రామాయణమ్. 99
..
వశిష్ఠ మహర్షిని అల్లంతదూరములో చూడగనే భరద్వాజమహర్షి ఒక్కుదుటున లేచి శిష్యులను అర్ఘ్యము అర్ఘ్యము అని తొందర పెడుతూ మహర్షికి ఎదురేగినాడు.
.
వశిష్ట మహర్షి భరతుని ఈతడు దశరధకుమారుడు అని పరిచయం చేసిన తరువాత వారందరి క్షేమం భరద్వాజుడు విచారించి భరతునితో ఇలా అన్నాడు...రాజ్యమును పరిపాలించుకొనే నీవు ఇచటికి ఎందుకు వచ్చావు ?
నా కేదో అనుమానముగా ఉన్నది నీ గురించి!
.
తండ్రిమాటకోసమై అడవులుపట్టి వెళ్ళిపోయిన సీతారామలక్ష్మణుల విషయమై నీవేమీ పాపపుతలంపుతో ఇచటకు రాలేదుకదా! .
.
ఆ మాటలు భరతుని హృదయాన్ని ఈటెల్లాగా చీల్చివేయగా హృదయమందు అప్పటికే గంగానదిలా ప్రవహిస్తున్న దుఃఖము మరింతవేగంగా ఉబికి బయటకు వచ్చి కన్నీరుగా ప్రవహించగా ,తడబడేమాటలతో భరద్వాజుని చూసి ...
.
పూజ్యుడవైన నీవుకూడా నన్ను ఇలాగ భావించినచో నన్ను చంపివేసినట్లే! మహాత్మా నావలన ఏ దోషమూలేదు! నన్ను నీవు ఈ విధముగా తలంచకుమయ్యా!
.
నేను లేని సమయములో నా తల్లిపలికిన మాటలన్నీ నాకు ఇష్టములుకావు ,వాటిచే నాకు సంతోషముకలుగలేదు.వాటిని నేను సమ్మతించను.
.
నేను ఇప్పుడు పురుషశ్రేష్ఠుడైన రాముని పాదములకు నమస్కరించి ఆయనను అనుగ్రహింపచేసుకొని మరల అయోధ్యకు తీసుకు వెళ్ళటానికి వచ్చిఉన్నాను. మహర్షీ రాముడెక్కడున్నాడో ఎరుకపరుపుము!.
.
సత్ప్రవర్తన,వినయముతో కూడిన భరతుని ఆ మాటలు విని ప్రసన్నుడై రఘువంశములో పుట్టినవాడు మాట్లాడే విధంగానే మాట్లాడావు అవి నీకు తగి ఉన్నవి.
నీ హృదయం తెలుసుకుందామనే అలా అన్నాను ! అని పలికి నీ సోదరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు ..
.
రాముడు చిత్రకూటపర్వతమందు నివసిస్తున్నాడు ,నీవు రేపు అచటికి వెళ్ళవచ్చును ఈ రాత్రికి మాఆశ్రమమందే విశ్రమించు అన్న భరద్వాజుని కోరికమేరకు ఆ రాత్రికి అక్కడనే విడిదిచేసినాడు భరతుడు.
.
అప్పుడు భరద్వాజుడు భరతునితో నేనిచ్చే విందు స్వీకరించుము అని అడిగాడు.
.
స్వామీ అరణ్యములో లభించేవాటిని మీరిప్పటికే నాకు అనుగ్రహించారుకదా ఇంక వేరే విందు ఏమివ్వగలరు ? అని బదులు పలికాడు భరతుడు.
.
మహర్షి చిరునవ్వుతో, భరతా !నీవు అల్పసంతోషివి అని నేనెరుగుదును. నీవు అన్నిసత్కారములకు అర్హుడవు ! నీకు నీసేనకు ఏమిచ్చినచో సంతుష్టులగుదురో ఆ విందు ఇవ్వవలెననే కోరిక నాకున్నది .
అవునూ ! నీ సైన్యాన్నంతా దూరంగా వదిలి ఒక్కడవే ఇక్కడికి వచ్చావేమిటి? అని ప్రశ్నించాడు భరద్వాజుడు.
.
స్వామీ మీకు తెలియునుకదా రాజుకానీ ,రాజపుత్రుడు కానీ ఎల్లవేళలా మునివాటికలకు దూరంగా సంచరించవలెను అని కదా నియమము!
.
(( ఇది ఆనాటి ధర్మం! ఈ రోజున విశ్వవిద్యాలయాల గ్రౌండ్సు అన్నీ కూడా రాజకీయ సభలకు ఇవ్వాల్సిందే ,ఇవ్వకపోతే రచ్చరచ్చ ఏ కాలంలో నాగరికత ,మర్యాద ఉన్నదో గమనించండి ?
We are modern but not civilized)).
.
నా సైన్యములో మదించిన ఏనుగులు సంచరిస్తున్నాయి అవి మీ ఆశ్రమప్రాంగణంలోని వనాన్ని ధ్వంసం చేయరాదనే తలంపుతో నేనొక్కడనే వచ్చినాను.అది విని సంతసించారు మహర్షి.
.
అప్పుడు మహర్షి అగ్నిగృహములో ప్రవేశించి దీక్షలో కూర్చొని విశ్వకర్మను ఆహ్వానించాడు ,దేవేంద్ర,యమ,వరుణ,కుబేర అనే లోకపాలకులని కూడా ఆహ్వానించి నేను భరతునకు ఆతిధ్యమివ్వదలుచుకున్నాను కావున మీరు వచ్చి తగు ఏర్పాట్లు గావించండి అని కోరినాడు.
.
మహర్షి సంకల్పానికి అనుగుణంగా అక్కడ క్షణాల్లో ఒక మహానగరం ఏర్పాటయ్యింది.
.
గంధర్వులైన విశ్వావసు,హాహాహూహూలూ దేవజాతికి చెందిన అప్సరసలు .
వారిలో ఘృతాచి,విశ్వాచి,మిశ్రకేశి ,అలంబుస,నాగదంత,హేమ,
హిమ ...అనే స్త్రీలు ఉన్నారు.సకల దేవతా స్త్రీ లను అక్కడకు రావించాడు .
.
మైరేయము అనే మద్యము నదిగా పారింది !
బాగా తయారు చేయబడిన "సుర" మరొక నది అయ్యింది ,
చెరకురసాలు నదులుగా పారాయి.
.
చంద్రుడు చక్కని అన్నము తెచ్చాడు అది పంచభక్ష్యపరమాన్నాలతో కూడినటువంటుది.
.
భరద్వాజుడి సంకల్పానికి తగ్గట్లుగా అప్పటికప్పుడు అక్కడ ఒక సుందరమైన లోకం ఇంద్రభవనాలతో దేవేంద్ర వైభవంతో సృష్టింపబడింది.
ఇదివున్నది, అదిలేదు అనిలేదక్కడ! ఎవరికి ఏది కావలిస్తే అది .
.
మహర్షి అనుమతితో భరతుడు రాజసభలోకి ప్రవేశించాడు..
ఆ సభలో ఒక సమున్నతమైన ఆసనం !
దానికెదురుగా మంత్రిసామంతదండనాధులు కూర్చునుటకు వీలుగా సముచిత సుఖాసనాలు అమర్చారు.
.
అక్కడి దివ్యమైన సమున్నత ఆసనానికి భరతుడు ప్రదక్షిణ చేశాడు అక్కడ రాముడున్నట్లు ఊహించుకొని ఆయనకు నమస్కారము చేసి ఆ ఆసనానికి వింజామరతో వీచి తాను మంత్రికూర్చునే ఆసనం మీద కూర్చున్నాడు.
.
( మనసా వాచా కర్మణా ఆయనకు రాముడే రాజు ఆయన పరోక్షంలో కూడ భరతుడికి సింహాసనం మీద మోహం లేదు!)
.
వూటుకూరు జానకిరామారావు
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి