30, జూన్ 2023, శుక్రవారం

నేరేడుపండు - మాంసాహారం

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - II 


నేరేడుపండు - మాంసాహారం - అంతరార్థం    


    ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. 

    సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా  తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. 

    దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. 


శాకాహారులూ మాంసాహారులేనా? 


    మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. 

    కానీ, సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని  అర్థం. 

    వరిధాన్యంవంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! 

    మొక్క మనకి ఆహారమిస్తూ,అది ప్రాణాన్ని కోల్పోతుంది. అదియే మాంసాహారము. 

    ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! 


హింస - ప్రాయిశ్చిత్తము 


     మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. 

     మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. 

    అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస".  

     అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. 

    దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". 

    అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. 


    ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, 

    వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి,  

     వేదాలని కాపాడుకోవడం మన విధి. 

    

ప్రకృతిలో మార్పు - సహజ చికిత్స 


    దేహంనుండీ శ్వేదరూపంలో బయటకు వెళ్ళే నీరు, 

    ఆషాఢంలో ఎండతగ్గి,    

    మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. 

    వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

    అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. 


గమనించవలసిన విషయాలు 


1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ, 

2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత  గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. 


ఆచరణ 


    కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటించి,  ఆరోగ్యాన్ని పొందుతూ, 

    తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, 

     శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని కాపాడుకొందాం. తరువాత తరాలకి అందిద్దాం.  


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: