21, అక్టోబర్ 2020, బుధవారం

పోత‌న త‌ల‌పులో.....89

 పోత‌న త‌ల‌పులో.....89



న‌ర నారాయ‌ణావ‌తారం గురించి బ్ర‌హ్మ నార‌దుడికి చెబుతున్నాడు...

           **

గణుతింపఁగ నర నారా

యణు లన ధర్మునకు నుదయ మందిరి; దాక్షా

యణియైన మూర్తి వలనం

బ్రణుతగుణోత్తరులు పరమపావనమూర్తుల్.

               **

మిక్కిలి ప్రసిద్ధమైన గుణాలు గలవారు, మిక్కిలి పవిత్రమూర్తులైన నరనారాయణు లనేవారు ధర్మానికి అధిష్ఠానమైన ధర్ముడికి, దక్షుని కుమార్తె అయిన మూర్తి యందు జన్మించారు.


అలా అవ‌త‌రించిన న‌ర‌నారాయ‌ణులు బ‌ద‌రికా వ‌నంలో త‌పస్సు చేసుకుంటుంటే ఆ త‌ప‌స్సునుభ‌గ్నం చేయ‌మ‌ని చెప్పి ఇంద్రుడు దేవ‌కాంత‌ల‌ను పంపాడు.

                                     **

అక్కడ నరుడు, నారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి దేవకాంతలు సవిలాసంగా వచ్చారు. అందచందాల తీరు, కళానైపుణ్యాలు ఉట్టిపడేలా పరాచికాలాడుతు, ఆటలాడుతూ, పాటలు పాడుతూ విహరించారు. అలా విలాసలీలలతో తపోవనంలో విచ్చలవిడిగా విహరిస్తున్న అప్సరసలను నరనారాయణులు చూసారు. కాని ఏ మాత్రం చలించలేదు. కామానికి లోను కాలేదు. నిశ్చింతులై, నిర్మోహులై వాళ్లు అలాగే నిరతిశయ నిశ్చల ధ్యానంతో మహా తపస్సులో నిమగ్నులై ఉండిపోయారు. త‌ప‌స్సు స‌మ‌యంలో కోపం ప‌నికిరాద‌ని వారు ఆ సుంద‌రాంగుల ప‌ట్ల ఏమాత్రం కోపం ప్ర‌ద‌ర్శించ‌లేదు.

                               **

నారాయణుఁ డప్పుడు దన

యూరువు వెసఁ జీఱ నందు నుదయించెను, బెం

పారంగ నూర్వశీ ముఖ

నారీజనకోటి దివిజనారులు మెచ్చన్.

                                  **

అప్పుడు నారాయణుడు తన ఊరు భాగాన్ని గోటితో వేగంగా గీరాడు. అతని తొడలోనుండి అమరాంగనలు అచ్చెరువొందేలా ఊర్వశి మొదలైన అప్సరస స్ర్తీ సమూహం ఉద్భవించింది.

                                      **

ఊరువులందు జనించిన

కారణమున నూర్వశి యన ఘనతకు నెక్కెన్

వారల రూప విలాస వి

హారములకు నోడి రంత నమరీజనముల్.

                          **

నారాయణుని ఊరువు నుండి పుట్టడంవల్ల ఆమె ఊర్వశి అని పేరుగాంచింది. , ఊర్వశి మొదలైన వాళ్ల అందచందాల‌నుచూసి ,ఇంద్రుడు పంపిన‌ సుంద‌రాంగులు లజ్జతో కుంచించుకు పోయారు.

                                   **


ఆ నరనారాయణులు తలపు మాత్రంచే సృష్టిస్థితిలయాలు చేయగలరు. అంతటి మహానుభావుల తపస్సుకు భంగం కలిగించడానికి చేసిన తమ శృంగారవిలాసాలు కృతఘ్నుడికి చేసిన ఉపకారాలలా నిరుపయోగ లయ్యా యని దేవరమణులు గ్రహించారు. దానితో వాళ్లు సిగ్గుతో పరితపించారు. ఆ ఊర్వశినే తమకు నాయకురాలుగా చేసుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయారు.

                                      **

 ఇక ధ్రువావతారం వివరిస్తాను, వినమ‌న్నాడు బ్ర‌హ్మ నార‌దుడితో....

                                           **


మానిత చరితుఁ డుత్తానపాదుం డను-

  భూవరేణ్యునకు సత్పుత్రుఁ డనగ

నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున-

  జనకుని కడనుండి సవితితల్లి

దను నాడు వాక్యాస్త్రతతిఁ గుంది మహిత త-

  పంబు గావించి కాయంబుతోడఁ

జని మింట ధ్రువపదస్థాయి యై యటమీఁద-

  నర్థి వర్తించు భృగ్వాది మునులుఁ



జతురగతి గ్రింద వర్తించు సప్తఋషులుఁ

బెంపు దీపింపఁ దన్ను నుతింప వెలసి

ధ్రువుఁడు నా నొప్పి యవ్విష్ణుతుల్యుఁ డగుచు

నున్న పుణ్యాత్ముఁ డిప్పుడు నున్నవాఁడు

                              **



ఉత్తమచరిత్రుడైన ఉత్తానపాదు డనే రాజుకు సత్పుత్రుడుగా -ధ్రువుడు జన్నించాడు, ప్రభావసంపన్నుడై పేరుగాంచాడు. చిన్న తనంలో ఒకనాడు తండ్రివద్ద ఉన్నప్పుడు సవతితల్లి సురుచి అతణ్ణి నిందావచనాలతో నొప్పించింది. దుఃఖితుడైన ధ్రువుడు గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు ఫలించింది. భగవంతుడు సాక్షాత్కరించి అతణ్ణి అనుగ్రహించాడు. అతడు సశరీరంగా ఆకాశంలో మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డారు. ఆ స్థానానికి పైన వుండే భృగువు మొదలైన మహర్షులూ, క్రింద వుండే సప్తర్షులూ ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించారు. అతడు ధ్రువు డనే పేరుతో ప్రకాశించి విష్ణువుతో సమానుడైనాడు. ఇప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు ధ్రువస్థానం లోనే వున్నాడు.

                                 **

  ఇక‌ పృథుచక్రవర్తి అవతారం విను. నార‌దా.....

                                   **


వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్యపౌరుషుం

డై నిరయంబునం బడిన నాత్మ తనూభవుఁడై పృథుండు నాఁ

బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్

థేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై.

                                            ***

వేను డనే భూపాలుడు భూసురుల శాపాలనే వజ్రాయుధం దెబ్బలు తిని, సిరిని పౌరుషాన్ని కోల్పోయాడు. తుదకు నరకం పాలయ్యాడు. అతనికి పృథుడనే కుమారుడు కలిగాడు. అతడు తండ్రిని పున్నామనరకం నుండి రక్షించాడు. శ్రీహరి కళాంశభవుడైన ఆ పృథుచక్రవర్తి భూమిని ధేనువుగా జేసి అమూల్యమైన అనేక వస్తువులను పిదికాడు.”


                          **

 ఇప్పుడు వృషభుని అవతారం తెలియపరుస్తాను.

 ఆలకించు నార‌దా...

 అగ్నీధ్రు డనే వాడికి నాభి అనే కొడుకు పుట్టాడు. నాభి భార్య సుదేవి. అమెకు మేరుదేవి అని మరో పేరు ఉంది. ఆమెకు హరి వృషభావతారుడై అవతరించాడు. అతడు జడశీలమైన యోగం పూనాడు. ప్రశాంతమైన చిత్తం పొంది ఇతరుల పొత్తు వదిలాడు. ఇది పరమహంసలు పొందదగిన స్థితి అని తన్ను గూర్చి మహర్షులు ప్రశంసించేటట్లు మెలగాడు.అని బ్ర‌హ్మ, నార‌దుడికి చెప్పాడు.



🏵️పోత‌న‌ప‌దం🏵️

🏵️ప‌ర‌మ‌ప‌థం🏵️

కామెంట్‌లు లేవు: