27, ఆగస్టు 2020, గురువారం

శ్రీమన్నారాయణీయం

1-3- శ్లో.

సత్త్వం యత్తత్ పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్
భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్
తత్ స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత
పరసుఖచిద్గర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే||

భావము -
 పంచభూతములు, ఇంద్రియములతో ఆవిష్కృతమయున నీ రూపమునకు, త్రిగుణాతీతము నిర్మలము అయిన శుద్ధసత్వగుణ రూపమైన పరతత్వమే కారణమని, వ్యాస భగవానునిచే చెప్ప బడిన వాక్యము వలన తెలియుచున్నది. గుణములచే ఆవరింపబడనిదియు, స్వచ్ఛమయినదియు, ఙ్ఞానానందముచే ప్రకాశించునదియు అయిన నీ రూపమును స్మరించుటలో ఆనందమును; భావన చేయుటలో మాధుర్యమును అనుభవించు నీ భక్తులు ధన్యులు. 

వ్యాఖ్య  - ఈశ్లోకంలో ఒకవైపు స్వామి వారి  త్రిగుణాతీత, నిర్మల,  శుద్ధసత్వగుణరూప పరతత్వం శ్లాఘించబడితే మరోవైపు స్వామి వారు గీత అ.9 శ్లో.14లో చెప్పిన భక్తుడి లక్షణాలు కనబడుతున్నాయి. అదేంటో చూద్దాం.

ఈ శ్లోకంలో వచ్చిన పరతత్వం గురించి మహాభారతం  శాంతి పర్వం షష్టమాశ్వాసంలో యాజ్ఞవల్కుడు వివరిస్తూ "వేదాలలో అర్ధము, సారము తెలుసుకున్న పండితుడు క్షరము అక్షరమైన పరతత్వము గురించి తెలుసుకోగలడు. అప్పుడు క్షరమును వదిలి పెట్టి అక్షరయోగము కొరకు ప్రయత్నిస్తాడు. 

25వ తత్వమైన అక్షరతత్వం  తెలుసుకున్నవాడు పరతత్వము గురించి తెలుసుకుంటాడు.  25వ తత్వము అయిన అక్షర తత్వము 26వ తత్వమైన పరతత్వము ఒకటే. 26వ తత్వమే పరమేశ్వరుడు. అతడే పురుషోత్తముడు. అది నిరంజన, నిత్య, జ్ఞాన, ఆనంద స్వరూపం.

అవ్యక్తమైన మైన ప్రకృతి, పురుషుడు వేరు అని తెలుసు కదా ! పురుషుడు ప్రకృతితో చేరి అనేక రూపములు పొందుతూ జనన మరణ చక్రంలో ఇరుక్కు పోతూ ఉంటాడు. పురుషుడిని జీవుడు అంటారు. ప్రకృతి పురుషుడిని చూడలేక పోయినా పురుషుడు ప్రకృతిని చూస్తూ అందులో లీనమై ఇక పరమాత్మ వైపు చూడ లేడు. కాని పరమాత్మ ఈ పురుషుడిని ప్రకృతిని సాక్షీ భూతంగా చూస్తూ ఉంటాడు. పురుషుడు పరమాత్మను దర్శించే ఉపాయము చెప్తాను. 

పురుషుడు ప్రకృతితో స్నేహం చేస్తూ ప్రకృతే తాను అనుకుని క్రమంగా ప్రకృతిలో లీనమౌతాడు. అందువలన అహంకారం పెరుగుతుంది. ప్రకృతిలోని వస్తువుల మీద మమకారం పెరిగి వాటిని పొందాలన్న కోరిక పెరుగుతుంది. పురుషుడు ప్రకృతిని చూస్తున్నంత కాలం పరమాత్మను దర్శించ లేక జీవుడిగా మిగిలి పోతాడు. ఎప్పుడైతే పురుషుడు తానే ప్రకృతి ప్రకృతే తాను అన్న భావన విడిచి నీటిలో ఉన్న తామరలా తాను వేరు నీరు వేరు అనుకుంటాడో అప్పుడు ప్రకృతిలో సంచరిస్తున్న పురుషుడు తాను వేరు ప్రకృతి వేరు అని తెలుసుకుని పరమాత్మను దర్శిస్తాడు. 

పురుషుడికి జనము, వృద్ధాప్యము, మరణము తప్పవని తెలుకుని యోగి సాంఖ్యమును, యోగమును ఆశ్రయించి మమకారాన్ని వదిలి పునర్జన్మ లేని పరతత్వాన్ని పొందుతాడు. ప్రకృతి వేరు తాను వేరని పురుషుడు భేదం గ్రహించినప్పుడే పరమాత్మను చేరగలడు. 

పురుషుడు వేరు పురుషోత్తముడు వేరని సామాన్యులు అనుకుంటారు కాని విజ్ఞులకు అభ్యాసం వలన ఇద్దరూ ఒకరే అని గ్రహించగలుగుతారు. అజ్ఞాని మాత్రం పురుషుడు వేరు పురుషోత్తముడు వేరని అనుకుంటారు. మమకారమును పోగొట్టుకున్నప్పుడు పురుషోత్తముడిని గురించి తెలుసుకోగలుగుతారు " అని చెప్పాడు.

ఇక భట్టతిరి గారి స్థితి ఏమిటో తెలియాలంటే భగవద్గీతలోని అ.9 శ్లో.14  స్వామి మాటలే చెప్తాయి. 

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ।। 

ఎల్లప్పుడూ నా దివ్య లీలలను గానం చేస్తూ, ధృడ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తి తో ఆరాధిస్తుంటారు.

భగవద్గీత ఆరవ అధ్యాయంలో చెప్పినట్టు, మనస్సు అనేది గాలి వలె చంచలమైనది, మరియు సహజంగానే ఒక ఆలోచన తరువాత ఇంకో ఆలోచనకి తిరుగుతూనే ఉంటుంది. శ్రవణము మరియు కీర్తనము జ్ఞానేంద్రియాలను భగవత్ దృక్పథంలో నిమగ్నం చేస్తాయి, మనస్సుని పదేపదే దాని తిరుగుడు నుండి వెనక్కు తీసుకురావడానికి అవి సహాయం చేస్తాయి. 

భట్టతిరి గారి స్థితి అదే కాబట్టి స్వామి సాక్షాత్కరించి స్వయానా ఆయనకి గ్రంథ రచనలో సహకరించారు.

 స్వస్తి

🙏🙏🙏
సేకరణ

ధర్మము-సంస్కృతి
🙏🙏🙏

*హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం*
మన ధర్మాన్ని రక్షిద్దాం*

*ధర్మో రక్షతి రక్షితః*
🙏🙏🙏

కామెంట్‌లు లేవు: