"పుష్పగిరి"
➖➖➖
చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్టాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్య క్షేత్రాలు దర్శించుకువద్దామనీ, పుణ్య నదులన్నిటి లోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా వుండేది. ఐతే, పుట్టుపేద కావటంచేత చేయిసాగక, కోరిక నెరవేరింది కాదు.
ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా, ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి, "నాయనా ! ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం గాని, పుణ్యనదులలో స్నానం చేయటంగాని పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి, నీకైనా సావకాశం చిక్కినట్టయితే, నా అస్తికలను వీలైనన్ని పుణ్యనదులలో కలప వలిసింది. ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలప వలిసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది. నాకు ముక్తిమార్గం యేర్పడుతుంది” అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు.
చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు 'అప్పో సొప్పో చేసి ఐనా సరే, తండ్రి కోరిక నెరవేర్చి తీరాలె. కొడుకుననిపించుకుంటూ, ఈ మాత్రం పని చేయలేకపోతే, నాజన్మ యేం జన్మ !' అనే సంకల్పంతో బయల్దేరిపోయి, ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీ క్షేత్రం దర్శించుకుని తండ్రి అస్తికలు గంగా నదిలో కలపాలని, నిశ్చయించుకున్నాడు.
ఆ కాలంలో ఇప్పటిలాగా రైల్లా, విమానాలా, ఇట్టె వెళ్లి అట్టె రావటానికి ! కాలి నడకని పోవాలి. కీకారణ్యాలు దాటాలి. కష్టసుఖాలు ఒంటపట్టించుకోవాలి. ఇన్ని జరిగినా, బయల్దేరిన మనిషి మళ్లీ ఇల్లు చేరుకునేవరకూ నమ్మకం లేకపోయె ! అందుకనే - “కాశీకి వెళ్లినవాడూ కాటికి పోయినవాడూ తిరిగిరారు" అనే సామెత కూడా యేర్పడినట్టుంది.
చైనులు పాదచారి అయి బయల్దేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ, దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ, పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళుతున్నాడు. పోయి పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకినీ నది ప్రవహిస్తున్నది. ‘సరే, ఇందులో కూడా స్నానం చేసిపోదాం' అనుకుని, అస్తికలమూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు.
అతడు స్నానం చేసికొని, సంధ్య వార్చుకుని వచ్చి, మళ్లీ మూట బుజాన వేసుకు పోదామనుకొన్నాడు. తీరా చూడగా, ప్రవహించే పినాకినీ నది పొంగువచ్చి ఆ మూటంతా తడిసిపోయివున్నది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్లీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు.
ఆ మూట విప్పేసరికి, అస్తికలు మాయమై, , వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపువ్వులు కనుపండువుగా కనిపించినై! ఇవి చూచి చైనులు ఆశ్చర్యంతో చకితుడయాడు. ఆహా, పినాకిని జలం ఎంతటి మహిమ కలది ! కాశీలో వుండే గంగాజల మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను. కాని, పినాకిని మహిమ కళ్లారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరణోపాయం కలిగింది. ఆయన ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకొన్న వాడినయాను. ఇక నేను కాశీకి పోనక్కరలేదు. ఇక్కడనే ధన్యుడనయాను” అనుకుంటూ అపరిమితానందభరితుడై, తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకినీ ప్రవాహంలో కలిపి వేసి ఇంటిముఖం పట్టాడు.
ఏమి చిత్రమో కాని, చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా యేర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండటంచేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి, నీళ్లుపట్టుకునేవాళ్లు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి.
ఒకరోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లెట్టడానికని ఆ రేవుకి వచ్చాడు. బక్కచిక్కివున్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి ఇవతలకు వచ్చేసరికల్లా మిస మిసలాడుతూ బలంగానూ పడుచుగానూ కనపడినై. ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనాయనే సంతోషంతో తనుకూడా మడుగులో దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టు పైకి వచ్చేసరికల్లా తాతకు ముసిలిరూపం పోయి, పడుచువాడయాడు.
సరీగా అదే సమయానికి ఆ ముసలి వాని భార్య నెత్తిని కూటికుండ పెట్టుకుని ఆ దారిన పొలానికి పోతూవుంది. అలా పోతూవున్న ఆమెను అతడు పలుకరించే సరికి, ఎవడో తుంటరి తనతో సరాగాలాడుతున్నాడనుకొని, ఎదిరించి సమాధానం చెప్పసాగింది.
"నేను నీ భర్తను, ఫలాన ముసిలివాడనే,” అని ఎంత చెప్పినా ఆమె నమ్మక పోయేసరికి వాడు ఆమెను బరబర చెయ్యి పట్టుకు లాగి మడుగులో ముంచాడు. ఏముంది? పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి, యౌవనవతి ఐ కూర్చుంది. తీరా ముసిలివాడూ అతని భార్యా కలిసి ఇంటికి వెళ్లేటప్పటికి, వాళ్ల బిడ్డలు తలి దండ్రుల్ని ఆనవాలు పట్టలేకపోయారు. తరువాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జలమహిమ అందరకూ వెల్లడి ఐంది. అప్పటినించీ ఆ మడుగులో స్నానం చేసి, ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైంది.
కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి ఐనటువంటి నారదమహర్షి చెవుల బడింది. ఎవరికైనా మేలు జరుగుతూ వుంటే ఓర్వలేని నారదుడు, ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూవుంటే చూచి సహించగలడా? ఉహుం. కనుక, ఈ మడుగుకి ఏవిధంగా కట్టడి చేయటమా!" అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేముని వద్దకు వెళ్లి సంగతి సందర్భాలు చెప్పాడు.
ఐతే, భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది?' అని దివ్య దృష్టితో చూచాడు బ్రహ్మ. పూర్వకాలమందు, తన తల్లి దాస్యవిముక్తికోసం దేవలోకంనించి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకు పోతూవుండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడి నట్టు గ్రహించాడు.
నారదుడు నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, “హనూ ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి" అన్నాడు.
చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు.
కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూవుంది.
ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. అతనికేమీ తోచక నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలోవుండే విష్ణుమూర్తి వద్దకుపోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినికిడి చేశారు.
విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, “నాకూ, శివునికి యెప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూవుంటై. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!" అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపి వేశాడు.
తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూవున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు.
అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకపోయింది.
ఆ బ్రాహ్మడి అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది- పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజ నేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి
'పుష్ప గిరి' అనే పేరు వచ్చిందంటారు.
శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై ఉన్నది.
ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతై. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు.
పుష్పగిరి కడపకు పది మైళ్ళ దూరం లోనే ఉన్నది. కాబట్టి ఈ సారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి రండి!✍️
(1951 ఏప్రిల్ నెల చందమామ కథ)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి