21, అక్టోబర్ 2020, బుధవారం

మహాభారతము ' ...56 .

 మహాభారతము ' ...56 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం.


పాండవులు తాము మాయాద్యూతంలో పోగొట్టుకున్న సంపదనంతా తిరిగిపొంది ఇంద్రప్రస్థం చేరుకోగానే, అక్కడ హస్తినలో దుష్ట చతుష్టయం నిరాశకు గురయ్యారు. తాము పన్నిన పన్నాగం వృధా అయిపోయిందని చింతించారు.  


తిరిగి పాండవుల సంపదని కాజేయాలని మరో పధకానికి రూపకల్పన చేశారు. మళ్ళీ ధృతరాష్ట్రుని బుట్టలోవేసుకుని ఆపధకానికి అంగీకారంపొందే ఉద్దేశ్యంతో యింకొకసారి, ధృతరాష్ట్రుని చేరారు దుష్టచతుష్టయం.  


ఈసారి, దుర్యోధనుడే తండ్రిని వప్పించడానికి పూర్తి బాధ్యత తీసుకున్నాడు. ' తండ్రీ !వారు చేసిన శపధాలు విన్నారు కదా ! శపధాలు చేసి వెళ్ళినప్పటినుండీ మాకు యిక్కడ నిద్రాహారాలు లేవు. సరదాగా ఆడిన ద్యూతక్రీడ మా ప్రాణాలకే ముప్పు తీసుకు వచ్చేటట్లున్నది.. అర్జునుడు పైకి యేమీ మాట్లాడకపోయినా అతని క్రోధదృక్కులు మమ్ములను కాల్చివేస్తాయేమో అనిపించింది. మేము భీమార్జునులను యెదిరించి పోరాడాలంటే, జయాపజయాలు దైవాధీనాలు. వారు కసితో రగులుతున్నారు గనుక, యుద్ధమంటూ జరిగితే వారే విజయం సాధిస్తారు. '


' మేము యేశత్రుభయం లేకుండా రాజ్యం ఏలుకోవాలంటే, ఆ పాండవులను, మరియొకసారి ద్యూతానికి పిలువవలసిందే. ఈసారి, ఒకేపందెంతో విజయం వరించేటట్లు ద్యూతం ఆడుతాము. ఆ ఒక్కపందెంలో ఓడినవారు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చెయ్యాలి. అజ్ఞాతవాసంలో వారి వునికి గెలిచినవారు కనిబెడితే, ఓడినవారు తిరిగి పన్నెండు యేళ్లు అరణ్యవాసము , అజ్ఞాతవాసము చెయ్యవలసివుంటుంది. ఈ నియమాలతో మళ్ళి ద్యూతం ఆడే అనుజ్ఞ యివ్వండి తండ్రీ ! ' అని ప్రాధేయపడ్డాడు.


ధృతరాష్ట్రుడు ఒకింత సంతోషించిాిి, వెంటనే, ' ఎందుకో నామనసు అంగీకరించడం లేదు. వారిని మట్టుపెట్టవలెనని చిన్ననాటినుండీ నీవు ప్రయత్నిస్తున్నావు. నీ వలన అగుటలేదు. ప్రతిసారీ నలుగురిలో నేను చిన్నబుచ్చుకోవలసిన పరిస్థితి యేర్పడుతున్నది. ' అన్నాడు.  


' మీరు కలుగ జేసుకోకుండా వుండివుంటే, ఈపాటికి పాండవ రాజ్యలక్ష్మిని, పాండవ పట్టమహిషిని పాదాక్రాంతులం చేసుకునేవారమే కదా జనకా ! అందుకని యింకొక్క అవకాశం మాకివ్వండి. పాండవులను ద్యూతానికి ఆహ్వానించండి. ఈసారి మా గురి తప్పదు. పందెం కూడా ఒకసారే వేస్తాము కాబట్టి అనవసర రాద్ధాంతము, సభలో విమర్శలు వుండవు. ' అనిచెప్పి తండ్రిని ఒప్పించాడు.


కానీ గాంధారి అంతావిని, వారికి అనుమతి యివ్వవద్దని చెప్పింది ధృతరాష్ట్రునితో. పాండవులను అడవికి పంపే యోచన విరమించుకోమన్నది. అదేజరిగితే, మన కౌరవ వంశనాశనానికి నీవే ముహూర్తం పెట్టినట్లు అవుతుంది. ' అన్నది. దానికి ధృతరాష్ట్రుడు ' దేవీ ! నీకొక సత్యము చెప్పవలెను . నాకు దుర్యోధనుని నియంత్రించే శక్తిలేదు. నేను వలదు అనిచెప్పినా, నన్ను బలవంతంగా ఒప్పించి తనపంతము నెరవేర్చుకుంటాడు. కానున్నది కాకమానదు. పుత్రక్షయం, వంశక్షయం అనుభవించవలసిన వ్రాత, మన నుదిటిపై వుంటే అలాగే జరుగుతుంది. ' అని నిస్సహాయంగా అన్నాడు.


వెంటనే, పాండవులకు వర్తమానం వెళ్ళింది. తాము ఇంద్రప్రస్థం చేరీ చేరకుండానే, మలివిడత యీఆహ్వానం రావడం వారిని వ్యాకులపరచింది. తమ కర్మఫలాలు, యీ విధంగా వెంటాడుతున్నవని, పెదతండ్రిగారి ఆజ్ఞ ధిక్కరించే అధికారం తనకులేదని, మళ్ళీ హస్తినాపురానికి ద్యూతక్రీడకు పయనమయ్యాడు, తమ్ములతో, భార్యతో సహా. శకుని మోసపూరిత ఆటను గ్రహించికూడా, కేవలం పెదతండ్రిని సంతృప్తి పరచడానికి మళ్ళీ వచ్చాడు ధర్మరాజు. ఎంత విచిత్రము !. స్వంతకుమారుడు తనమాట వినడని, కుమారుని దుష్ట ఆలోచనలకు ధృతరాష్ట్రుడు తలవొగ్గితే, పెదతండ్రి ఆజ్ఞ దాటరానిదిగా, ధర్మజుడు భావించాడు.


ద్యూతక్రీడాభవనం లోకి సదస్యులు అందరూ వచ్చారు. శకుని ఆట నియమాలను చెప్పగానే, వచ్చినవారంతా నిశ్చేష్టులయ్యారు. భయంతో చలించిపోయారు. పాండవులకు రానున్న ప్రమాదం పసిగట్టారు.  


భీష్మ, ద్రోణ, కృప, విదురులు ఆట ప్రారంభించకముందే చెప్పారు, యీ ఆట ఆడవద్దని వారించారు. అయినా సరే, తనకు అన్నీ తెలిసే వున్నా, ధృతరాష్ట్రుని మాట కాదనలేక, యీ విషవలయం లోనికి అడుగుపెట్టానని చెప్పాడు. పెదతండ్రి వంచనను పసిగట్టిన, ధర్మరాజు ధర్మానికి కట్టుబడి వున్నాడు. క్రీడకు సరేనన్నాడు.  


క్రీడకు సిద్ధంగా వున్న శకుని, ' ధర్మజా ! నీవు సిద్ధమే కదా ! ఆట ఒక్కసారి పాచికలు వేయడంతో ముగుస్తుంది. నీ సంఖ్య యెంతో చెప్పు ' అన్నాడు. ధర్మరాజు నిస్సహాయంగా, ఆటకు సిద్ధమయి,శకుని పాచికలు వేసివేయగానే, బిగ్గరగా, ' విజయం మాదే ' అనేటప్పటికి హతాశుడయ్యాడు.


ధర్మజుడు రెండవసారి కూడా మాయాజూదంలో మోసపోయాడు. మొదటిసారి ఓడినప్పుడు అమాయకత్వం కావచ్చు. . రెండవసారి ఓడడమంటే, విధిలిఖితమే.  


పాండవులు ద్రౌపదితో సహా, మృగచర్మాలు ధరించి వనవాసానికి బయలుదేరారు. వారిని చూసి, దుశ్శాసనుడు, దుర్యోధనుడు విపరీత, అశ్లీల వ్యాఖ్యానాలు చేశారు. వారికి భీమసేనుడు తానుచేసిన శపధాలు గుర్తుచేసి, ఆరోజుకు యెదురుచూస్తుండమని చెప్పాడు.  


' అనుచితమైన సలహాలు ఇచ్చిన ఆ సూతపుత్రుడు కర్ణుని యమపురికి పంపుతాను. వాని అనుచరులలో ఒక్కరినికూడా వదలను. ' అన్నాడు అర్జునుడు.  


నకులుడు అయితే, ' ఓరీ మాయాద్యూత విశారదా ! శకునీ ! నీ పాచికలు పని చెయ్యని రణరంగంలో, నిన్ను చీల్చి చెండాడుతాను. ' అన్నాడు.  


విదురుడు , కుంతిని కుమారుల వనవాస సమయంలో, తమ ఇంట వుండమని ఆహ్వానించి, తన విజ్ఞతను చాటుకున్నాడు. ఆమె వనవాసానికి వెళ్లకుండా ఆపాడు.  


పెద్దలందరినుండీ వనవాసానికి అనుజ్ఞపొంది ధర్మజుడు, అతని సోదరులూ, ప్రయాణం కొనసాగే ముందు కుంతిని కలిసి నమస్కరించారు. ద్రౌపదినిచూసి, దుఃఖం ఆపుకోలేక, కంట తడి పెట్టుకుని, నీ ధర్మనిష్ఠ, సదాచారమే, నీకు రక్షగా ఉంటాయి అని చెప్పింది. అందరిలోకి చిన్నవాడైన సహదేవుని జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పింది. 


యుధిష్టురుడు ముందు నడుస్తూ వుంటే, మిగిలిన సోదరులూ, ద్రౌపదీ, వారి పురోహితులు ధౌమ్యులవారితో వెంట నడుస్తున్నారు.  


ధృతరాష్ట్రుడు ద్యూత క్రీడకు అనుమతి అయితే యిచ్చాడుగానీ, జరిగిన విపరీత పరిణామాలకు, తట్టుకోలేక, గాంధారి వద్ద తన వ్యధను చెప్పుకున్నాడు. ఇంకా దుఃఖం ఆగక, మనశ్శాంతి కరువై, విదురుల వారిని పిలిపించాడు.


పాండవుల పయనం సాగుతున్నది.  


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత సోమవారం నాడు....తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ

9989692844

కామెంట్‌లు లేవు: