21, అక్టోబర్ 2020, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

ఋణానుబంధాలు..


శ్రీ స్వామివారి మందిరాన్ని నాన్నగారు 1987 - 90 ప్రాంతంలోనే దేవాదాయ శాఖ వారికి అప్పచెప్పివున్నారు..అందువల్ల నాన్నగారి స్థానంలో వ్యవస్థాపక ధర్మకర్త గా నేను నియమింపబడటానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి..అందుకు అమ్మా నాన్న గార్లే కాక, మా అన్నయ్య, చెల్లెలు కూడా అనుమతి ఇస్తూ పత్రాలు వ్రాసి ఇవ్వాలి..అన్నయ్య చెల్లెలూ ఇద్దరూ కూడా ఒకేఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ అంగీకారాన్ని ఇచ్చేసారు.."మొదటినుంచీ నువ్వే అక్కడి బాగోగులు చూస్తున్నావు..శ్రీ స్వామివారి మందిరాన్నీ నువ్వు నిర్వహించు!..నాకు అంతగా అలవాటు లేదు కదా!.." అని అన్నయ్య చెప్పాడు..అలా శ్రీ స్వామివారి సన్నిధికి నేను చేరడానికి మార్గం సుగమం అయింది..

మామూలుగా ప్రభుత్వం నుంచి అనుమతి రావడం అంత త్వరగా అయ్యే పనికాదు..కానీ నా విషయం లో అలా కాకుండా కేవలం నెల రోజుల్లోపలే ధ్రువీకరణ పత్రాలు వచ్చేసాయి..ప్రతి చిన్న అడుగులోనూ శ్రీ స్వామివారి ఆశీస్సులు వెంటాడుతూనే ఉన్నాయి..నేనే గ్రహింపలేకపోయాను..


శ్రీ స్వామివారి మందిర నిర్వహణ కు నేను సమాయత్తం కావడానికి ముందు నేను వ్యక్తిగతంగా చాలా సమస్యల్లో చిక్కుకొని వున్నాను..వ్యాపారం లో విపరీతంగా నష్టపోయి..ఆర్ధికంగా చితికి పోయి వున్నాను..పైగా వ్యాపారం తాలూకు ఋణ భారం మోయలేనంతగా ఉన్నది..పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు..ఋణ బాధకు తోడు..ఋణదాతలు వేసిన సుమారు పదకొండు కోర్టు కేసులు..అటువంటి పరిస్థితి లో ఉన్న నాకు..హఠాత్తుగా నాన్నగారు అనారోగ్యం పాలై..శ్రీ స్వామివారి మందిర నిర్వహణ నెత్తికెత్తుకోవడం సాహసం తో కూడుకున్న పనే..


కానీ ఎందుకనో మనసులో ఒక మూల .."ఈ సమయం లో నాకు శ్రీ స్వామివారు తోడుగా వుంటారేమో..ఇక ఆయన పాదాలు పట్టుకొని శరణు వేడుకుందాము.. " అనే ఆలోచన వచ్చింది..ఎప్పుడైతే శ్రీ స్వామివారి మందిర ధర్మకర్త గా బాధ్యత తీసుకున్నానో..ఆరోజే శ్రీ స్వామివారి సమాధి వద్ద ఉన్న శ్రీ స్వామివారి పాదుకులకు శిరస్సు ఆనించి.."స్వామీ!..ప్రస్తుతం వేరే దిక్కు లేదు..నువ్వే కాపాడాలి..పరువూ మర్యాద కాపాడుతూ నన్ను గట్టెక్కించే భారం నీదే తండ్రీ.." అని నేనూ.."మా సంసారాన్ని చల్లగా చూడు తండ్రీ.." అని నా ఆవిడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము..


అలా ప్రార్ధన ముగించుకొని సమాధి మందిరం నుంచి బైటకు రాగానే..కొద్దిక్షణాల్లోనే..ఒక సంఘటన జరిగింది..నా మీద కేసు వేసిన ఒక ఋణదాత నేరుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..నన్ను చూసి..గబ గబా నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..దాదాపు నాలుగైదు ఏళ్ళు ఇద్దరమూ వ్యాపారం లో కలిసేవున్నాము..నా అవసరాలకు మీరు, మీ అవసరాలప్పుడు నేను సర్దుకుంటూ వున్నాము..సరే..కాలం మారి మీరు ఇబ్బందుల్లో పడ్డారు..నాకు రావాల్సిన డబ్బు కోసం నేను కోర్టుకు కూడా వెళ్ళాను.." అని చెప్పుకుపోతున్నాడు..నాకేమీ అర్ధం కావడం లేదు..ఇప్పుడెందుకు ఇలా హఠాత్తుగా వచ్చి ఏ ఉపోద్ఘాతం లేకుండా ఇలా చెపుతున్నాడు.. అయోమయంగా చూస్తూ వున్నాను..


"నిన్న రాత్రి ఎందుకనో ఆలోచించుకుంటూ వుంటే..ఈ కేసుల కన్నా..మీతో నేరుగా మాట్లాడి ఓ పరిష్కారానికి వద్దామనిపించింది..విచారిస్తే మీరిక్కడ ఉన్నారని తెలిసి నేరుగా కారు వేసుకొని వచ్చాను.."అన్నాడు..


నిజానికి నేనింకా తేరుకోలేదు..నోరు పెగల్చుకుని.."మీరింత దూరం రావడం చాలా సంతోషం..ప్రస్తుతం నేను ఇప్పటికిప్పుడు ఏమీ చెల్లించే పరిస్థితి లో లేను..మీరు నాకు ఓ నాలుగైదు నెలలు గడువిస్తే..మీకివ్వాల్సిన మొత్తం లో సుమారు అరవై శాతం కట్టుకుంటాను..ఆ సహాయం చేయగలరా.." అన్నాను..


"మీరు నాలుగు నెలలు అన్నారు ప్రసాద్ గారూ..ఇది ఫిబ్రవరి..అక్టోబర్ నాటికి సగం ఇవ్వండి..మిగిలింది మళ్లీ ఫిబ్రవరిలో ఇవ్వండి..అంతవరకూ ఆ కేసు గురించి మీరు ఆలోచించనక్కరలేదు.." అన్నాడు..నమ్మలేకపోయాను..నేను అడిగిన దానికన్నా ఎక్కువ సమయం ఇచ్చాడు..ఏదో తెలీని ధైర్యం వచ్చింది..ఒక్కసారిగా మనసు తేలిక పడింది..ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుని శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకోమన్నాను..వెళ్లి పూజ చేయించుకొని మళ్లీ నాకు తన వల్ల ఏ ఇబ్బందీ ఉండదని చెప్పి మరీ వెళ్ళిపోయాడు..అంతా గంటలోపలే జరిగిపోయింది..


తీవ్రమైన తుఫాను లో కొట్టుకుపోతున్న వాడికి ఆలంబన దొరికినట్లుగా ఉన్నది..శ్రీ స్వామివారు చిరునవ్వుతో చూస్తున్నట్లుగా భావన కలిగింది...మా దంపతులిద్దరమూ జరిగిన దానిని తలుచుకొని.. శ్రీ స్వామివారి సమాధికి మనసారా సాగిలపడ్డాము..


ఇలాటి అనుభవాలను ఎన్నో పొందాము..ప్రతి విషయం లోనూ ఆ స్వామివారు చూపిన కృపా కటాక్షణాలను మీతో పంచుకుంటూ...రేపటి నుంచి మరిన్ని అనుభవాలతో...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీదత్తాత్రేయస్వామిమందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: