9, జనవరి 2021, శనివారం

గురు మర్యాద

 🌹గురు మర్యాద !🌹


        దేవతలలో త్వష్ట అనే వాడు తన తపోశక్తితో మూడతలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవి కోరి ఘోరతస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లొంగక పోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విషయం ఒక సంవత్సరం పాటు రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆవిషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు, అతడు బ్రహ్మహత్యా పాతకం చేసాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచి పెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేసాడు.


        ఇది తెలిసిన త్వష్ట కోపించి, ఇంద్రుడిని చంపడానికి వృత్తాసురుడిని సృష్టించాడు. అధిక బల సంపన్నుడైన వృత్తాసురుడి ధాటికి తట్టుకోలేక దేవతలు శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్ళి వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్ధించారు. 


        “మీరు వెళ్ళి ఇంద్రుడికి వృత్తుడికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంత మయ్యేలా చేస్తాను " అన్నాడు. 


        ఋషులంతా వృత్తాసురుడి వద్దకు వెళ్ళి


         "ఇంద్రుడు అజేయుడు నీవా అధిక బలశాలివి మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు కనుక ఇంద్రుడితో మైత్రి చేసుకో " అని నచ్చచెప్పారు. 


        దానికి వృత్తాసురుడు అందుకు అంగీకరిస్తూ...


        "బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి. నేను తడిసిన దానితో కాని ఎండిన దానితో కాని రాత్రి కాని పగలు కాని సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే ఇంద్రుడితో సంధి చేసుకుంటా" అన్నాడు. 


        ఆ మేరకు ఒప్పందం కుదిరింది.


        కానీ ఇంద్రుడు మాత్రం అతడిని సంహరించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు అసుర సంధ్యలో సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తాసురుడిని చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్ధించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సాయంతో వృత్తుని సంహరించాడు


        దేవేంద్రుడికి వృత్తాసుర సంహారం చేయడం వలన మరల బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంది. ఒక సారి ఆ బ్రహ్మహత్యా పాతకమును ఇతరులకు పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యా పాతకం మాత్రం పరమ వృద్దుడయిన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో, ఒళ్ళంతా క్షయ వ్యాధి, కుష్ఠు వ్యాధి చేత పుండ్లు పడిపోయి, ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఇంద్రుని కౌగలించుకోవడానికని వెంటపడింది. 


        అది బ్రహ్మహత్యాపాతక స్వరూపం. అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగు పెడుతూ అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటువైపుకు వెళ్ళినా విడిచి పెట్టలేదు. అప్పుడు ఇంక దారిలేక ఇంద్రుడు ఈశాన్య దిక్కుపట్టి పరుగెత్తి మానస సరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. 


        అక్కడికి బ్రహ్మహత్యా పాతకం కూడా తరిమి రాలేక పోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి అందులో ఉన్న ఒక తామరపువ్వు గుండా తామర నాళం లోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరిపోయాడు. 


        అలా ఇంద్రుడక్కడ వేయి సంవత్సరాలు ఉన్నాడు. ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా పట్టుకోనక పోతానా అని నిరీక్షిస్తూనే ఉంది. అలా ఇంద్రుడు నారాయణ కవచమును శ్రీమన్నారాయణుని తపమును ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు. ఈశ్వరారాధనం చేస్తూ కూర్చున్నాడు. 


        ఈ వెయ్యి సంవత్సరాలు గడిచేలోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఇంద్రపదవి ఖాళీగా ఉండటం వల్ల ఆ పదవిలోకి తాత్కాలికముగా అనేక యాగాలు చేసిన నహుషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. 


        ఇంద్ర పదవిలో కూర్చోగానే ఆయనకో వెర్రి ఆలోచన పుట్టింది. అదేమిటంటే.....


         ‘ఇంద్రపదవి ఒకటీ ఇచ్చి వదిలిపెడితే ఎలా ?! శచీదేవి కూడా నాది కావాలి కదా !’ అనుకుని-


        “ప్రస్తుతం నేనే ఇంద్రుడిని కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నీవు నా భార్యగా ఉండు" అని శచీదేవికి వర్తమానం పంపాడు. 


        అది వినగానే శచీదేవికి చిర్రెత్తుకొచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మవారికి నమస్కరించింది. లలితా సహస్రంలో అమ్మవారికి "పులోమజార్చిత" అని పేరు ఉంది. పులోముడు శచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన శచీదేవి చేత నిరంతరం లలితా పరాభట్టారిక అర్చింప బడుతూ ఉంటుంది. భార్య చేసే పూజల వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. 


        అందుకని శచీదేవి పూజల వలన ఇంద్రుడు ఇంద్రపదవిలో ఉన్నాడు. భర్త చేసిన దోషంతో భార్యకు సంబంధం లేదు కాబట్టి బృహస్పతి ఈమెకు దర్శనం ఇచ్చి 


        "అమ్మా! దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో అలాగే వీడితోటి ఒక అపచారం చేయించు. కాబట్టి నహుషుడిని సప్తర్షులు మోస్తున్న పల్లకిలో రా ! నీవు నాకు భర్తవు అవుదువు గాని అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి అయ్యో, ఈ పని చేయ్యొచ్చునా లేదా అని ఉండదు. సప్తర్షులను పిలిచి మోయమని పల్లకి ఎక్కుతాడు” అని చెప్పాడు. 


        బృహస్పతి చెప్పిన విధంగానే నహుషుడుకి కబురు పంపింది. అతడు సప్తర్షులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి ఉన్నారు.


        ఆయన మహాశక్తి సంపన్నుడు. కొంచెం పొట్టిగా ఉంటాడు. అందువల్ల ఆయన అడుగులు గబగబా వేయడం లేదు. నహుషుడు లోపలినుంచి చూశాడు. తొందరగా శచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో...


         “సర్ప సర్ప (నడు నడు)” అని ఆయనను హుంకరించి డొక్కలో తోశాడు. అగస్త్యుడికి కోపం వచ్చింది. నహుషుడి వంక చూసి...


        “చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు వేయలేక పోతున్న వాడిని అయిన నన్ను "సర్ప సర్ప" అన్నావు కాబట్టి నీవు సర్పమై కొండచిలువవై భూలోకంలో పడిపో" అని శపించాడు.


        వెంటనే నహుషుడు కొండచిలువయి క్రిందపడ్డాడు. ఇపుడు మళ్లీ ఇంద్రపదవి ఖాళీ అయింది. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరకు వెళ్ళారు. వెయ్యి సంవత్సరాలు తపించిన ఇంద్రుడి శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. 


        పూర్తి నివారణ కాలేదు. అప్పుడు ఇంద్రుడిని తీసుకు వచ్చి అశ్వమేధ యాగం చేయించారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాపపరిహారం చేశాడు. ఏది చేసినా భగవానుడే చేయాలి. అందుచేత ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహమునకు పాత్రుడయ్యాడు. 


        బ్రహ్మహత్యా పాతకం నివారణయ్యి మరల వచ్చి ఇంద్రపదవిలో కూర్చుని సంతోషముగా గురువును సేవిస్తూ కాలమును గడిపాడు. 


        ఇంద్రపదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టములు పడ్డాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణమును కలిగి ఉండాలి అనేది దీని ద్వారా తేటతెల్లమవుతోంది.


                                  🌺🌼🌺

కామెంట్‌లు లేవు: