🌹శ్రీమద్రామాయణావతరణము 🌹
బ్రహ్మ దేవు డంత పరికించి మౌనిని
యమిత కరుణ తోడ నభయ మిచ్చె
కలవరమున నుండ గమనించి యతనితో
పరమ కరుణ తోడ పలికె నిట్లు 27
వాల్మీకి కవివరా ! వగపేల నీకింత
సమ్మత మోందుము స్వాoతమందు
క్రౌoచపులుగు చావు కలత కల్గించగా
పల్కినాడవు నీవు బాధ యందు
శోకంబు కతనను శ్లోకమ్ము వెలువడె
నప్రయత్నంబుగా నాస్య మందు
నీ నోట నా మాట నే పలికించితి
భావి కావ్యంబుకై పరమమౌని !
నీవు నుడివిన శ్లోకమే నిక్కముగను
ఆదికావ్యంబునకు నది యాద్య మగును
నవ్యరచనతో రామాయణమును నీవు
నిర్మితముసేయ తరియించు నీదుజన్మ 28
శ్రీకరుoడైనట్టి శ్రీరామచంద్రుండు
ధర్మాత్ము డత్యంత ధార్మికుండు
సర్వసద్గుణపూర్ణ సత్వాభిరాముండు
ధీమతి ధీరుండు దివిజనుతుడు
శ్రీరాముగాథకు శ్రీకారమున్ జుట్టి
నారదుండుడివిన నయము గాను
కావ్యంబు రచియించు కడురమ్య మొప్పగా
మునివరావాల్మీకి ! మొనసి యిపుడు
పదము లందు గాని పాదంబు లను గాని
సకల యంశ ములును సత్య మగును
ఎట్టి దోష పదము లేర్పడ విచటను
సాధు సమ్మ తముగ సాగు కవిత 29
శ్రీ రాము చరితమ్ము సీతమ్మ గాథయు
భరతాది లక్ష్మణ భవ్య కథలు
దశముఖు డాదిగా దైత్యుల గాథలు
నుర్వి శ్రేష్టంబు లై నొప్పుచుండె
అవి రహస్యంబులై యలరారు చుండెను
బయలు పరచు వాని భవ్యముగను
తీరుగా సురమౌని తెల్పని విషయముల్
స్ఫురణ కొచ్చు నునీకు స్థూల ముగను
రమ్య మైన యట్టి రఘు రాము చరితంబు
సర్వ పాప ములను సమయ జేయు
శ్రవణ మాత్ర ముననె సమకూరు తోషంబు
భక్తి ముక్తి గలుగు ప్రజల కెల్ల 30
గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి