14, అక్టోబర్ 2020, బుధవారం

రామాయణమ్. 92

 రామాయణమ్. 92

...

భరతుడి అరుపులు,కేకలు, పెడబొబ్బలతోఅంతఃపురం మారుమ్రోగిపోతున్నది.భరతుడి గొంతు గుర్తుపట్టిన కౌసల్య సుమిత్రతో అదిగో భరతుడు వచ్చినట్లున్నాడు ఆ గొంతు అతనిదే కదా అని ఆవిడ అంటూఉండగనే భరతశత్రుఘ్నులు పెత్తల్లి చెంతకు చేరారు.

.

ఆవిడ అప్పటికే భర్తృవియోగం ,పుత్రుడు దూరమవ్వటం అనే రెండు పదునైన దుఃఖాలు మనస్సును కోస్తూ ఉంటే మాటిమాటికీ సంజ్ఞతప్పి ఏడుస్తూ నేల మీదపడి దొర్లుతూ అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న కౌసల్యను చూడగనే భరతుడి హృదయంలో అంతులేని వేదన పుట్టింది.

.

నేలమీద పడి ఉన్న మహారాణి కౌసల్య మహాధానుష్కుడు,జగదేకవీరుడైన రాముడి కన్నతల్లిని అలా చూడలేక పోయాడు భరతుడు.వెంటనే జలజలకన్నీరు కారుస్తూ కౌసల్యను లేవనెత్తి ఆవిడను కౌగలించుకొన్నారు భరతశత్రుఘ్నులిరువురూ..

.

భరతుని చూడగనే కౌసల్య నాయనా ఏ శత్రుబాధలేని రాజ్యము నీకు లభించినదికదా ! ఏమి ఆశించి నా కొడుకుకు నారచీరలు కట్టబెట్టి నీ తల్లి వాడిని అడవులకు పంపింది .నా కొడుకున్నచోటికే నన్ను కూడ పంపివేయి. ఈ రాజ్యము హాయిగా నీవు ఏలుకోవచ్చు.

.

పుండును కెలికి సూదితో గుచ్చినట్లున్నాయి కౌసల్యామాత మాటలు .భరతుడి వేదన అంతకంతకూ హెచ్చింది .దానికి అంతం లేకుండా పోయింది...

.

పెద్దతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మా ఏ పాపము తెలియని నన్నెందుకు నిందిస్తావు.అన్నమీద నాకు గల ప్రేమ,భక్తి నీవెరుగనివా?

.

అమ్మా అన్నగారి అరణ్యవాసానికి నా సమ్మతి ఉన్నట్లయితే..

.

సూర్యభగవానుడి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది

.

జీతము ఇవ్వకుండా పని చేయించుకొన్న యజమానికి ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు కలుగుతుంది.

.

మాట ఇచ్చి తప్పినవాడికి ,ప్రజల రక్షణ మరచిన రాజుకు ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

రణరంగంలో పోరాడి మరణించక వెన్నుచూపి పారిపోయినవాడికి ఏ పాపం చుట్టుకుఙటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఆవులను కాలితో తన్నినవాడికి,పెద్దలను దూషించినవాడికి,మిత్రద్రోహము చేసిన వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఎదుటివాడు విశ్వాసముంచి చెప్పిన రహస్యాన్ని బహిర్గతపరచినవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఇంటిలోని భార్యాపిల్లలకు,అతిధులకు,బంధువులకు ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే మృష్టాన్న భోజన మారగించే వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకొను గాక.

.

అమ్మకూడని వస్తువులు .లక్క,మధువు,లోహము,విషము,మాంసము అమ్మేవాడికి ఏ పాపము చుట్టుకుంటుందో అది చుట్టుకొను గాక.

.

నాకు ఆ ఉద్దేశ్యమే ఉండి నట్లయితే కుండ పెంకు చేతబట్టి చినిగిన గుడ్డలు కట్టి భిక్షమెత్తుకొంటూ ,పిచ్చివాడివాలే భూమి మీద తిరుగుదును గాక..

.

సంధ్యా సమయాలలో నిదురించే వాడికి కలిగే పాపము నాకు కలుగు గాక.

.

పరభార్యా సంగమము చేసిన వానికి ఎట్టిపాపము కలుగునో అట్టిపాపము నాకూ కలుగు గాక.

‌.

ఈ విధంగా కౌసల్యను ఓదర్చటానికి ప్రయత్నం చేస్తూ దుఃఖ భారంతో తానుకూడ నేలమీద పడిపోయాడు భరతుడు.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: