21, అక్టోబర్ 2020, బుధవారం

వీణాశారదా అవతారము

 దసరానవరాత్రులు - వీణాశారదా అవతారము 


శృంగేరి సంస్థానానికి చెందిన దేవాలయాలలో ఈరోజు అమ్మవారు వీణాశారదా రూపంలో అలంకరించుకుని ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా జ్ఞ్యానం అనే భిక్షను పెట్టమని వేడుకుంటూ ప్రార్ధనచేసి ఆ తల్లి కృపకు పాత్రులం కావడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చెయ్యాల్సిందే. ఎందుకంటే జ్ఞ్యానం ప్రతి ఒక్కరికీ కావాల్సిందే కదా. 


నిజానికి ఈ తల్లిని అనేక నామాలతో ఆరాధన చేసినప్పటికీ మూడు నామాలు మటుకు బహుప్రాచుర్యంలో ఉన్నాయి. 1) సరస్వతి....అనగా ప్రసరణము జ్ఞ్యానము. ఒక దగ్గర నిలిచిపోకుండా ఒక దీపంనుండి వెలుగు ఎంత అయితే ప్రసరణను పొందుతుందో అలాగే జ్ఞ్యానము కూడా అలా ప్రసరింపచేసేది కాబట్టి సరస్వతి. 2) భారతి....విభక్తేతి భారతి....అనగా పోషించేది భారతి....అనగా ఏ వృత్తిలో ఎవరు రాణించాలన్నా ఆ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. 3) శారద....తెల్లని పద్మంలో కూర్చుని ఉంది కాబట్టి శారద. శారద అనగా సత్వగుణమునకు చిహ్నం. తెల్లని పద్మం అనగా కూడా ఒక రకంగా ఆలోచిస్తే మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. సహస్రార చక్రం అనగా మాడు (తలపైన) స్థానంలో ఒక చక్రం ఉంటుంది. తెల్లని కాంతులు ఈనుతూ ఉంటుంది. ఎవరైతే నిరంతరం ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఉంటారో వారికి శిరస్సుపై ఈ కమలం కనిపిస్తుంది.


నిజానికి శబ్దము అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి స్వరం మరియు రెండవది అక్షరం. ఈ స్వరానికి గుర్తుగా ఈ తల్లి తన ఒక చేతిలో వీణ పట్టుకుని ఉంటుంది. మరి అక్షర జ్ఞ్యానానికి గుర్తుగా పుస్తకాన్ని ఒక చేతిలో పట్టుకుని ఉంటుంది. అందుకనే లలితకళలలో రాణించాలన్నా ఈ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. మనకి తెలిసిన విషయాలను నలుగురికీ తెలియచెయ్యాలన్నా (వాక్కురూపంలో కాని వ్రాతరూపంలో కాని) ఈ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. లేని పక్షంలో ఏ పదం తరువాత ఏ పదం వాడినా ఆ వాక్యం పరిపూర్ణతను సంతరించుకోదు. 


అందుకే ఈ శారదా ఆరాధనను పెద్దలైనావారు ఎందరో చేసి మనలను కూడా ఆ దారిలో నడవమని మనకు మార్గాన్ని శూచించారు. వ్యాసభగవానుడేమో గోదావరి తీరంలో ఆ తల్లి కోసం తపస్సు చేసి ఆ తల్లి అనుగ్రహం పొందిన తరువాత ఇంకా ఏం కావాలని ఆ తల్లి ప్రశ్నించగా నన్ను ఎలా అనుగ్రహించావో ఇక్కడికి వచ్చి నిన్ను వేడుకున్న వారిని అనుగ్రహించు అంటూ ఇసుకతో ఆ తల్లి విగ్రహాన్ని మనకు అనుగ్రహించారు.


మరి అదే కోవకు చెందిన మహానుభావులు సాక్షాత్తు శంకరుల అవతారంగా చెప్పుకునే శంకరభగవత్పాదులవారు కూడా తాము పెట్టిన మొదటి పీఠానికి శారదాపీఠం అని పేరు పెడుతూనే ఆ తల్లిని కొయ్యతో (చెక్కతో) ఉంచి మనకు జ్ఞ్యానాన్ని అనుగ్రహించమని మనలను అనుగ్రహించి మనకు అందించారు.


ఈ రోజు ఆ తల్లిని ఆరాధన చేసి మనందరం ఆ తల్లి అనుగ్రాహం పొందెదముగాక.


"జయ జయ శంకర హర హర శంకర"


'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

WhatsApp Number: +91 8886240088

కామెంట్‌లు లేవు: