9, జనవరి 2021, శనివారం

భగవత్ తత్త్వం

 భగవత్ తత్త్వం ఏమిటో తెలుసుకుంటే ఫలితం ఎంతగానో ఉంటుంది (4వ మంత్రం)                  [ఉపనిషత్తులు]                                


భగవత్ తత్త్వం చాలా విచిత్రమైనది, ఎంత తెలుసుకున్నా ఎంతో కొత్తగానే ఉంటుంది. "ఆశ్చర్యవద్ పశ్యతి కశ్చిదేనం" అంటాడు గీతలో స్వామి. అత్మని గురించిగానీ పరమాత్మని గురించి ఎంతెంత తెలుసుకున్నా ఆశ్చర్యకరమైనవే ఉంటాయి. భగవంతుని ఈశితృత్వాన్ని, నియమించే సామర్థ్యాన్ని తెలుసున్న వ్యక్తికి ఫలితం ఎంతగానో ఉంటుంది. తెలుసుకోవడం ఏమిటో, ఫలితం ఏమిటో, దానికి ఏర్పడ్డ ఆటంకం ఎట్లా తొలగించాలో తెలిపింది ఈశావాస్య ఉపనిషద్. ఈ ఆత్మ తత్వం గురించి తెలిస్తే తప్ప మనం గుర్తించలేం. అందుకు అది మనకు చేసే ఉపకారమేమిటో తెలియాలి. పరమాత్మతో కలిసి ఉంటే కలిగే ఆనందం తెలియదు కనుక అది చెప్పింది మంత్రం. పరమాత్మ యొక్క విచిత్రమైన ప్రవృత్తిని అందంగా చెబుతుంది ఈ ఉపనిషద్.


అనేజదేకం మనసో జవీయో నైనధేవా ఆప్నువన్ పూర్వమర్షత్ |

తద్ధావతో అన్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నాపో మాతరిశ్వా దధాతి       ||   (4)


"పూర్వమర్షత్" మనం పుట్టక ముందు ఈ గాలి ఎట్లా అయితే వ్యాపించి అంతటా ఉందో పరమాత్మ తత్త్వం ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటినుండో అట్లానే వ్యాపించి ఉంది. మనకే కాదు మనకంటే ముందే ఉన్న దేవతలకే తెలియదు, "నైనధేవా ఆప్నువన్" చతుర్ముఖాదులు, ఇంద్రాది దేవతలకీ తెలియదు. చతుర్ముఖ బ్రహ్మ మన కంటే ముందు పుట్టాడు,  మన కంటే ఎక్కువ కాలం ఉంటాడు, మన కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటాడు,  మన కంటే ముందే వేదాన్ని మొదట పొందాడు కానీ ఆయనకి కూడా ఈ తత్త్వాన్ని చెప్పలేక పోతాడు. "ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీ అంతరిక్షమతోస్వాహాః" ఈ చూసే విశ్వం ఆకాశం ఇవన్నీ నేను పుట్టించడం లేదు, దాన్ని ఎలా వాడాలో తెలుసుకొని చేస్తున్నాను అన్నాడు ఆయన.



ఏలా ఉంటుంది ఈ తత్త్వం ? "అనేజద్" ఎప్పటికీ చెదరదు. పరమాత్మ అనేవాడు అనంతవిశ్వంలో లేని చోటు లేదు కనుక కంపించడం అనేది లేనే లేదు. ఒక డబ్బాలో ఒక రాయి వేడి కదిలిస్తే ఆ రాయి కంపిస్తుంది. ఎందుకంటే కొంత ఖాలీ ఉంది కనుక, అదే రాయి ఆ డబ్బా ఉన్నంతే ఉంటే అది గబ్బాని కదిపినా ఆ లోన రాయి కంపించదు. అట్లా అనంత విశ్వంలో పరమాత్మ లేని చోటు అంటూ లేదు, కనుక ఆయన "అనేజద్".



"ఏకం" ఆయన ఎప్పుడూ ఒక్కడే. ప్రపంచాన్ని శాసించే పరమాత్మలెంతమంది ? "క్షరం ప్రధానం అమృతాక్షరం హరః క్షరాత్రాణావీషతే దేవ ఏకః" అని చెప్పింది స్వేతాస్వేతరం అనే ఉపనిషత్తు. ప్రకృతి అంతా క్షరం, ప్రకృతి మార్పు చెందేది. అమృతాక్షరం హరః - అమృతం అంటే నశించనిది, నశించని జీవుడికి హరుడని పేరు. ప్రకృతిని తన కర్మ కోసం హరింపజేసుకొను వాడు.  ఈ క్షరమును ఈ అమృతమును రెంటినీ ఈశతే దేవ ఏకః - శాసించు దివ్యమైన పరమాత్మ ఒక్కడే. బృహదాయణ్యక ఉపనిషద్ చెబుతుంది "దివ్యః దేవః ఏకః నారాయణః" ఈ జగత్తులో ఒక్కో వస్తువులో ఉన్న వాడే నీలోనూ ఉన్నాడు, ఈ పరమాత్మ "దివ్యః దేవః" అంతటా సాకల్యముగా ప్రకాశిస్తూనే ఉంటాడు, ఎందరు అట్లాంటి వారు అంటే "ఏకః" తనవంటి సాటియైన తత్త్వం మరొకడు లేని వాడు ఆయన, ఒక్కడే.  ఏమని పిలవవచ్చు ? "నారాయణః" నారాయణుడు.


ఎలా ఉంటాడు ఆయన ? మనసో జవీయః. అంటే మనస్సుకంటే వేగంగా ఉంటాడు. లోకంలో చెబుతుంటారు కదా గాలికంటే వేగంగా మనస్సు అని. మనం ఇక్కడ ఉండగా మనం తలిస్తే ఎక్కడికో వెళ్ళి పోగలం. కానీ పరమాత్మ వేగం ఈ మనస్సు వేగం కంటే ఎక్కువ. మనం  అంటే ఒక్క కూర్చొని ఊహించాలి మనస్సుతో, కానీ ఆయనకి ఆ పని కూడా లేదు ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు కనుక.  ఎంత ఆశ్చర్యం కదూ. మనసో జవీయః. గజేంద్రుడి కథ ఉంది, అందులో ఆయన మనస్సులో కలడు కలడు అన్న వాడు కలడో లేడో అనుకున్నాడట, అందుకే సరే అని పరమాత్మ ఏం చేయలేదట. ఇక నీవేతప్ప మొరొకడు లేడు అన్నప్పుడు పరమాతమ వెంటనే వచ్చాడట. వచ్చిన వేగాన్ని అద్భుతంగా వర్ణిస్తారు కవులు. భక్తుల కోసం ఆయన ఎంత వేగంగా వస్తాడో తెలుపటాని అట్లా వర్ణిస్తారు. అందుకే భట్టర్లవారు హే భగవన్ నేను నీకు నమస్కారం పెట్టను, నీభక్తులని రక్షించాలని నీకున్న ఆర్తికి నమస్కారం అన్నాడు. ఆయన పేరు అర్తత్రాణపరాయణః. భక్తులను రక్షించడానికి ఆయన ఆర్తి చెందుతాడట. ఆయనగబగబా వచ్చి రక్షించినట్లు అద్భుతమైన వర్ణన ఆయన త్వరని చెప్పడానికే తప్ప ఆయన ఎక్కడినుండో రావాల్సిన అవసం లేదు వేదవ్యాసుడి భాగవతంలో ఆయన . పిలవగానే   వచ్చి ముసలి నోటి నుండొ గజేంద్రుని కాలిని విడిపించాడని ఉంది. ఆయన అక్కడినుండే వచ్చాడు, కారణం ఆయన మనసోజవీయ. వేదవ్యాసుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అని చూపించాడు, కవులు ఆయన త్వరని చూపించారు. ఈ రెండూ భగవంతుని గుణాలే. ఎందుకు ? "తద్ధావతో అన్యానత్యేతి తిష్ఠత్" లోకంలో పరుగు పరుగులో వెళ్ళ గలం అనుకునే ఏవరినా పరమాత్మను పట్టుకుందాం అన్నా చిక్కనంత వేగం ఆయనది, ఎందుకంటే ఈ వేగాన్ని అతిక్రమించినవాడు, ఆయన అంతటా ఉన్నవాడు.


అంతటా ఎలా ఉన్నాడు ? "తస్మిన్నాపో మాతరిశ్వా దధాతి". ఆకాశంలో గాలి, తేమ అవన్నీ నిరాధారంగా కనిపిస్తాయి. మేఘాలు ఎలా నిలిచాయి ఆకాశంలో ? గాలి వ్యాపించగలదు కానీ కొంత మేర దాటి చూస్తే గాలి ఉండదు. గాలి సంచారాన్ని ఎవడైనా చేయిపెట్టి ఆపాడా ? ఇది వాతావరణం పై మాట. ఇక వాతావరణంలో చూస్తే ఈ గాలి సంచారాన్ని ఎవరు చేయిస్తున్నారు ? వీటిని అట్లా నిలబెట్టిన వాడు పరమాత్మ. ఏదైనా ఒక కార్యం నడుస్తుంది అంటే దాన్ని నిలబెట్టే వాడు పరమాత్మ. వీటన్నింటిని నియమించేవాడు వెనకాతల ఒకడున్నాడని మరచిపోకు. తస్మిన్ నాపో - అన్నింటిని నియంత్రించే పరమాత్మ చేతనే మాతరిశ్వా దధాతి - అన్నీ ధరించబడుతున్నాయి కనుక. వాడి సంకల్పంచే అన్నీ అట్లా నిలబడగలుగుతున్నాయి. అట్లా గాలి, నీరు అన్నీ వాడిచే నిలబడి ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: