కావ్య కంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్లారు. వారితోపాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకు జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్యా ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిధి. అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజను అరటిపళ్ళు కొన్నారు. వాడు అవన్నీ తినేశాడు. తినేసి ఒక గంట గడిచేసరికి మళ్ళీ అతడు అన్నయ్యా ఆకలేస్తోంది అన్నాడు. అపుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్లి 'భవతీ బిక్షామ్ దేహీ' అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. అపుడు ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడాడనికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి."ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట! ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు" అని ఆయన అనుకున్నారు.
ఆయన ఒక ఇంటి ముందునుంచి వేడుతున్నారు. ఆ ఇంటి అరుగుమీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకుని ఉన్నాడు. ఆయన గభాలున లేచి కావ్య కంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు. 'నీవు బాగా దొరికావు. నా భార్య కు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసేముందు ఆవిడకు ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవ్వాళ తిరువణ్ణ మలైలో యాత్రికులు కూడా దొరకలేదు. ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు. మా ఇంట్లో కి రా! అని తీసుకు వెళ్ళాడు. ఆ ఇంట్లోని ఇల్లాలు స్నానం చేసి రండి.భోజనం వడ్డిస్తాను' అంది.
కావ్యకంఠ గణపతి ముని, ఆయన తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడి బట్టను ఇచ్చింది. అవి కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ షడ్రషోపేతమైన భోజనం పెట్టింది.
భోజనం ఐన తరువాత ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే దానివలన ఎంతో గొప్ప శ్రేయస్సు ను పొందుతాడు. వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది.
వీళ్ళు కడుపునిండా తినేసారేమో కళ్ళు పడి పోతున్నాయి. 'అమ్మా , ఇంక ఎక్కడికీ తిరగలేం. ఈ రాత్రికి మీ అరుగుమీద పడుకుంటామమ్మా!' అన్నారు. ఆవిడ సరేనని ఆవిడ తలుపు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. గాఢ నిద్ర పట్టేసింది. వీరు నిద్రించిన ఇల్లు అరుణాచలం లో అయ్యంకుంట్ల వీధిలో ఉంది.
మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది. ఇద్దరూ నిద్ర లేచారు. 'అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదా మనకి అన్నం పెట్టింది' అనుకుని అరుగుమీద నుండి లేచి చూసారు. అది వినాయకుడి గుడి. అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి 'రాత్రి మనం షడ్రషోపేతమైన భోజనాలు తిన్నాము. ఇక్కడ రత్నకింకిణులు ఘల్లుఘల్లు మంటుంటే ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది'అని చూసారు. కలకాని కన్నామా అనుకున్నారు. పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి, ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో , వాడు నోరు తెరచి అడగవలసిన అవసరం లేకుండా, వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో , అమ్మవారిపట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో వాడిని అమ్మ యే కాపాడుతూఉంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పతాకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టు.
సేకరణ: చాగంటి గారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి