*శ్రీ లలితా నామ వైభవం-12*
మనోరూపేక్షుకోదండా_పంచతన్మాత్రసాయకా’
అమ్మవారు కుడి చేతిలోపైన చెఱుకువిల్లు పట్టుకుంటుంది. మనసే చెఱుకువిల్లు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. ఒక సుషుప్తిలో తప్ప ఎప్పుడూ నిద్రాణముగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే శంకరభగవత్పాదులు మనసును కోతితో పోలుస్తారు.
సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశా శాఖస్వటతి ఝటిత స్యైర మభిత:
కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం
ధృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో||
మనసు మోహాటవిలో తిరుగుతూ ఎప్పుడూ తనకు లేని దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. శరీరముతో అనుభవించలేని దానిని మనసుతో అనుభవించే ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ఈశ్వరుని పట్టుకుంటే అన్నిసార్లు పుణ్యం. ఎన్నిసార్లు అక్కరలేనివి పట్టుకున్నదో అన్నిసార్లు పాపము ఖాతాలో పడుతుంది. ఒక్కనాటికి పట్టుకునే ప్రయత్నము చెయ్యదు. మనసు మాట వింటుంటే అది ఎప్పుడూ మంచిమాట చెప్పదు. మంచిబుద్ధితో అలవాటు చేసి అమ్మవారి చేతిలో చెఱుకువిల్లు చూస్తే మారుతుంది. మనసుకి లొంగడము అంటే మన్మధుని చెఱుకువిల్లుకి లొంగడమే. అందులోనుంచి ఎప్పుడూ కామబాణములు పడుతూ ఉంటాయి. అదే చెఱుకువిల్లు అమ్మవారు పుచ్చుకుంటే పరిస్థితి మారుతుంది. కామబాణములకు బదులు ఈశ్వరుని వైపు తిప్పే బాణములు పడి మనసు మారడము క్రియాశక్తి. అమ్మవారి ఎర్రటికాంతి మీద పడడము వలన వచ్చింది. అది పడి ఈ నాలుగు కదిలితే చేతులు, ఆయుధములు కనపడితే తప్ప వ్యక్తిలో మార్పు రాదు.
అమ్మవారు కుడివైపు పై చేతిలో అరవిందము, అశోకము, చూతము, నవమల్లికము, నీలోత్పలము అన్న ఐదు పుష్పబాణములు పట్టుకున్నది. ఈ ఐదుపువ్వులు శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములనే తన్మాత్రలు. వీటికి లొంగి సుఖములు అనుభవిస్తుంటారు. అమ్మవారు పట్టుకున్నవి పువ్వులే. పువ్వు స్పర్శ చాలా కోమలముగా ఉంటుంది, దానిలో తేనె ఉన్నది, మంచి రూపము ఉన్నది, మంచి వాసన ఉన్నది. పువ్వులో ఉన్న తేనె కోసము ఝుంకారము చేస్తూ తుమ్మెద వస్తుంది. నిశ్శబ్దముగా తేనె త్రాగుతుంది. పువ్వుకొరకు దాని శబ్దం కనక అది పువ్వుకే చెందుతుంది. అమ్మవారికి నమస్కరించని వారు తన్మాత్రలతో పశువులా తిరగడము జరుగుతుంది. అమ్మవారికి నమస్కరించిన వారు తన్మాత్రల లౌల్యమునుండి బయటికి రావడము జరుగుతుంది. ఒక్కక్క తన్మాత్రకు ఒక్కక్క జాతి నశించిపోతున్నది. శబ్ద తన్మాత్రకు జింకల జాతి, స్పర్శ తన్మాత్ర కి ఏనుగుల జాతి, రస తన్మాత్ర కి చేపలజాతి, రూప తన్మాత్ర కి మిడతల జాతి, గంధ తన్మాత్రకు తుమ్మెదల జాతి నశించిపోతున్నాయి. శబ్ద లౌల్యం, రస లౌల్యం, రూప లౌల్యం, స్పర్శ లౌల్యం, గంధ లౌల్యం అన్నిటికీ లౌల్యమే! అమ్మవారి చేతిలో ఉన్న ఐదు పుష్పబాణములను చూస్తే తన్మాత్రలు పోవు. అనుభవించడములో మార్పువస్తుంది. ‘పంచతన్మాత్రసాయకా’ - అమ్మవారి అనుగ్రహము కలిగి ఈ ఐదు తన్మాత్రలతో జీవితము పండించుకోవడము జరుగుతుంది. జీవితములో ఈ మార్పులు రావడమే ప్రధానము.
*శ్రీ మాత్రే నమః*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి