గీర్వాణవాణి
భావానువాదం
గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏
*66.యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః*
*ఏకం గార్హస్థ్యమాశ్రిత్య వర్తంత ఇతరాశ్రమాః.*
కన్నతల్లిని ఆశ్రయించుకొని ఏ విధంగా జంతువులన్నీ(జీవులు) జీవిస్తున్నాయో అదే విధంగా గృహస్థాశ్రమం ఒక్కదాన్ని ఆశ్రయించుకొని ఇతర ఆశ్రమాలన్నీ నిలుస్తున్నాయి.
*****మూసీ నది చరిత్ర తెలుసుకుందాం*****
*ప్రస్తుతం భాగ్యనగరంలో మనం "మూసీ నది"గా పిలుచుకుంటున్న ఈ నది అసలు పేరు "ముచుకుందా నది". ముచుకుందుడు రాజర్షి. ఈ వృత్తాంతం విష్ణు పురాణంలో ఉంది.
ముచుకుందుడనే రాజర్షి ఇంద్రుని కోరిక మేరకు వేయి సంవత్సరాల పాటూ అసురులతో యుద్ధం చేసి అసురులను ఓడించాడు. దానికి సంతసించిన దేవేంద్రుడు ముచుకుందుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు.
అప్పుడు ముచుకుందుడు, "మహేంద్రా, ఏళ్ళ తరబడి నిద్ర లేకుండా రాక్షసులతో పోరాడడం వల్ల నాకు నిద్ర కరువైంది, ఎలాంటి ఆటంకం లేకుండా కొంతకాలం పాటూ నిద్రపోయేలా స్థలాన్ని చూపించు, అలాగే నాకు నిద్రాభంగం చేసిన వారు ఎవరైనా సరే తక్షణమే భస్మమైపోయే లాగా వరమివ్వ"మని కోరతాడు. "తథాస్తు" అంటాడు ఇంద్రుడు. తెలంగాణలోనున్న "అనంతగిరి"లో ఒక గుహను చూపించి అందులో నిద్రపొమ్మంటాడు. అక్కడ నిద్రలోకి వెళతాడు ముచుకుందుడు.
అలా కాలం జరుగుతూ ఉండగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి అంతమొందించడానికి వెంటపడతాడు కాలయవనుడనే రాక్షసుడు. అతనికి మూడు కోట్ల మందితో కూడిన బలమైన సైన్యముంది. కాలయవనునికి యాదవుల చేతిలో ఓడిపోడనే వరం కూడా ఉండడం వల్ల, బలరామ కృష్ణుల పైకి యుద్ధానికి వచ్చినపుడు కృష్ణుడు అతని నుండీ తప్పించుకుంటూ, ఈ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వచ్చి దాక్కుంటాడు. కృష్ణుడే మాయా రూపంలో నిద్రిస్తున్నాడని భ్రమపడిన కాలయవనుడు ముచుకుందుణ్ణి నిద్ర లేపుతాడు. ఇంద్రుని వరం వల్ల ముచుకుందునికి నిద్రాభంగం చేసిన కాలయవనుడు భస్మమైపోతాడు. ఆ విధంగా యాదవుల చేతిలో సంహరించబడని బలవంతుడైన కాలయవనుణ్ణి ముచుకుందుని ద్వారా మట్టుబెడతాడు కృష్ణుడు.
ఆ తరువాత కృష్ణుణ్ణి దర్శించిన ముచుకుందుడు తన వద్దనున్న కమండలు నీటితో కృష్ణుణ్ణి అర్చించి, నదిగా మారి, ఎల్లప్పుడూ స్వామి పాదాల వద్దనే ఉండేట్టుగా వరం కోరుకుంటాడు. అదే ముచుకుందా నది. నేటి మూసీ నది.
విష్ణుపురాణం ప్రకారం విష్ణుమూర్తి శేషపాన్పు యొక్క తలభాగం తిరుమలగా, మధ్యభాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా చెప్పబడింది. ఈ అనంతగిరిలోనే మార్కండేయుడు 14వేల సంవత్సరాలు తపస్సు చేసి, మహావిష్ణువు ఇక్కడే కొలువై ఉండేట్టుగా వరాన్ని పొందుతాడు. అలా అనంత పద్మనాభుడనే పేరుతో సాలగ్రామ శిలగా వెలసిన విష్ణువును కాశీ నుండి గంగా జలాన్ని తెచ్చి మార్కండేయుడు అర్చించినట్టు స్థలపురాణం చెబుతోంది.
కాబట్టి ఇక్కడ వేంచేసిన విష్ణువు యొక్క పాదసేవలో తరించాలనే వరాన్ని పొందిన ముచుకుందుడు నదిగా మారాడు. అలా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అనే విష్ణు క్షేత్రంలో పుట్టి రాష్ట్రమంతా పారుతోంది ముచుకుందా నది. కాలాంతరంలో ఆరవ నిజాం ఈ నది పేరును మూసీగా మార్చినట్లు చెబుతారు. ముచుకుంద అనే పేరును స్మరించడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. ఇంతటి పవిత్ర చరిత్ర కలిగిన ముచుకుందా నది ఇప్పుడు సరైన అర్థం లేని మూసీ పేరుతోనూ, ఒక మురికి కూపంగానూ మారడానికి కారణం పాలకులు మరియు ప్రజలు కూడా.
ఈ నది యొక్క పేరును మళ్ళీ ముచుకుందా నదిగా మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నది యొక్క శుభ్రతనూ పూర్వస్థితికి తీసుకు రావాల్సిన అవసరం కూడా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి