9, జనవరి 2021, శనివారం

దివ్యబోధ

 *దివ్యబోధ*


పైకి ఏదో వేదాంతంలా, వైరాగ్యంలా ఈ మాటలు కనిపిస్తాయి కానీ, దృఢమైన వైరాగ్యం మనస్సులో ఉన్న వాడే అవినీతికి పాల్పడకుండా ఉంటాడు. నవజీవనంలో కావాల్సింది కూడా అదే. ఏమిటా వేదాంతం? ఏమిటా వైరాగ్యం? ఏమిటా దృఢమైన విశ్వాసం? అంటే...

శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడి దివ్యబోధ మొదలుపెడుతూ ఇలా అంటాడు. అర్జునా!....

 

దేహినోస్మిన్‌ యథా దేహే కౌమారం యౌవనం జరా

తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి

 

ఎనిమిదేళ్ల వరకు ‘బాల్యం’ అంటారు. పదహారేళ్ల వరకు ‘కౌమారం’, పదహారు నుంచి ముప్ఫైఆరు వరకు యవ్వనం, అక్కడి నుంచి ‘ప్రౌఢ వయస్సు’ అని అంటారు. యాభై ఆరేళ్లు దాటాక ‘వార్థక్యం’ అంటారు. కౌమారం, యవ్వనం, ముసలితనం...ఇవన్నీ ఏవిధంగా ప్రాప్తిస్తున్నాయో, ‘తథా దేహాంతరప్రాప్తిః’ అదేవిధంగా మరణం కూడా వస్తుంది. అది కూడా మరొక దశ. అందుచేత వయస్సు శాశ్వతం కాదు. మనస్సు శాశ్వతం కాదు. ‘ధీరస్తత్ర న ముహ్యతి’ అంటే ధీరుడైన వాడెవడూ ఈ మరణం గురించి శోకించడు.

 

శరీరంలో వచ్చే ఇన్ని మార్పులకు సిద్ధమైనప్పుడు, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం ఎందుకు? మృత్యువు ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటుంది. కాబట్టి చావు గురించి బాధగానీ, భయంగానీ లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్లాలి. ఉన్నంత కాలం మన పని మనం చేశామా? లేదా? వయస్సులు మారుతున్నాయి. మనస్సులు మారుతున్నాయి. అభిప్రాయాలు మారుతున్నాయి. అనుబంధాలు మారుతున్నాయి. ఏదీ శాశ్వతం కానప్పుడు ఎందుకు బాధపడాలి? ఈ గంభీరమైన నివృత్తిని మనస్సులో ఉంచుకుంటే ఎవరిపట్ల ఎలా ఉండాలో అలాగే ఉంటాం. ఎప్పుడూ నిశ్చింతగా ఉంటాం.

ప్రపంచంలోని భక్తివిశ్వాసాలకు సంబంధించి- మనుషుల్ని ఆస్తికులు, నాస్తికులుగా భావిస్తుంటాం. భగవంతుణ్ని అర్చించనివారు, నమ్మనివారు అందరూ నాస్తికులేనా? నమ్మనివారు అంటే, వారు భగవంతుడికి శత్రువులని అనుకోలేం. శత్రుత్వమైనా, అసలంటూ అక్కడ ఒక రూపం ఉండాలి. అప్పుడే కదా శత్రుత్వం ఉండేది!

హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపాది రాక్షసులు ‘హరి’ అని ఒక రూపం ఉందని భావించే, ఆయన పట్ల శత్రుత్వం వహించారు. నాస్తికుల కంటే శత్రువులే నిరంతరం హరి స్మరణ చేస్తుంటారు. భక్తుల కంటే అధికంగా స్మరి స్తామన్నారు జయ విజయులు. అందుకే వారు హరి భక్తులుగా ఏడు జన్మలు కాకుండా, హరితో వైరాన్ని మూడు జన్మలపాటు కోరుకున్నారు. ఆయనతో ఎడబాటును మూడు జన్మలకు ముగించాలన్నదే వారి కోరిక!

మానవజాతిలో ఆస్తికులు, నాస్తికులు కాకుండా మధ్యేమార్గంలో కొందరుంటారు. వారిది డోలాయమాన వైఖరి, దయనీయ పరిస్థితి. వారికి భక్తి ఉందా అంటే, లేదనిపిస్తుంది. లేదా అంటే ‘ఉంది’లా ఉంటుంది. ఏమిటిది? భక్తిని అనుసరించాలని, దైవాన్ని నమ్మాలని, దైవభావననే సాధన చేయాలని పలువురికి మనసులో ఉంటుంది. లోపల ఏదో ఒక భయం, బెరుకు ఉంటాయి. భక్తి అంటే ఏమిటి, ఏం చేయాలి; భగవంతుడు నన్ను, నావంటివారిని కరుణిస్తాడా అని ప్రశ్నించుకుంటారు.

వారిలో అనేక నియమ నిష్ఠలుంటాయి. పాపభీతి, దేన్నీ వదులుకోలేని తత్వం నెలకొని ఉంటాయి. ఏ మాత్రం అనుభవం లేని రంగం కాబట్టే- వారిలో ఎన్నో అపోహలు, సందేహాలు. భగవంతుడు లేడని అనుకుందామా అంటే, దానికీ మనసు ఒప్పదు! ఒకవేళ ఆయనంటూ ఉంటే- ఇంతవరకు ఆయన కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయని జీవితం వారిది. ఎటూ తేల్చుకోలేనంతటి సందిగ్ధ, సందేహ అవస్థలు వారివి.

మనిషి ఎప్పుడూ క్రియాశీలుడు, కర్మయోగి కావాలి. మనసు స్థిరంగా ఉండాలి. దేవుడు ఉన్నాడన్న నమ్మకం నూరు శాతం కలిగి ఉంటే, చలించని మానసంతో నిలుస్తాడు మానవుడు. అదే మానవజన్మ పరమార్థం, అతడు నెరవేర్చాల్సిన కర్తవ్యం. ఉత్కృష్ట జీవితం అంటే అదే! భగవత్‌ స్పృహ సర్వకాలాల్లోనూ శ్రేయస్కరం. తాను పొందింది ఏమిటో మనిషికి తెలియకున్నా- ఏదో కోల్పోయిన వెలితి, బాధ అతడికి ఉండవు.

దేవుడు ఉన్నాడు... ఉన్నాడా, లేడు... లేడా? ఈ డోలాయమాన స్థితి మనిషికి స్థిరత్వమివ్వదు. దేవుడు లేడు అనే కంటే, ‘ఉంటే ఏం చేయాలి, ఆ కృప ఎలా పొందాలి, అది నాకు సాధ్యమేనా’ అనుకొని ఎంతో నమ్మినవారు ఎందరో ఉన్నారు. సాధనలో వారు ముందున్నారు.

ఇవన్నీ కాదు. పుట్టిన ప్రతి జీవీ గిట్టడం ఎంత సత్యమో- అతడితో పాటు అతడి లోపల, బయట భగవంతుడు ఉన్నాడన్నదీ అంతే సత్యం. వేల సంవత్సరాలు చీకటి నిండిన గదిలోనూ, చిరుదీపం వల్ల అంతటా వెలుగు నిండుతుంది. అలాగే మానవుడు దేవుడి పట్ల కలిగించుకునే, వెలిగించుకునే చిన్నపాటి నమ్మకమే అతడి జీవితంలోని గాఢాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. వెలుగు లక్షణం, లక్ష్యం- చీకటిని పారదోలడం. మనిషి జీవితంలో నమ్మకాన్ని వెలిగించుకుంటే చాలు. భక్తి, సాధన, గమనం, గమ్యం... ఆయనే చూసుకుంటాడు. భగవంతుడు ఉన్నాడని నమ్మడమంత భద్రమైన జీవితం మరెక్కడా లేదు.

నిన్నే నమ్ముకున్నానని ఆయనకు హామీ ఇవ్వనక్కర్లేదు. ఒట్టుపెట్టి మరీ చెప్పనక్కర్లేదు. ఆ భావం మనసులో ఉదయిస్తే చాలు. పువ్వును అనుసరించే పరిమళంలా, భగవంతుడి అనుగ్రహ ప్రకాశం భక్తుడి నమ్మకాన్ని వెన్నంటి వస్తుంది. అదే ఆహ్లాదకరమైన భావం.

కామెంట్‌లు లేవు: