21, అక్టోబర్ 2020, బుధవారం

16-13,14,15,16-గీతా మకరందము

 16-13,14,15,16-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఇదమద్య మయా లబ్ధం

ఇమం ప్రాప్స్యే మనోరథమ్ | 

ఇదమస్తీదమపి వేు 

భవిష్యతి పునర్ధనమ్ || 


అసౌ మయా  హతశ్శత్రుః

హనిష్యే చాపరానపి | 

ఈశ్వరోఽహమహం భోగీ 

సిద్ధోఽహం బలవాన్సుఖీ || 


ఆఢ్యోఽభిజనవానస్మి 

కోఽన్యోఽస్తి సదృశో మయా | 

యక్ష్యే దాస్యామి వెూదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః || 


అనేకచిత్తవిభ్రాన్తా  మోహజాలసమావృతాః | 

ప్రసక్తాః కామభోగేషు 

పతన్తి  నరకేఽశుచౌ || 


తాత్పర్యము:- (అసురసంపదగల వారు ఈ క్రింది విధముగా తలంచుచుందురు) -  "ఈ కోరికను ఇపుడు నేను పొందితిని, ఈ కోరికను ఇకమీదట పొందగలను; ఈ ధనము ఇపుడు నాకు కలదు, ఇంకను ఎంతయోధనము నేను సంపాదింప గలను. ఈ శత్రువును నేనిపుడు చంపితిని, తక్కిన శత్రువులనుగూడ చంపగలను; నేను ప్రభువును; సమస్తభోగములను అనుభవించువాడను; తలంచినకార్యమును నెరవేర్ప శక్తిగలవాడను; బలవంతుడను; సుఖవంతుడను; ధనవంతుడను; గొప్పవంశమున జన్మించినవాడను; నాతో  సమానమైనవాడు మఱియొక డెవడుకలడు? నేను యజ్ఞముల జేసెదను; దానముల నిచ్చెదను; ఆనందము ననుభవించెదను" - అని యీ  ప్రకారముగ అజ్ఞానముచే మోహము (భ్రమ) నొందినవారును, అనేకవిధములైన చిత్తచాంచల్యములతో గూడినవారును, మోహము (దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానము) అను వలచే బాగుగ గప్పబడినవారును, కామముల ననుభవించుట యందు మిగుల యాసక్తిగలవారును అయి, వారు (అసుర ప్రకృతి గలవారు) అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు.


వ్యాఖ్య: - అసురసంపద నాశ్రయించువారి స్వభావము, చిత్తవృత్తి యెట్లుండునో ఈ శ్లోకములందు శ్రీకృష్ణపరమాత్మ చాల విశదముగ వర్ణించిరి. అసురగుణయుతులు ఈ దృశ్యప్రపంచమును శాశ్వతమని నమ్మి, ఆ క్షణికపదార్థములందే పేరాశగల వారై, ఆ యా వస్తుసంపాదనమునే గొప్పగ దలంచుచు గర్వముతో పలుకు వాక్యము లిచట చక్కగ నుదుహరింపబడినవి. ఈ వాక్యములందు ఆ యసురస్వభావుల యొక్క అహంభావము, దర్పము, గర్వము ప్రస్ఫుటితమగుచున్నవి.

కోరికలను అనుభవించిన కొలది అవి ఇంకను పెరుగునేకాని తరగవు. కనుకనే వారు ఒక్కొక్క కోరికను అనుభవించుచు ఇంకను ఎన్నిటినో అనుభవించవలెనను కుతూహలము గలిగియుందురని చెప్పబడినది. మఱియు "నేను గొప్పవాడను. నాతో  సమానమైన వాడెవడు?" అని విఱ్ఱవీగుచు గర్వాహంకారయుతులై వారు పెక్కు చిత్తవికారములు కలిగి అశాంతికిలోనై, తుదకు ఫెూరనరకములనే పొందగలరని యిచట పేర్కొనబడుట వలన ఆ దుర్గుణములన్నిటిని వివేకవంతుడు తప్పక త్యజించవలెనని స్పష్టమగుచున్నది. ఈ శ్లోకములందు వారు గావించు దోషములు, ఆ దోషములయొక్క దుష్ఫలితము - రెండును చెప్పబడినవి. నరకప్రాప్తియే ఆ దుష్ఫలితము. అజ్ఞానులీ ప్రపంచమున ఏమో సుఖమనుభవించుచున్నట్లు  పైకి గోచరించినను లోన అనేక మనోవ్యథలను, చిత్తచాంచల్యములను, అనుభవించుచు తుదకు అపవిత్రమగు నరకమునే పొందుదురు. వారనుభవించు విషయసుఖములు రాజససుఖములేకాని సాత్త్వికసుఖములు కావు. రాజససుఖములు కడకు దుఃఖములుగనే పర్యవసించును.

 "యజ్ఞముల జేయుదును, దానముల నిచ్చెదను" అని వారు పలుకుట డంబమునకే గాని, వాస్తవముగగాదు. ఒకవేళ వారా యజ్ఞాదులను చేసినను, పరులమెప్పును సంపాదించుటకేగాని, సదుద్దేశ్యముతో గాదు. వారు కావించు ఆ యజ్ఞాదులు పేరునకు మాత్రమే యని 17వ శ్లోకమున భగవానుడు చెప్పుబోవుదురు. (నామయజ్ఞైస్తే).


 ఇచట "సక్తాః” అని చెప్పక “ప్రసక్తాః” అని చెప్పుటవలన వారు విషయభోగములందు లెస్సగ ఆసక్తులైయుందురని తెలియుచున్నది. మఱియు "పతన్తి” అని పేర్కొనుటవలన వారు పతనమునే పొందుదురుగాని అభివృద్ధిని గాదని భావము. ఈ శ్లోకములనుబట్టి ప్రపంచములో మనుజులు ఎంత బలము, ఎంత ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యము గలిగియున్నప్పటికిని చిత్తశుద్ధిలేనిచో, అహంకారము, గర్వము తొలగనిచో తుదకు పతనమునే పొందగలరని విదితమగుచున్నది.


ప్రశ్న:- అసురసంపదగల వారింకను ఎట్లు ప్రవర్తించుదురో తెలియజేయుడు?

ఉత్తరము:- వారు “ఈ కోరిక ఇపుడు నెరవేరినది. ఆ కోరిక త్వరలో నెరవేరగలదు; ఈ ధనమిపుడున్నది, ఆ ధనము త్వరలో సమకూడగలదు; నేను ఈ శత్రువును చంపితిని, మిగిలిన శత్రువులను గూడ చంపెదను. నేను ప్రభువును; నేను భోగిని; నేను కార్యసిద్ధిగలవాడను; నేను బలవంతుడను; నేను సుఖవంతుడను; నేను ధనవంతుడను; నేను గొప్పకులమందు జన్మించిన వాడను; నాతో సమానుడెవడు? నేను యాగములను చేయుదును, దానములను చేయుదును, ఆనందము ననుభవించెదను!" అని గర్వముతో అజ్ఞానమువలన పలుకుచుందురు. అనేక చిత్తవికారములుగల్గి  భ్రాంతి జెందియుందురు. మఱియు  మోహము (అజ్ఞానము, అభిమానము) అను వలచే జుట్టబడియుందురు.

ప్రశ్న:- ఇట్టి లక్షణములు గలవారికి ఏగతి లభించును?

ఉత్తరము: - వారు అపవిత్రమగు నరకమందు పడుదురు.

కామెంట్‌లు లేవు: