14, అక్టోబర్ 2020, బుధవారం

ధార్మికగీత - 49*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 49*

                                 *****

     *శ్లో:- గురవో బహవ స్సన్తి ౹*

            *శిష్య విత్తాపహారిణః ౹*

            *దుర్లభో ౽యం గురు ర్దేవి!*

            *శిష్య చిత్తాపహారకః ౹౹*

                           *****

*భా:- "గురువు", "దేవుడు" ప్రతి ఒక్కరికి జీవితనౌకకు దిక్సూచి వంటివారు. ఒకరు జ్ఞానదాత. ఒకరు మోక్షప్రదాత. వీరిరువురు ప్రత్యక్షమైతే దేవుని సాక్షాత్కరింపజేయగల జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకే ముందుగా నమస్కారం చేయాలి. "గు" అంటే చీకటి. "రు" అంటే పోగొట్టేవాడు. మన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టబట్టే "గురుదేవుడు" అందరికి పూజనీయుడు అయినాడు. గురువు శిష్యునిలో నిద్రాణమై యున్న సృజనాత్మకశక్తిని వెలికితీయ గల "బ్రహ్మ"స్వరూపుడు. జ్ఞానదీపిక యైన సాధనాసంపత్తిని పెంచి, పోషించగల "విష్ణు"స్వరూపుడు. జ్ఞానార్జన కడ్డుతగిలే అష్టమదాలను, అరిషడ్వర్గాన్ని లయం చేయగల "శివ" స్వరూపుడు. అందుకే గురువు సాక్షాత్తు "పరబ్రహ్మ" మే. ఆయన మన జీవిత లక్ష్య మార్గదర్శి. కాని ఓ జగన్మాతా! నేటి ఆధునిక యాంత్రిక కాలంలో శిష్యపరమాణువుల విత్తము(డబ్బు)ను దోచుకునే గురువులు కోకొల్లలుగా ఉన్నారు. విద్యారంగ మంతా ధనమయమైనది. శిష్యుని చిత్తము(మనసు)ను దోచుకునే గురువే కరువైనాడు. గురువు తను అపార విద్యాపారంగతుడైనా, విద్యార్థి స్థాయికి దిగి, అతని హృదయానికి హత్తుకొనేలా పాఠం బోధించగల "బోధ" గురువే నిజమైన ఆదర్శగురువు. మిగిలినవారంతా "బాధ" గురువులే. ఆనాటి మేటి గురుశిష్యసంబంధాలు నేడు కనుమరుగై పోతున్నాయి. గురుస్థానాన్ని మన హృదిలో, మదిలో పవిత్రంగా పది కాలాలపాటు పదిలం చేసుకొంటూ, నిరంతర జ్ఞాన సముపార్జనచే , గురుకృపతో పరమాత్ముని ప్రసన్నం చేసుకునే దిశగా పురోగమించాలి*

                *ఓం శ్రీ గురుభ్యో నమః*

                            *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: