21, అక్టోబర్ 2020, బుధవారం

రామాయణమ్ 160

రామాయణమ్ 160

...

అడవంతా ప్రతిధ్వనించే సీత ఆర్తనాదాలు జటాయువును నిద్రలేపాయి.అటూ ఇటూ ఒక్కసారి తలతిప్పిచూశాడు.

రావణుడు ,అతనిచేత బలాత్కారముగా కొనిపోబడుతున్న సీత కనిపించారు.

.

జటాయువు రావణుని ఉద్దేశించి ,"రావణా ,నేను సనాతన ధర్మాన్ని పాటించే గృధ్రరాజును నాపేరు జటాయువు ,నీవు ఇంద్రవరుణులతో సమానుడైన రాముని ధర్మపత్నిని అపహరించావు ,

ధర్మపరాయణుడైన రాజు పరులభార్యలను చేతితో తాకవచ్చునా ?

 పైగా రాముడు రాజు ,ఆయన భార్యను రక్షించవలెను గానీ ఈ విధముగా తాకి ఆవిడను అవమానించతగునా నీకు . 

నీ భార్యలను నీవు రక్షించుకొనునట్లే పరులభార్యలను రక్షించవలసిన బాధ్యత కూడా రాజువైన నీకు లేదా?.

.

రావణా ! ప్రజలందరు తమకు జీవనవ్యవహారాలలో ఏ విధమైన సందేహము తలెత్తినా వారు రాజునే అనుసరింతురు .వారికి రాజే ప్రమాణము ! రాజే ఆదర్శము! 

పుణ్యమైనా పాపమైనా ధర్మమైనా వారికి రాజే ఆధారము!

అట్టి రాజైన నీవు ఇట్టి పాపకార్యము చేయ తగునా?

.

ఇంత పాపకార్యము చేసే నీకు అసలు రాజ్యాధికారము ఎలా ప్రాప్తించినది ?

.

రాముడు నీదేశమునందుకానీ ,నీ పురమునందుకానీ ఏవిధమైన అపరాధమూ చేయలేదుకదా! 

అట్టి రామునియందు నీవిట్టి అపకారము ఏల చేయుచున్నావు?

.

రాముని భార్యను చంపయత్నించి ఆ ప్రయత్నములో ముక్కుచెవులు పోగొట్టుకొని రాముని మీద ప్రతీకారము తీర్చుకొనుటకు తనంతతానే రాముని మీదకు ఖరుని ఉసిగొల్పిన శూర్పణఖ చేసిన తెలివిమాలినపనిలో రాముని దోషమేమున్నది?.

..

నీవు వెంటనే సీతను విడిచిపెట్టుము లేనియెడల ఆవిడ నీపాలిట నిప్పుకణముగా మారి నిన్నుచుట్టుముట్టి నిన్నుదహించివేయగలదు!.

.

నీవు భయంకరమైనవిషమును చిమ్ముతూ దారుణమైన కోరలుకలిగిన మహావిషసర్పాన్ని కొంగునకట్టుకున్నావు .నీ కంఠాన్ని సమీపించే యమపాశాన్ని గుర్తించలేకున్నావు!

.

రావణా ! మనిషి తనుమోయగలిగిన బరువును మాత్రమే మోయాలి ,జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే భుజించాలి .

సీతాపహరణము నీకు మోయలేని బరువు! అజీర్ణముచేయు ఆహారము!.

.

లోకమందు ఎవరైనా తమకు కీర్తిని కలుగచేసే పనులు చేస్తారు! 

అపకీర్తినిచ్చి ,మృత్యుద్వారప్రవేశము కలిగించు పనులు చేస్తారా.

.

రావణా నేను పుట్టి అరువది వేల సంవత్సరములయినది నేను నా తండ్రినుండి తాతలనుండి సంక్రమించిన రాజ్యమును యధావిధిగా పాలించుచున్నాను.నేను ముసలివాడను నీవు యువకుడవని అనుకుంటున్నావేమో ! సీతను వదిలిపెట్టి వెళ్ళకపోతే నిన్ను ఇక్కడ నుండి అంగుళమైనా కదలనీయను! 

.

నీవు శూరుడవైతే రా! నాతో యుద్ధము చేయి ! అని అంటూ ధర్మమూర్తి అయిన ఆ జటాయువు రావణుని హెచ్చరించాడు.

.

రామాయణమ్ 161

.....

తనను ఎదిరించవచ్చి మాటలాడుచున్న జటాయువును చూసి రావణుని ఇరవై కళ్ళూ చింతనిప్పులలాగ అయిపోయినవి.భయదోగ్రముఖము కలిగిన రావణుడు అతి వేగముగా జటాయువు మీదకు యుద్ధానికి వెళ్ళాడు.

.

రెక్కలున్న రెండు మహాపర్వతములు ఢీకొట్టుకుంటున్నవా అనునట్లుగా ఆ ఇరువురూ కలియబడినారు.

.

రావణుడు భయంకరమైన వంకరములుకులున్న బాణములు ,సన్ననిములుకులు గల బాణాలతో ఆ పక్షిరాజు ను కప్పివేశాడు.

.

ఆ బాణములన్నింటినీ తన బలమైన రెక్కలను అల్లలలాడించి ఎగురకొట్టి వేసిన జటాయువు వాడివాడిగోళ్ళు కలిగిన తన పాదాలతో వాడిముఖాన్ని శరీరాన్నీ తీవ్రగాయాలుకలుగునట్లుగా చీరివేశాడు.

.

వెంటనే కోపించిన రావణుడు మృత్యుదండములవంటి పదిబాణాలను ఒకేసారి ప్రయోగించి జటాయువు శరీరము బ్రద్దలయ్యేటట్లుగా తీవ్ర వేగంతో కొట్టాడు .

.

సీతను రక్షించుట అనే విషయము మీదనే దృష్టినిలిపిన జటాయువు ఆ బాణాలను లెక్కసేయక ఒక్కసారిగా రావణుని మీదకు దూకి వాని చేతనున్న మణిమయ ధనుస్సును బాణములను రెప్పపాటులో పాదములతో విరిచివేసి తన రెక్కలతో వానిని కప్పివేసి ఉక్కిరిబిక్కిరి చేయసాగాడు.

.

రావణుడికి కోపము మరింత హెచ్చి మరొక ధనుస్సు చేతబూని వందలు వేలుగా పుంఖానుపుంఖాలుగా శరములను జటాయువు మీదకు వర్షించసాగాడు.

.

ఆ బాణములచే కప్పబడ్డ జటాయువు గూడులో ఉన్న పక్షిలాగ ప్రకాశించసాగాడు.

.

ఆ ధనుస్సును కూడా కడు లాఘవంగా విరిచివేసి తన రెక్కలచేత రావణుడు ధరించిన కవచమును వలిచివేశాడు జటాయువు.

.

అంతటితో ఊరుకోకుండా రావణరధమునకు కట్టబడిన గాడిదలను చంపివేసి రధమునుకూడా విరుగగొట్డాడు ,సారధి శిరస్సును తనముట్టెతో పొడిచి ఎగురగొట్టి రాజలాంఛనములను పట్టుకొన్న రాక్షసులను మహా వేగంతో క్రిందపడవేశాడు.

.

ఒక్కసారిగా తన ఒడిలో కూర్చుండబెట్టుకున్న సీతతో సహా భూపతనమయిపోయాడు రాక్షసరాజు.

.

ఇంత పోరాటము చేస్తున్న జటాయువుకు ఒక్కసారిగా వార్ధక్యమువలన కలిగిన అలసటను గమనించి సీతనుపట్టుకొని ఒక్కుదుటున గాలిలోకిఎగిరి తప్పించుకొనిపో ప్రయత్నించాడు రావణుడు.

కామెంట్‌లు లేవు: