30, జూన్ 2023, శుక్రవారం

సన్యాసం అంటే ఏమిటి

 *సన్యాసం అంటే ఏమిటి?? - కొంచం వివరంగా తెలుసుకొందాము...!!!*


సన్యాసమంటే కాషాయం కాదు, ఇంటిని వదిలిపోవడం కాదు, వ్యక్తిత్వ విసర్జన...


_సన్యాసమంటే..._

ప్రపంచం నుంచీ, మరి దేని నుంచీ వెనక్కి తగ్గి, సర్వం వదిలి వేయడం కాదు, సమస్తాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకోవడం, ఆ ఆలింగనంలో సంసారము అన్నీ వుంటాయి...


_సన్యాసమంటే..._

అహంకార పరిత్యాగం. కోర్కెలనీ, నాది అనే భావాన్ని, దాని పట్ల అనురక్తిని త్యజించడం...


_సన్యాసమంటే.._ 

పరిశుద్ధ జ్ఞానం...

 

ఇల్లు, సంసారం వదిలి కాషాయం కట్టడం కన్నా, ప్రేమతో ప్రపంచాన్ని తనలోనికి తీసుకోవడం ఉత్తమ సాధకుని లక్షణం...

నిజమైన సాధకులు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరచి, సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హత్తుకుంటారు. 

ప్రేమ, సమదృష్టి అలవర్చుకున్నవారు పరిత్యజించాలి, సన్యసించించాలి అని అనుకోరు...


నిజమైన సంసారం మనస్సంసారం, దాన్ని వదలాలి గాని, ఇల్లునీ, ఇల్లాల్ని కాదు. 

కర్మ జీవనాన్ని పరిత్యజించవలసిన పనిలేదు, సర్వ కర్మలు ఆచరిస్తూ, నిష్కామంగా ఉంటూ, స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్న వారే నిజమైన సాధకులు...


విషయవస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. 

మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే, సత్కార్యాచరణుడై పంచేద్రియ నిగ్రహం గల వ్యక్తికి గృహజీవనమే తపోవనం...

కామెంట్‌లు లేవు: