*ప్రార్ధన..పరిష్కారం..*
ఆదివారం నాడు మధ్యాహ్నం అన్నదానానికి ముందుగా..అంటే..మధ్యాహ్నం 12.30 గంటలకు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో అర్చక స్వాములు స్వామివారికి నైవేద్యం పెట్టి హారతులిస్తారు..అప్పటిదాకా వేచివున్న భక్తులందరూ ఆ హారతి కళ్లకద్దుకొని..అన్నదానం సత్రం వద్దకు వెళ్లి భోజనం చేస్తారు..సహజంగా మధ్యాహ్న భోజనం తరువాత శ్రీ స్వామివారి మందిరం దాదాపుగా ఖాళీ అయిపోతుంది..భక్తులు తమ తమ ఊళ్లకు ప్రయాణమై వెళ్ళిపోతారు..చాలా కొద్దిమంది మాత్రమే సాయంత్రం వరకూ వుంటారు..మధ్యాహ్నం హారతి, అన్నదానం తరువాత..దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా చాలా తక్కువ సంఖ్య లోనే వుంటారు..సాయంత్రం నుంచీ నేనూ మా సిబ్బందీ మందిరం తాలూకు లెక్కలు చూసుకుంటూ ఉంటాము..
ఆరోజు ఆదివారం..సాయంత్రం నాలుగు గంటల సమయం లో బస్సు దిగి దంపతులిద్దరు మందిరం లోకి వచ్చారు..ఒకరకంగా వయసు పైబడిన వాళ్లే..మెల్లిగా మేము కూర్చున్న చోటుకి వచ్చి.."మేము దూరప్రాంతం నుంచి వస్తున్నాము..ఈరాత్రికి ఇక్కడ బస చేయాలని అనుకుంటున్నాము..మేము ఉండటానికి ఏదైనా వసతి ఉన్నదా..?" అని అడిగారు..ఆ సమయానికి అన్ని గదులూ ఖాళీ గానే ఉంటాయి కనుక.."మీకొక గది ఇస్తాము..మీ వివరాలు చెప్పండి..నమోదు చేసుకోవాలి.." అని మా సిబ్బంది చెప్పారు.."నా పేరు సత్యనారాయణ మూర్తి..ఈవిడ నా భార్య వనజ..మాది విశాఖపట్నం..మొన్న గురువారం నాడు గొలగమూడి వచ్చి వెంకయ్య స్వామివారి మందిరం వద్ద ఉన్నాము..నిన్న ఉదయం మాలకొండ వచ్చాము..అక్కడినుంచి భైరవకోన వెళ్లి ఈరోజు ఉదయం మిట్టపాలెం నారాయణ స్వామి మందిరం చూసి..ఇప్పటికి ఇక్కడికి చేరాము..ఈరాత్రికి ఇక్కడ నిద్ర చేసి..రేప్పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని..తిరిగి వెళ్లిపోతాము.." అన్నారు..వాళ్ళకొక గది కేటాయించి.."రాత్రికి కూడా ఇక్కడ మందిరం లో భోజన వసతి ఉన్నది.." అని చెప్పారు..సరే అన్నట్లు తలాడించి తమ గదికి వెళ్లిపోయారు..
ప్రక్కరోజు సోమవారం ఉదయం ఆరుగంటల కల్లా ఆ దంపతులు, శుభ్రంగా తయారయ్యి, శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చేసారు..అర్చకస్వాములు హారతులు ఇచ్చేదాకా వేచి వున్నారు..ఆ తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహానికి అర్చన చేయించుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు..కొద్దిసేపు అక్కడే మంటపం లో కూర్చున్నారు.."ఇక్కడ నిర్వహణ చేసేది మీరేనా.."? అని నన్నడిగారు సత్యనారాయణ మూర్తి గారు..అవును అన్నాను..మెల్లిగా లేచి ఇద్దరూ నా దగ్గరకు వచ్చారు..ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.."మేము మరో రెండురోజులు ఇక్కడ ఉంటాము..మీకేమీ అభ్యంతరం లేదుకదా..? మేమున్న గది కి బాడుగ ఇస్తాము..కొంచెం ప్రశాంతంగా ఉన్నది..ధ్యానం చేసుకోవచ్చు..అందుకని అడిగాను.." అన్నారు.."వుండండి..ఇబ్బందేమీ లేదు.." అన్నాను.."సంతోషమండీ.." అన్నారాయన..
మూడురోజులున్నారు..ఉదయం సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుంటూ..వీలున్నప్పుడల్లా అర్చక స్వాముల అనుమతితో స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకుంటూ..తమకు ఓపిక ఉన్నంతవరకూ ప్రదక్షిణాలు చేస్తూ కాలం గడిపారు..గురువారం ఉదయం నేను స్వామివారి మందిరం లోకి వచ్చేసరికి..నాకొసమే ఎదురు చూస్తున్నట్లుగా..నేను కూర్చునే స్థలం వద్ద నిలబడి వున్నారు..వాళ్ళను కూర్చోమని చెప్పాను..నేను కూర్చోగానే..నా దగ్గరగా జరిగి.."బాబూ ప్రసాద్..మీతో ఒక విషయం చెప్పాలి..ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాము..మా అబ్బాయి కి వివాహం జరిగి మూడేళ్లు అయింది..అమ్మాయి కూడా లక్షణమైన పిల్ల..రెండేళ్లు కాపురం చేసిన తరువాత..వీళ్ళ మధ్య అభిప్రాయభేదాలొచ్చాయి..విడిపోయేదాకా వచ్చింది పరిస్థితి..అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది..రోజూ వాళ్ళు పడే గొడవలు చూడలేక మేము తల్లడిల్లిపోయాము..
ఎలాగైనా వాడి కాపురం బాగుపడేటట్లు చూడమని అందరు దేవుళ్ళనూ మొక్కుకున్నాము..ఇంట్లో వాడి బాధ చూడలేక మేము ఇలా క్షేత్రాలు తిరుగుతున్నాము..ఎందుకనో ఇక్కడికి వచ్చిన తరువాత కొద్దిగా ప్రశాంతత వచ్చింది..స్వామివారి వద్ద మా ప్రార్ధన ఫలించిందేమో తెలీదు కానీ..మా వియ్యంకుడు రాత్రి ఫోన్ చేసాడు..మమ్మల్ని వచ్చేయమన్నాడు..మాట్లాడుకుందాము అన్నాడు..కోడలూ మాట్లాడింది..మళ్లీ అరగంటకు మా అబ్బాయి కూడ ఫోన్ చేసాడు..మమ్మల్ని వెంటనే వచ్చేయమన్నాడు..మంచిరోజులు వచ్చాయని అనిపించింది..వాడి కాపురం బాగుపడి..వాళ్లిద్దరూ లక్షణంగా ఉంటే..మళ్లీ ఇక్కడికి వస్తాము.." అన్నారు.."వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి స్వామివారి సమాధి వద్ద మొక్కుకొని వెళ్ళండి.." అన్నాను..సరే అన్నారు..ఆరోజే వెళ్లిపోయారు..
సుమారు సంవత్సరం తరువాత ఆ సత్యనారాయణ మూర్తి గారు రెండు వారాల క్రితం భార్యతో కలసి వచ్చారు..వాళ్ళిద్దరి ముఖం లో ఆనందం ఉంది.."తమ కుమారుడి సంసారం చక్కబడిందనీ..ఇప్పుడు కోడలు గర్భవతిగా ఉన్నదనీ..ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారని చెప్పి.."అంతా స్వామివారి దయ..మా మొర విన్నారు.." అని స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నారు..కోడలు కాన్పు అయిన తరువాత..అందరమూ కలిసి వచ్చి..ఇక్కడ అన్నదానం చేస్తామని చెప్పారు..
సమాధి లో కూర్చుని ఉన్న ఆ స్వామివారు ఆ దంపతుల ప్రార్ధన చక్కగా విని, పరిష్కారం చూపారని మేము అనుకోవడం లో ఆశ్చర్యం లేదు కదా..!!
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి