పంచప్రాణములు పుట్టుచున్నవి.
ఈ పంచభూతములుచేతను, జ్ఞానకర్మేంద్రియములచేతను, పంచప్రాణములచేతను, మనోబుద్ధులచేతను సూక్ష్మశరీరము పుట్టుచున్నది. ఈశరీరము లింగశరీరము అని చెప్పఁబడును. ఈశరీరము పరలోకయాత్రకు అనుకూలమై మోక్షపర్యంతము ఉండునది.
తమోగుణముతోడ కూడిన యపంచీకృత భూతములచేత పంచీకృతభూతములు పుట్టుచున్నవి. పంచీకరణము అనఁగా ఆకాశాది పంచభూతములను మొదల ప్రత్యేకము రెండుగాభాగించి అందు ఒక్కొక్క యంశమును నాలుగేసిగా భాగించి ఆనాలుగింటిలో ఒక్కొక్క భాగమును భాగింపని యొక్కొక్క సగముతో చేర్చి కలపఁగా పంచీకృతభూతములు ఏర్పడియె. అందు ఆకాశార్ధమును కడమభూతములలో ఎనిమిదింట ఒక్కొక్కభాగమును చేర్పఁగా పంచీకృతాకాశము. ఇట్లు వాయ్యాదులను ఊహింపవలయును.
ఈ పంచీకృత భూతములచేతనే అండములును, వానికి లోఁబడిన పదునాలుగులోకములును, జరాయుజాది దేహములను పుట్టుచున్నవి. (జరాయుజములు = జరాయువువలనపుట్టునవి = మనుష్యాదులు. జరాయువు = గర్భముతిత్తి. అండజములు = అండమువలన పుట్టునవి = పక్షిసర్పాదులు, అండము = గ్రుడ్డు. స్వేదజములు = చెమటవలన పుట్టునవి = నల్లి మొదలయినవి. ఉద్భిజ్జములు = భూమిని చీల్చుకొని పుట్టునవి = వృక్షాదులు.)
ఇట్టి ప్రపంచమునకు మూలప్రకృతి పరిణామ్యుపాదానకారణము. ఘటమునకు మన్ను వంటిది. పరిణామి అనఁగా ఒక రూపము నుండి మఱియొక రూపమును పొందునది. బ్రహ్మము ప్రపంచమునకు వివర్తోపాదానకారణము; అనఁగా వెండి అను భ్రాంతికి శుక్తి వలె ప్రపంచభ్రమమునకు అధిష్ఠానము. (అధిష్ఠానము = స్థానము.) పరమార్థమయిన బ్రహ్మమునందు ప్రపంచమునకు అధ్యాసము గలుగుచున్నది. (అధ్యాసము = భ్రమము.)
ఇట్టి ప్రపంచరూపకార్యముల నాశము ప్రళయము అనఁబడును. అది నిత్యప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృతప్రళయము, ఆత్యంతికప్రళయము అని నాలుగువిధములు కలది. అందు ఆత్యంతిక ప్రళయము బ్రహ్మసాక్షాత్కారముచేత అవిద్యారూప కారణముతోడ సకల ప్రపంచనివృత్తి. (బ్రహ్మసాక్షాత్కారము = తనకును బ్రహ్మమునకును ఐక్యప్రత్యక్షము.) ఈసాక్షాత్కారము శ్రవణ మనన నిదిధ్యాసనములతోఁగూడిన వేదాంతవాక్యములచేత కలుగుచున్నది. (శ్రవణము = ఆచార్యునివలన న్యాయయుక్తములు అయిన యర్థములను వినుట. మననము = విన్నయర్థములందు విరోధశంకలు కలుగునప్పుడు దానిని పోఁగొట్టునట్టి మానసికమగు యుక్తివిచారము. నిదిధ్యాసనము = అనాదివాసనచేత విషయములయందు ప్రవర్తించి ఉండునట్టి మనసును విషయముల నుండి యీడ్చి ఆత్మయందు కదలనీక నిలుపుట.) ఇది సాక్షాత్కారరూపమయిన బ్రహ్మైక్యజ్ఞానమునకు చేరిన కారణము. ఈ జ్ఞానము పాపక్షయముచేత కలుగుచున్నది. కర్మానుష్ఠానముచేత పాపక్షయము గలుగును.
ఈ శ్రవణాదులయందు మోక్షేచ్ఛగలవారికే అధికారము. ఆమోక్షేచ్ఛయందు నిత్యానిత్యవస్తువివేకము, విషయఫలవైరాగ్యము, శమదమోపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ అనునవి ప్రయోజకములు. (శమము = అంతరింద్రియనిగ్రహము. దమము = బహిరింద్రియనిగ్రహము. ఉపరతి = చాంచల్యము లేమి. తితిక్ష = ఓర్పు. సమాధానము = ఒకచోటనే మనసు నిలుపుట. శ్రద్ధ = గురువులయందును శాస్త్రముల యందును విశ్వాసము.)
నిర్విశేషమయిన బ్రహ్మమును సాక్షాత్కరింప సామర్థ్యము లేనివారు సవిశేవిబ్రహ్మోపాసనము చేయవలయు. వీరికి సగుణబ్రహ్మోపాసనముచేత మనసు స్వాధీనపడఁగానే నిర్విశేష బ్రహ్మము తానే తోఁచును. సగుణబ్రహ్మోపాసనము చేయువారు అర్చిరాది మార్గముగా బ్రహ్మలోకమును పొంది అందు శ్రవణాదులచేత సాక్షాత్కారము కలిగి బ్రహ్మతోడ మోక్షమును పొందుచున్నారు. కర్మనిష్ఠులు ధూమాది మార్గముగా పితృలోకమును పొంది అందు సుఖానుభవములు చేసి మరల పుణ్యపాపానురూపముగ మనుష్యాది యోనులయందు పుట్టుచున్నారు. నిషిద్ధకర్మములను ఆచరించువారు రౌరవాదినరకములను పొంది అందు పాపానురూపంబుగా దుఃఖములను అనుభవించి మరల కుక్క నక్క మొదలుగాఁగల తిర్యగ్యోనులయందు స్థావరాదియోనులయందును పుట్టి నశించుచున్నారు. నిర్గుణ బ్రహ్మోపాసనము చేయువారు ప్రారబ్ధ కర్మములను మాత్రము అనుభవించి కడమ పుణ్యకర్మములను మిత్రులయందును పాపకర్మములను శత్రువులందును విడిచి కైవల్యమునుపొంది, నిరతిశయానందమును అనుభవించుచున్నారు.
*అద్వైతము : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) నుంచి సేకరణ*
***********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి