21, అక్టోబర్ 2020, బుధవారం

అరణ్యపర్వము – 2

 అరణ్యపర్వము – 2

కిమ్మీర వధ

హస్థినా పురంలో దృతరాష్ట్రుడు విదురునితో ” విదురా పాండవులు ఏమి చేస్తుంటారు ” అని అడిగాడు. దానికి విదురుడు ” పాండవులు దైవసంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నీవు విన లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకుని సుయోధనుని విడిచి పెట్టు. ద్రౌపదికి, భీమునికి దుశ్శాశనునితో క్షమాణలు చెప్పించు అన్నాడు. ఆ మాటలకు దృతరాష్ట్రుడికి కోపం వచ్చి ” సుయోధనుడు నా కన్న కొడుకు వాడిని నేను ఎలా వదలను. నీకు నాకొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కర లేదు. నీవు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడి వెళతావో నీ ఇష్టం ” అన్నాడు.

వెంటనే విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెద నాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. దృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండ లేక విదురుని కొరకు సంజయుని పంపాడు. సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకు వచ్చాడు. దృతరాష్ట్రుడు ” విదురా ! నీవు నీతి మంతుడవు. నాకు బుద్ది లేదు. అందుకే నిన్ను వెళ్ళగొట్టాను నన్ను క్షమించు ” అన్నాడు.

విదురుడు “దృతరాష్ట్రా! నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహా పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు ” అన్నాడు. విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడు నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాశనులతో చర్చిస్తూ ” పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, దృతరాష్ట్రుడు కలసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేయాలి? ” అన్నాడు. శకుని ” సత్య సంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు. ఆ భయం నీకు వద్దు ” అన్నాడు. కర్ణుడు ” ఈ అదను చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము. శత్రుశేషం లేకుండా చేద్దాం ” అన్నాడు. కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు.

ఇది తెలిసి వ్యాసుడు దృతరాష్ట్రుని వద్దకు వచ్చి ” నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య, అజ్ఞాత వాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు తొందరెందుకు ” అన్నాడు. దృతరాష్ట్రుడు ” మహత్మా! నన్ను ఏమి చెయ్యమంటారు. జూదం వలన చెడు జరిగింది. నేను పుత్ర వాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను ” అన్నాడు. వ్యాసుడు ” దృతరాష్ట్రా! పుత్ర వాత్సల్యం ఉండవలసిందే కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు” అన్నాడు.దృతరాష్ట్రుడు ” అయ్యా! వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి ” అన్నాడు. వ్యాసుడు ” మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెబుతాడు ” అని వెళ్ళి పోయాడు.

వ్యాసుడు చెప్పినట్లు కొన్ని రోజుల తరువాత మైత్రేయుడు ముందుగా పాండవులను చూచి హస్థినాపురం వచ్చాడు. దృతరాష్ట్రుడు మైత్రేయునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. మైత్రేయుడు ” నేను కామ్యక వనంలో ఉన్న పాండవులను చూసి వచ్చాను. వారు అడవులలో కందమూలాలను తిని జీవిస్తున్నారు ” అన్నాడు. పాండవులు క్షేమంగా ఉన్నారా ” అని దృతరాష్ట్రుడు అడిగాడు.

మైత్రేయుడు ” ఓ రాజా! పాండవులు ధర్మబుద్ధి కలవారు. వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి. అందు వలన క్షేమమే ” అన్నాడు. దుర్యోధనుని వైపు తిరిగి ” కుమారా! నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైరం వదులుము. అలా చేస్తే నీవు కురువంశానికి మేలు చేసిన వాడివి ఔతావు. పాండవులు వజ్ర శరీరులు. భీముడు హిడింబుని, బకాసురుని, జరాసంధుని, కిమ్మీరుని వధించిన బలాడ్యుడు. అతనిని వధించగల యోధులు లేరు. శ్రీకృష్ణుడు, దుష్టద్యుమ్నుని బంధుత్వం పాండవులకు మరింత బలాన్నిచ్చింది. కనుక నీవు పాండవులతో స్నేహం చేయటం మంచిది ” అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తొడలు చరిచి మహర్షిని అవమానించాడు. అందుకు మైత్రేయుడు ఆగ్రహించి ” సుయోధనా ! యుద్ధభూమిలో భీముని గదాఘాతం నీ తొడలను విరవకలదు ” అని మైత్రేయుడు అన్నాడు. దృతరాష్ట్రుడు భయపడి మహర్షిని శాపవిమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. మైత్రేయుడు “మహారాజా! నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ది కలిగి ఉంటే ఈ శాపం వర్తించదు ” అన్నాడు.

దుర్యోధనునికి శాపం ఇచ్చిన తరువాత దృతరాష్ట్రుడు ” మహాత్మా! కిమ్మీరుడనే రాక్షసుడు భీముని చేతిలో ఎలా చనిపోయాడో వవరిస్తారా? ” అని అడిగాడు. మైత్రేయుడు ” నా మాటను నీ కొడుకే వినలేదు. నేనెందుకు చెప్పాలి విదురుని అడిగి తెలుసుకో ” అని చెప్పి వెళ్ళి పోయాడు.

విదురుడు కిమ్మీరుని వృత్తాంతం ఇలా వివరించ సాగాడు. ” పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతాకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధౌమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేసాడు. ఆ రాక్షసుని చూసి ధర్మరాజు ” నీ వెవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు ” అని ఆడిగాడు. దానికి ఆ రాక్షసుడు ” నేను బకుడు అనే రాక్షసుని తమ్ముడిని. నా పేరు కిమ్మీరుడు. మనుష్యులను చంపి తింటూ ఉంటాను నాకు భయపడి ఎవెరూ ఈ అరణ్యానికి రారు. మీరు ఎవెరు? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు? ” అని అడిగాడు. ధర్మరాజు ” నా పేరు ధర్మరాజు వీరు నా సోదరులు. మేము వనవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాము ” అన్నాడు. ఇది విని ఆ కిమ్మీరుడు ” నా అన్న బకుని చంపిన భీముడు వీడేనా . వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నేను వీడి కోసమే వెతుకుతున్నాను ” అని వికటాట్టహాసం చేసాడు. ఇది విని అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టాడు కానీ ఈలోగా భీముడు కిమ్మీరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసారు. చెట్లతోనూ రాళ్ళ్తోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిమ్మీరుని అతని అన్న బకుని చంపినట్లు అతని దేహాన్ని విరగదీసి చంపాడు. ఈ విధంగా భీముడు కామ్యక వనంలో రాక్షస భయం లేకుండా చేసాడు ” అని చెప్పాడు. ఇది విని దృతరాష్ట్రుడు కలత చెందాడు.

కామెంట్‌లు లేవు: