*శ్రీ రాధాకృష్ణులు/శ్రీ రాధాదేవి తత్త్వం అంతరార్థం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*రాధాదేవి అమ్మవారి అయిదు శక్తులలో ఒకటి. అమ్మవారి పరిపూర్ణ రూపములు అయిదు అని దేవీ భాగవతం వర్ణిస్తుంది.*
*దుర్గా లక్ష్మీ సరస్వతీ గాయత్రి రాధ అని అయిదు శక్తులు.మొదటి నాలుగు లోక వ్యవహారానికి సంబంధించి నటువంటివి.*
*దుర్గాదేవి ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన జ్ఞాన శక్తి.లక్ష్మి ఐశ్వర్య శక్తి సరస్వతి వాక్బుద్ధిజ్ఞానముల, విద్యా శక్తి.గాయత్రీ దేవి సూర్య మండలాంతర్వర్తి యైన ప్రాణ శక్తి.ఈ నాలుగూ ఈ విశ్వాన్ని నడుపుతాయి. ఇక అయిదవది అయిన రాధాదేవి పరమాత్మయొక్క ఆనంద స్వరూపము, ప్రేమ స్వరూపము. పరమాత్మ ప్రేమవల్లనే ఈ జగమంతా నడుస్తున్నది.*
*ఆ ప్రేమ, ఆనందము - ఈ రెండింటి యొక్క సాకార రూపమే రాధాదేవి. రాధాదేవి ఒక పాత్ర కాదు. రాధాదేవి ఎక్కడుంది? భాగవతంలో ఉందా? లేక పురాణాలలో ఉన్నదా? అని వెతకడం కాదు. ఆమె విశ్వమంతా ఉన్నది. రాధాదేవి పరమాత్మయొక్క ప్రేమానంద శక్తి. అందుకు రాధాదేవి ఉపాసన అత్యంత శుద్ధము. పైగా శుద్ధమైన మనస్సు గల వారు మాత్రమే రాధాదేవిని అర్థం చేసుకోగలరు. ఈ రాధాదేవి అమ్మవారియొక్క పూర్ణ రూపంగా చెప్పబడుతున్నది.*
*లలితా సహస్రంలో కూడా "ఆబాల గోప విదితా", "ప్రేమ రూపా ప్రియంకరీ" అని చెప్పబడుతున్న నామములు రాధాదేవి నామములే అని విజ్ఞులు వ్యాఖ్యానిస్తారు. ఈ రాధాదేవి గోలోకంలో కృష్ణ పరమాత్మతో ఉంటుంది. గోలోకం అనే శాశ్వత లోకం ఒకటి ఉంది. అక్కడ శ్రీకృష్ణుడు విబుధుడై వేణునాద లోలుడై ఉంటాడు. అది కేవలం ఆనంద ధామం, పరమానంద ధామం.*
*అక్కడ ఆయన శక్తి ప్రేమానంద రూపిణియైన హ్లాదినీ శక్తి రాధాదేవి. హ్లాదము అంటేనే ఆనందము అని అర్థం. హ్లాదినీ, సంధినీ ఇత్యాది శక్తులతో పరమాత్మ లోకాన్ని నడుపుతూ ఉంటాడు. వీటిలో హ్లాదిని ఆనంద శక్తి. సంధినీ ఇత్యాది శక్తులు లోక వ్యవహారాన్ని నడిపే శక్తులు. ఇటువంటి ఆనంద శక్తి అయిన రాధాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి పరమాత్మ యందు ప్రేమ కలుగుతుంది.*
*ఆ ప్రేమ వల్ల పరమాత్మ ఆనందం లభిస్తుంది. ఆ ఆనందమే సచ్చిదానందము, బ్రహ్మానందము. ఆ బ్రహ్మానంద స్వరూపిణి రాధాదేవి. ఈ రాధాదేవి దర్శనం కోసం బ్రహ్మదేవుడు ఆరువేల సంవత్సరములు తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరును చూడగలిగాడట.*
*అంటే అర్థం రాధాదేవి దర్శనం అంత తేలిక కాదు అని చెప్పడం దీనిలోని విశేషం. పైగా అమ్మవారి దర్శనం కాలేదు అని దుఃఖపడితే అప్పుడు కృష్ణ పరమాత్మ బృందావనంలో నేను అవతరిస్తాను, అప్పుడు రాధాదేవి కూడా అవతరిస్తుంది అప్పుడు నీవు చూడవచ్చులే అని చెప్తాడు. ఆవిధంగా స్వామి కృష్ణుడై భూమియందు అవతరించినప్పుడు బృందావన సీమను ఎంచుకున్నాడు. నిజానికి బృందావనంలో సూక్ష్మమైన తేజోరూపంగా కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడుట.*
*కానీ ద్వాపర యుగాంతంలో అవతార మూర్తిగా ప్రకటింపబడ్డాడు. అప్పుడు అమ్మవారు రాధాదేవి కూడా అవతరించింది. కృష్ణ పరమాత్మ యశోదానందుల పుత్రుడిగా ఆయన ఉంటే ఈ రాధాదేవి ఒక అయోనిజగా అవతరించింది. వృషభానుడు అనే గోపరాజుకి అనేక జన్మల తపస్సుకు ఫలితంగా అమ్మవారు ఒక పద్మమునందు ఆవిర్భవించి గోచరించారు.*
*వృషభానుడు పరసానుపురమునకు రాజు. ఆ పరసానుపురమే నేటికీ బృందావనంలో బర్సానాధాం అని చెప్పబడుతున్నది. బ్రహ్మగిరి అని పర్వతమది. ఆ పర్వతాన్ని ఆధారం చేసుకొని ఈ పరసానుపురం ఉన్నది. దానికి గోపరాజుగా ఉన్నటువంటి వాడు వృష భానుడు. ఆయన కుమార్తెగా ఈవిడ లభించింది. ఎలాగైతే సీతాదేవి అయోనిజగా జనక మహీపతికి లభించిందో అదేవిధంగా రాధాదేవి లభించింది.*
*అలా లభించిన రాధాదేవి కృష్ణ పరమాత్మను ఉపాసన చేస్తున్న ప్రేమానంద శక్తి. రాధాకృష్ణుల దివ్యమైన అనుబంధం లౌకికమైనది కాదు. లౌకికమైన ధర్మము కానీ, అధర్మము కానీ రెండూ అక్కడ కనిపించవు. లౌకికమైన ద్వంద్వములేవీ లేవక్కడ. అదొక పరమ పావనమైన నిర్మలమైన అత్యంత శుద్ధమైన సచ్చిదానంద స్థితి. రాధాదేవి, కృష్ణుడు అవిభాజ్య తత్త్వము. అందుకే కృష్ణ రాధా తత్త్వములు ఎటువంటివి అంటే "చంద్ర చంద్రికయోరివా" అని వర్ణిస్తున్నది బ్రహ్మ వైవర్త పురాణం, పద్మపురాణం మొదలైనవి. రాధాదేవి తత్త్వం సామవేదం, ఋగ్వేదంలో కూడా చెప్పబడుతున్నది.*
*"దేవం-దేవం రాధసే చోదయన్త్య్" అని. ఈ రాధాదేవి చంద్ర చంద్రికయోరివా అంటే చంద్రునికీ, వెన్నెలకీ ఎలాంటి అనుబంధమో కృష్ణునికీ రాధకీ అలాంటి అనుబంధం అని చెప్పారు. దీని భావం వారిద్దరూ అవిభాజ్య తత్త్వము. కృష్ణుని ప్రేమశక్తి, ఆనందశక్తి యే రాధ. కృష్ణుని యొక్క ప్రేమ అంటే మనపై అది కరుణగా వర్షిస్తుంది. కృష్ణుడికి మనపై ఉన్న ప్రేమ, మనకి కృష్ణుడి పై ఉన్న ప్రేమే రాధాశక్తి. జీవుడికి కృష్ణుడి పై ప్రేమ ఉంటే దానికి భక్తి అని పేరు. కృష్ణుడికి జీవుడిపై ప్రేమ ఉంటే దానికి దయ అని పేరు.*
*అందుకు కృష్ణుడిలో దయగానూ, భక్తుడిలో భక్తిగానూ ఉన్నది రాధాదేవి. రాధాదేవి దయలేకపోతే కృష్ణుడి దయ దొరకదు అన్నారు. అంటే భక్తి అనేది ఉంటేగానీ భగవంతుడు దొరకడు. ఆ భక్తి అనే ప్రేమ అందరికీ లభించదు. "ప్రకాశ్యతే క్వాపి పాత్రే" అని నారదుల వారు చెప్తారు. భక్తి, శుద్ధమైన భగవత్ప్రేమ అంత తేలికగా దొరకదు. ఆ ప్రేమ స్వరూపిణి రాధాదేవి. ఆ రాధాదేవిని కార్తిక పూర్ణిమ నాడు కృష్ణ పరమాత్మ ఆరాధించాడు.*
*కృష్ణ పరమాత్మను ఆమె ఆరాధిస్తుంది. అందుకే ఆరాధనా శక్తియే రాధ. ఈ రాధాదేవి ఉపాసన చేస్తే "రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తితా" అని దేవీభాగవతం చెప్తోంది. కార్తిక పూర్ణిమనాడు రాధాదేవిని ప్రత్యేకించి ఆరాధించాలి. దీనికి అనేక తంత్ర శాస్త్రాలలో ఉపాసనా పధ్ధతి ఉన్నది. రాధాదేవి సహస్రం ఉన్నది, రాధాదేవి మంత్రమున్నది, రాధాదేవి స్తోత్రమున్నది.*
*సుయజ్ఞుడు అనే మహానుభావుడు రాధాకృష్ణుల ఉపాసన చేసాడు అని శాస్త్రం చెప్తున్నది. రాధాదేవి ఉపాసన చేస్తే సర్వమైన వాంఛలూ తీరుతాయిట. అంటే అన్ని అభీష్టములూ నెరవేరుతాయి అన్నారు. అన్ని అభీష్టములు నెరవేరడం అంటే అర్థం అసలు ఏకోరికా లేని పరిపూర్ణ స్థితి వస్తుందని దీనియొక్క భావం.*
*****************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి