30, జూన్ 2023, శుక్రవారం

దేవుడు ఉన్నాడు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా ?


మనిషికి దేవుడు ఉన్నాడా లేడా , ఒకవేళ ఉన్నా కూడా నా భక్తికి ప్రసన్నుడై దేవుడు సాక్షాత్కరిస్తాడా అనే సందేహం తరచుగా మదిని తొలుస్తూనే ఉంటుంది . మనలానే దేవునికి కూడా ఇన్ని జీవరాశులలో ప్రత్యేకంగా సృష్టించిన మానవులకు జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చాను కదా,ఏ మానవుడైన మనఃపూర్వకమైన భక్తితో , ఆర్తితో నన్ను చూడాలని పరితపించే భక్తుడు ఒక్కడైన ఉన్నాడా అని నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు .


దేవుని కరుణకు అవధులు లేవు . ఆయన కృపకు అందరూ పాత్రులే అయితే ఆ పాత్రత మనలో ఉండాలి అంతే . రాక్షసుడైన ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నరసింహ అవతరందాల్చి హిరణ్యకసపుని కడతేర్చిన వృతాంతం మనకు సుపరిచితమే . 


అయినా అవన్నీ ఎప్పుడో కృత యుగం లో జరిగిన సంగతి కదా అంటారా . శ్రీ రాముడు త్రేతా యుగం లోనూ , శ్రీ కృష్ణుడు  ద్వాపర యుగం లోనూ అవతరించారు ప్రస్తుత కలియుగంలో అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా ?  అటువంటి భక్తుని కోసం దేవదేవుడు అవతరించిన వృతాంతం ఏదైనా ఉందా ? ఒక ఆలయానికి యుగాల నాటి చరిత్ర తప్పకుండా ఉండాలా , కనీసం ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాలో , వందల సంవత్సరాల చరిత్ర అయినా ఉండాలా ? ఆ భక్తునికి భగవంతుడు సాక్షాత్కరించాడు అనడానికి ఆధారాలు ఏవైనా ఉన్నాయా ? ఆ భక్తుని స్వామి వారి అనుగ్రహం కలుగుతుండగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా , ముఖ్యంగా నాస్తికులు , హేతువాదులు , అన్యమతస్థులు ప్రత్యక్షంగా చూసి , వాటిని నమ్మి అంగీకరించిన సంఘటనలు ఉన్నాయా ? 


పైన చెప్పిన వాటికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది ఈ భక్తుని వృతాంతం . దీన్ని కధ అనడం లేదు ఎందుకంటే ఇది యదార్ధ గాధ కనుక . 


అది 1889 వ సంవత్సరం .  విశాఖ పట్టణము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులు ధార్మికంగా జీవనం సాగిస్తుండేవారు.వారికి దేవుని యందు భక్తి ప్రపత్తులు మెండు.ఆ పుణ్య దంపతులకు 1889 ఏప్రిల్ 4వ తేదీన దేవుని అనుగ్రహం వలన ఒక మగబిడ్డ జన్మించాడు.ఆ బాలునికి నరసింహం అని నామకరణం చేశారు తల్లిదండ్రులు . ఆ అబ్బాయికి కూడా తల్లిదండ్రుల లానే  చిన్నతనంనుంచే దైవ భక్తి చాలా ఎక్కువ.భగవన్నామస్మరణ , కీర్తనలు , భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే చాలా ఇష్టం . జీవనోపాధికి తన కుల వృత్తి స్వీకరించి ఆభరణాలు తాయారు చేయడంలో సిద్ధహస్తులయ్యారు . ఏ పని చేస్తున్నా అతని జిహ్వ భగవన్నామస్మరణ చేయడంలో ఉత్సహించేది అందులోనే సేద తీరేది . ఆయనకు పండరీపురం విఠలునిపై యెనలేని భక్తి ఉండేది .


తన 18వ ఏట బందరు జిల్లా చిలకలపూడి గ్రామానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు నరసింహం గారి తల్లిదండ్రులు . అప్పటికే ఆభరణాల తయారీలో ఆరితేరిన నరసింహం గారు బంగారు పూతతో తాయారు చేసే నకిలీ నగలు తాయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు . ఆయన కనిపెట్టిన విధానమే నేటికి ( రోల్డ్ గోల్డ్ , ఉమా గోల్డ్ , గిల్టు నగలు , 1 గ్రాము గోల్డ్ ) అమములో ఉంది . వాటికి ఆధ్యులు నరసింహం గారే . 


గురువు అనుగ్రహం : 


జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు కానీ గురువు అనుగ్రహం పొందటం అంత తేలిక కాదు . గురువంటే మన అజ్ఞానాన్ని తొలగించి , తగిన ఉపదేశమిచ్చి , నిత్యానిత్య వివేకమును కలిగించి , న్మార్గంలో ప్రవేశింపజేసి , గమ్యాన్ని తెలిపి , ఆ గమ్యాన్ని చేరుకోవడంలో పడే ప్రయాసల నుండి రక్షించి చివరి వరకు వెన్నంటి ఉండే భగవంతుని రూపమే. నరసింహం గారి జీవితంలో అటువంటి గురువు దర్శన భాగ్యం , అనుగ్రహం కలిగి ఆయన జీవిత గమ్యాన్ని నిర్దేశించిన సంఘటన పండరీపురంలో జరిగింది . నరసింహంగారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గూండా మహరాజ్ అనే గురువుగారి దర్శనమయింది. ఆయన నరసింహంగారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠ్ఠల మంత్రముతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తరువాత శ్రీ విఠ్ఠల మహామంత్ర రాజమునుకూడా ఉపదేశించారు.


నరసింహం గారు తరచుగా పండరీ యాత్ర చేసి గురువు గారిని దర్శించుకునే వారు . 1929 వ సంవత్సరంలో ఆయన పండరీ పురం వెళ్ళినప్పుడు మహీపతి గుండా మహారాజ్ గారు " నీవు తరచుగా పండరీ యాత్ర చేస్తున్నావు కదా , నీకు ఈ పండరీ నాధుని వృతాంతం తెలుసునా ? " అని అడిగారు . నరసింహం గారు " తెలుసును గురువు గారు , పండరీనాధుడైన విఠలు తన భక్తుడైన పాండురంగని కోసం అతని ఇంట్లో వెలిసారని సమాధానమిచ్చారు . 


మరి నీవు కూడా ఆ పండరీనాధుని భక్తుడవు నీకోసం స్వామి వారు అక్కడే సాక్షాత్కరిస్తారు కదా ఇంత దూరం రావడం దేనికీ ? అని ప్రశ్నించారు . తరువాత ఇలా అన్నారు " ఇక నీవు పండరీ యాత్ర చేయవలసిన అవసరం లేదు , నీకోసం స్వామి వారే నీ ఊరిలోనే వేలుస్తారు . అక్కడే ఆలయం నిర్మించి కొలుస్తూ ఉండు అని చెప్పారు .


స్వామి వారి మాటలు విని విస్మయమొందిన నరసింహం గారు గురువు గారి అనుగ్రహంతో ఆలయం నిర్మించాలని నిశ్చయించుకుని చంద్రభాగా నది ( పండరీపురంలో ప్రవహించే నది ) లోని కొన్ని రాళ్ళను తీసుకువెళ్ళి శంకుస్థాపన చేస్తున్న సమయంలో వాటిని అక్కడ ప్రతిష్టించాలని అనుకున్నారు . కానీ చంద్రభాగానది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ, ఈతగాళ్ళుకూడా నదినుండి రాళ్ళు తియ్యలేని పరిస్ధితిగా వున్నది. అప్పుడు నరసింహంగారు చంద్రభాగను ప్రార్ధించగా పుండరీక దేవాలయము పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది.


నరసింహంగారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది. వాటన్నింటినీ పాండురంగని ముందుంచి, నరసింహంగారు, వారి గురువుగారు ప్రార్ధనా తన్మయత్వంలో వుండగా పాండురంగనినుంచి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహంగారి కలలో సాక్షాత్కరించి, కీర పండరీక్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం, కార్తీక శుధ్ధ ఏకాదశి బుధవారం (13-11-1929) పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహంగారు సంతోషంగా తిరిగివచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు.


కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహరాజ్ గారికి పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి నీశిష్యునికోసం తాను తెలిపిన రోజున కీర పండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖద్వారా నరసింహంగారికి ఈ విషయం తెలియజేశారు. పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణము పూర్తయినది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. 


గర్భ గుడికి తాళం :


ఆ రోజు రానే వచ్చింది , అందరూ ఎంతో  ఉత్కంటగా ఎదురుచూసే సమయం అది . స్వామి వారు నిజంగానే ప్రత్యక్షమవుతారా ? ఈ కలికాలంలో ఇది సాధ్యమేనా ? నరసింహం గారు నిజంగానే అంతటి భక్తులా ?ఇలా ఎన్నో సందేహాలు . అప్పటి పాలకులైన బ్రిటీషు వాళ్ళు , నాస్తుకులు , హేతువాదులు ఈ విషయాన్ని నమ్మలేదు . అప్పటి బ్రిటిషు అధికారి ఆలయపు గర్భ గుడిని మూయించి , తాళం వేసి , బయట బందోబస్తును పెట్టించి , స్వామి వారు రావడం బూటకం అని నిరుపించాలనుకున్నాడు .  


ఆంజనేయ స్వామి అభయం : 


ఆంజనేయస్వామి ఆలయంలో ఆయనను ప్రార్ధిస్తూ తన్మయావస్తలో వుండగా ఆంజనేయుడు ఆయనకి ఆభయమిచ్చాడుట.. పన్నెండు గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్ధాపిస్తానని .


పగలు పదిన్నర అయింది: 


ఉన్నట్లుంది ఆకాశం బ్రద్ధలవుతున్నాట్లు పెద్ద శబ్దం . ఉరుములు మెరుపులతో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది వాతావరణం . అంతలో గర్భ గుడిలో ఒక పెద్ద చప్పుడు పిడుగు పడినట్లు అనిపించింది .  దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికెంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహంగారు అనేక ప్రార్ధనలు చేయగా తలుపులు తెరువబడి దివ్య తేజస్సులమధ్య పాండురంగని విగ్రహ సాక్షాత్కరించింది. మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురములోని పాండురంగని విగ్రహమువలెనున్నది. చల్లని చిరుజల్లు కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.


నాస్తికులు ముక్కున వేలేసుకుని , తమ నాస్తిక వాదం వదిలి పాండురంగడి పాదాక్రాంతులయ్యారు . ఆ బ్రిటిషు అధికారి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి స్వామి వారి భక్తుడయ్యాడు . ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటనగా ఆలయ చరిత్రలో లిఖించారు .


ఆ పండరీనాధుడే ఇక్కడ ఆయన భక్తుడైన నరసింహం గారి కోసం వెలిసారని వేయినోళ్ళ కొనియాడారు.పండరీపురంలో లాగానే ఇక్కడ కుడా భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు.


తదుపరి భక్త నరసింహంగారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలబెట్టగా భారతావనిలో అనేకమంది ఈ యజ్ఞములో పాల్గొని శ్రీ విఠలనామమును వ్రాశారు. ఆ పుస్తకములన్నియు తగు పూజావిధానముతో ఆలయప్రాంగణములోని విఠల్ కోటి స్ధూపములో నిక్షిప్తంగావించబడ్డాయి.


శ్రీ పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహంగారికి అభయమొసగిన ఆంజనేయస్వామి ఆలయం వున్నది. ప్రక్కనే వేరొక ఆలయంలో సహస్ర లింగ కైలాస మంటపము విరాజిల్లుతుంటే ఇంకొకపక్క రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయము నిర్మింపబడ్డది. ఆరు ఎకరాల స్ధలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు..వాటిలోనే షిర్డీ సాయిబాబా మందిరం..దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వధ్ధ వృక్షము, దానికింద చిన్న సిధ్ధేశ్వరాలయము. 400 ఏళ్ళ పైనుంచి వున్న ఈ అశ్వధ్ధ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలంనుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ వున్నారనీ, భక్త నరసింహంగారికి ఆయన దర్శనమిచ్చారనీ అంటారు.


భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసిహంగారు 16-1-1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరంనుంచి విద్యుత్కాంతిలాంటి వెలుగు వెలువడి పాండురంగనిలో ఐక్యమందటం, సహస్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేకమంది చూశారంటారు. 


దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహా మండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరచి వుంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ వుంచమన్నారు. ఆవిధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్ధాపించారు.


ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకులకోసం వుంచారు. శ్రీ నరసింహంగారి మనుమలు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.


సముద్ర తీరంలో వున్న ఈ ఆలయానికి, ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రంనుంచే కాక ఒరిస్సానుంచికూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహంగారి సంతతివారిచేతే నిర్వహించబడుతున్నది. కృష్ణాజిల్లా ముఖ్యపట్టణమైన చిలకలపూడిలో వున్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడకి 82 కి.మీ. ల దూరంలో వున్నది.


భక్తుని కోసం భగవంతుడు వెలసిన నిదర్శనాలు ఎన్నో మన సనాతన ధర్మంలో ఉన్నాయి . 


హరే రామ హరే రామ రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


అందరం  " ఓం నమో నారాయణాయ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహానికి  పాత్రులమవుదాం ...


ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

జై శ్రీ కృష్ణ


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

కామెంట్‌లు లేవు: