14, అక్టోబర్ 2020, బుధవారం

దూరం నుంచి దర్శనం

 దూరం నుంచి దర్శనం..


"అయ్యా..గుడి దగ్గరకు దంపతులు ఇద్దరు కారులో వచ్చారయ్యా..ఇద్దరూ వయసులో పెద్దవాళ్ళు..సుమారు అరవై ఐదు, డెబ్భై ఏళ్ళు వుంటాయేమో..చాలా దూరం నుంచి వచ్చారట..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లిపోతారట..దర్శనం కుదరదు అని చెపుతున్నాము..కానీ ప్రాధేయపడుతున్నారు..ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేస్తున్నాము.." అని మా సిబ్బందిలో ఒకరు నాకు తెలిపారు..అప్పటికి కరోనా తాలూకు లాక్ డౌన్ పెట్టి సరిగ్గా పదిరోజులు..ఏప్రిల్ నెల 4,5 తేదీలలో నాటి సంఘటన ఇది..ప్రయాణాలు చేయకుండా పూర్తి స్థాయిలో నిషేధం ఉంది..మరి ఈ దంపతులు ఎలా వచ్చారు? అని నాకు సందేహం వచ్చింది..పైగా..ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్ధనా మందిరాలు తెరువరాదనే నియమం పెట్టారు..స్వామివారి నిత్య పూజలూ..నైవేద్యములు..కైంకర్యాలు..అర్చకస్వాములు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..అప్పటికి స్వామివారి మందిరం వద్ద దత్తదీక్ష స్వీకరించిన స్వాములు సుమారు 250 మంది వున్నారు..వాళ్ళు కాకుండా దూరప్రాంత వాసులు..ప్రయాణం చేసే వీలులేక..మరో 50 మంది కూడా వున్నారు..వీళ్ళందరికీ రెండుపూటలా అన్నప్రసాదం ఏర్పాటు చేసాము..ఆ హడావిడి లో మా సిబ్బంది వున్నారు..అక్కడ దీక్ష చేస్తున్న స్వాములు దర్శనానికి స్వామివారి మందిరం లోకి రాకుండా మేము అనుమతి ఇవ్వలేదు..ఆ పరిస్థితుల్లో ఈ దంపతులకు అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పి..భోజనం పెట్టించి..వెనక్కు పంపివేయమని చెప్పాను..మా సిబ్బంది సరే అన్నారు..


ఆరోజు నేను మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వెళ్లలేదు..ప్రక్కరోజు ఉదయం స్వామివారి మందిరానికి వెళ్ళాను..స్వామివారి ఆలయం వెనుక వైపు ద్వారం వద్ద ఆ దంపతులు నిలబడి వున్నారు..వారి వద్దకు వెళ్ళాను..నమస్కారం చేశారు.."నా పేరు వెంకటేశ్వరరావు అండీ..నా భార్య సుబ్బలక్ష్మి..మా ఊరు మచిలీపట్నం దగ్గర..తీవ్రమైన సమస్యలో వున్నాము.. మా అమ్మాయి జీవితానికి సంబంధించినది.. మాకు ఒక్కతే కూతురు..అది ఇంట్లో కూర్చుని దుఃఖ పడుతుంటే చూడలేకుండా వున్నాము.. స్వామివారి గురించి ఆరేడు నెలల నుంచీ చదువుతున్నాను..ఇక ఏ దారీ తోచలేదు..కారు తీసుకొని..నా భార్యను తోడు తీసుకొని..నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను..ఒకసారి స్వామివారి సమాధిని దర్శించుకొని..మా సమస్యను ఆ అవధూత చెవిలో వేసి వెళ్లిపోదామని అనుకున్నామండీ..కానీ ఇక్కడికి వచ్చాక మాకు పరిస్థితి అర్ధం అయింది..దత్తదీక్ష స్వీకరించిన వారిని కూడా మీరు లోపలికి అనుమతించడం లేదు..ప్రభుత్వ నిబంధనలు మీరు పాటించాలి..ఈ రెండురోజులు స్వామివారి ప్రసాదం తీసుకున్నాము..ఇంత వత్తిడి లోనూ మీరు ఇంతమందికి ఇబ్బంది లేకుండా ఆహారం అందిస్తున్నారు..సరే నండీ మాకు ప్రాప్తం లేదు..మీరు స్వామివారి ని ప్రత్యక్షంగా చూసి, సేవ చేసుకున్న వారు కనుక..మీతో మా సమస్య చెప్పుకొని వెళ్లిపోతాము..మళ్లీ ప్రాప్తం ఉంటే..ఇంకొకసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాము.." అన్నారు..మందిరం ప్రధాన ద్వారం వద్దకు వచ్చి..ఆ ద్వారం అవతల వైపునుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..


"అయ్యా..మీ మనసులోని వేదనను స్వామివారి కి ఇక్కడినుంచే విన్నవించుకోండి.. ఈ ప్రదేశం అంతా స్వామివారు నడచిన నేల.. మీరు మనస్ఫూర్తిగా స్వామివారిపై విశ్వాసం ఉంచండి.." అని చెప్పాను..దంపతులిద్దరూ..ఆ గేట్ కు తమ తలలు ఆనించి..కళ్ళు మూసుకొని సుమారు పది నిమిషాలు అలానే ఉండిపోయారు..ఆ తరువాత ఇవతలికి వచ్చి..నాకు వెళ్ళొస్తామని చెప్పి.. "స్వామివారి విభూతి గంధం ఇప్పించగలరా?" అన్నారు..మా సిబ్బందికి చెప్పి రెండు పాకెట్లు విభూతి గంధం, స్వామివారి చిన్న ఫోటో తెప్పించి..వారికి ఇచ్చాను..భక్తిగా కళ్లకద్దుకొని తీసుకొని..కారులో వెళ్లిపోయారు..


వైశాఖ శుద్ధ సప్తమి రోజు స్వామివారి ఆరాధన వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ..ఈసారి ఈ కరోనా కారణంగా వేడుక పూర్తిగా రద్దుచేసి..కేవలం మా అర్చకస్వాములు, సిబ్బంది సమక్షంలో ప్రత్యేక పూజలు, అభిషేకము నిర్వహించాము..దత్తదీక్ష స్వీకరించిన స్వాములు ఆలయం వెలుపలే వుండి దీక్ష విరమణ చేశారు..ఆరోజు ఉదయం 10 గంటల వేళ.."ప్రసాద్ గారూ..నా పేరు వెంకటేశ్వర రావు..మేము 25 రోజుల క్రితం మొగిలిచెర్ల వచ్చి, గేటు దగ్గరనుంచి స్వామివారి సమాధిని చూసి..మొక్కుకొని..మీతో మాట్లాడి వెళ్ళాము..గుర్తుకు వచ్చామా? " అని ఫోన్ లో అడిగారు.."గుర్తు వున్నారు.." అన్నాను..


"స్వామివారు మమ్మల్ని కరుణించారు.. మా సమస్య తీరిపోయింది..ఈ వయసులో మా నెత్తిమీద ఉన్న బరువు తొలిగిపోయింది..మాకు మనోవేదన కలగడానికి కారణం అయిన మా అమ్మాయి కాపురం చక్కబడింది..అల్లుడు గారే వచ్చి మాకు క్షమాపణ చెప్పి, అమ్మాయిని తీసుకెళ్లాడు..మీకొక విషయం చెప్పాలి..స్వామివారి విభూతి గంధం మా అమ్మాయి రోజూ ధరించింది..మేము అక్కడ ఉన్న రెండురోజులు మీ సిబ్బంది బాగా సహకరించారు..ఈ కరోనా కష్ట కాలం తొలగిపోగానే వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాము..స్వామివారి సమాధి వద్దకు ఆరోజు పోలేకపోయామే అని బాధపడ్డాము కానీ.. మీరు చెప్పినట్టు ఆ ప్రదేశం అంతా స్వామివారు నిండిపోయి వున్నారు..దూరం నుంచి దర్శనం చేసుకున్నాము..స్వామివారు మమ్మల్ని దయతో దగ్గరకు తీసుకున్నారు.. అక్కడే మూడు రాత్రులు నిద్ర చేసాము.. ఆయన మా మొర విన్నాడు..ఈసారి తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుంటాము.." అని ఉద్వేగంతో చెప్పారు..


స్వామివారి పై ఆ దంపతుల అచంచల విశ్వాసమే వారి ఆనందానికి హేతువు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: