*సరస్వతి*
సరస్వతి అంటే చదువులతల్లి. సరస్వతి అంటే అంతర్వాహిని అయిన ఒక పుణ్యనది. సరణం అంటే విస్తరించడం. ఇది నదికి సహజమే. అనేక సరస్సులు కలిగింది సరస్వతీనది. జ్ఞానాత్మకమైన చదువు ఒకచోట స్తబ్ధంగా ఉండదు. జ్ఞానం కాంతి వంటిది. అది అంతటా విస్తరిస్తుంది. ఇలా విద్యాదేవతగానూ నదీమాతగానూ ‘సరస్వతి’ అనే పదం సార్థకం. సరస్వతీనది పైకి కనిపించదు. భూమిపొరల్లోనుంచి ప్రవహిస్తుంది. జ్ఞానం కూడా పైకి కనిపించదు. మెదడునుంచి నిరంతరం ఉద్భవిస్తూనే ఉంటుంది.
విద్యాధిదేవత అయిన సరస్వతిని పుస్తక రూపిణిగా ఆరాధిస్తారు. పుస్తకమే సరస్వతీ స్వరూపం. పుస్తకం చేతిలో ఉంటే విద్యాదేవత కరతలంలో ఉన్నట్లే. బ్రహ్మదేవుడి భార్య సరస్వతి. బ్రహ్మదేవుడు సృజనకారుడు. సృష్టిరచన ఆయన పని. సృజన చేయాలంటే జ్ఞానం అవసరం. అందుకే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీదేవిని వివాహం చేసుకొన్నాడు. ఈ ప్రపంచం అంతా ఒక అద్భుతసృష్టిగా కనబడుతుంది. సరస్వతి తెల్లనిదని వేదాలు మొదలుకొని అన్ని వాఙ్మయాలూ వర్ణిస్తున్నాయి. రెండు చేతుల్లో వీణను, ఒక చేతిలో పుస్తకాన్ని, మరొక చేతిలో అక్షమాలను ధరించి, తెల్లని పద్మంపై అధిష్ఠించిన సరస్వతీ మాతను ధ్యానించడం సంప్రదాయం. రుద్రాక్షలను అక్షాలంటారు. రుద్రా క్షలతో కూడిన దండ అంటే అక్షరాలతో కూడిన మాలిక అని ఉపాసకులు చెబుతారు. పుస్తకం సకల విజ్ఞానాలకు, వీణ లలితకళలకు, అక్షమాల ఉపాసనకు సంకేతాలుగా కనిపిస్తాయి.
జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడు తుంది. అజ్ఞానం ఒక జడపదార్థం లాంటిది. జడపదార్థంలో ఏ కదలికా ఉండదు. చైతన్యం శూన్యం అవుతుంది. చైతన్యం లేని పదార్థం నిద్రాణమై ఉంటుంది. కనుక ఎలాంటి స్పందనా ఉండదు. జ్ఞానం తేజోవంతమైంది. అది నిత్యచైతన్యంతో అలరారుతుంది. జ్ఞానం ఎప్పుడూ జాగ్రదవస్థలోనే ఉంటుంది. ఎప్పుడూ మేలుకొని ఉండటం జ్ఞానలక్షణం. జ్ఞానం వల్ల ప్రమాదాలు ఉండవు. ఎక్కడ అగాధం ఉందో, ఎక్కడ అపాయం ఉందో తెలిస్తే అలాంటి చోటికి ఏ జీవీ వెళ్లదు. కనుక ప్రతి ప్రాణికీ జ్ఞానం ఆవశ్యకం. జంతువులలో, పశు, పక్ష్యాదులలోనూ ప్రమాదాన్ని పసిగట్టే జ్ఞానం ఉంటుంది. మనిషికే కాదు సకలప్రాణులకూ జ్ఞానం కావలసిందే. మనిషి జంతువులకంటే మిన్నగా వివేకశీలం కూడా కలిగి ఉంటాడు. వివేకం జ్ఞానం వల్లనే సాధ్యం.
సరస్వతికి వాణి అని ఇంకో పేరు. వాణి అంటే పలుకు. పలుకు సంస్కారవంతంగా ఉంటేనే మనిషికి గొప్ప అలంకారంగా మారుతుందని భర్తృహరి మహాకవి తన సుభాషిత త్రిశతిలో అంటాడు. శరీరం నిండా ఎన్ని నగలు వేసుకున్నా మాట చక్కగా లేకుంటే మనిషి విలువ కోల్పోతాడు. మనిషికి మాట ఆభరణం. మాట వజ్రాయుధం. మాట ఎంతో పవిత్రమైంది. దాన్ని దుర్వినియోగం చేయరాదు. చెడుకోసం వినియోగించరాదు. పూర్వం దేవతలు, మహర్షులు సైతం లోకకంటకులైన వారిని శిక్షించడానికే శాపాలు పెట్టేవారు. లోకరక్షణకోసం వరాలు ఇచ్చేవారు.
వాక్కు ఒక నది కనుక అది ఎంత నిర్మలంగా ఉంటే అంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. స్వచ్ఛమైన పలుకుల నదిలో స్నానం చేసేవారు నిర్మలదేహులే కాదు... మానసికంగానూ వాచికంగానూ ఆరోగ్యవంతులై ఉంటారు. మహనీయులందరూ వాఙ్మయ సరస్వతిని ఎంతో పవిత్రంగా ఉపయోగించినవారే. మాట సత్యాన్ని, ధర్మాన్ని నిలుపుతుంది. మాట లోకాలను రక్షిస్తుంది. మనిషిని ఉత్తమస్థితికి చేరుస్తుంది. ఇదే సరస్వతీ తత్త్వం అంటే!
(ఈనాడు అంతర్యామి)
✍🏻- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి