30, జూన్ 2023, శుక్రవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 106*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 106*


మలయకేతు రాక్షసామాత్యుని దర్శనం కోసం కబురు పంపించాడు. 


ఆ వార్త చేరే సమయానికి పాటలీపుత్రం నుంచి రాక్షసభృతుడైన ప్రతీహారి వచ్చాడు. అతనితో రహస్యంగా ముచ్చటించేందు కోసం రాక్షసుడు తన సిబ్బందిని పిలిచి "మాకు తలనొప్పిగా ఉంది. ఈరోజు ఎవరినీ దర్శించం..." అని చెప్పాడు.  


ఆ తర్వాత కొద్దిసేపటికి మలయకేతు పంపిన భటుడు వచ్చి, రాక్షస దర్శనం కాక తిరిగి వెళ్లి "ప్రభూ ! అమాత్యుల వారికి మా చెడ్డ తలనొప్పిగా వున్నదట.... ఈ రోజు వారి దర్శనం ఎవరికీ లభించదట" అని మనవి చేశాడు. 


బాగురాయణుడు కల్పించుకొని "అయ్యో... పాపం... మనమే వెళ్లి ఆయన్ని పరామర్శించి వద్దాం పదండి" అంటూ మలయకేతును ప్రోత్సహించాడు. ఇద్దరూ కలిసి రాక్షస నివాసానికి వెళ్లారు. ఆ నివాసం బయటనే కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్న సిద్దార్థకుడు వాళ్ళని చూసి గతుక్కుమని "అమాత్యుల వారిది కల్పిత శిరోవేదన అని మీకు తెలిసిపోయిందా ?" అనేసి నాలిక కరుచుకున్నాడు. 


మలయకేతు వులిక్కిపడి "ఏమిటి ? తలనొప్పి ? అబద్ధమా ?" అంటూ ముందుకు వెళ్లి అంతకు ముందు సిద్ధార్థకుడు పచార్లు చేసిన చోటనున్న కిటికీ వద్దకు చేరాడు. లోపలి నుంచి మాటలు వినిపించసాగాయి. 


"భళా .... చాణక్య చంద్రగుప్తుల మధ్య విరోధము కల్పించబడి, చాణక్యుడు అతని నుండి విడిపోయినాడన్న మాట" అన్నాడు రాక్షసుడు ఉత్సాహంతో. 


ప్రతీహారి నవ్వి "అవును. నీకంటే రాక్షసుడే మంచివాడని చంద్రగుప్తుడన్నాడు. అయితే ఆ రాక్షసుడినే తెచ్చి మంత్రిని చేసుకోమని చెప్పి చాణక్యుడు వెళ్లిపోయాడు. ఇక మీ అభీష్టం సిద్ధించడానికి ఆటంకాలన్నీ తొలగిపోయినట్లే...." అని చెప్పాడు. 


రాక్షసుడు సంతోషంతో పగలబడి నవ్వి "కాదా మరి. చంద్రుడు నా నామస్మరణ మొదలు పెట్టాడంటే, నా సంకల్పం సిద్ధించినట్లే...." అన్నాడు సంబరంతో. 


ఆ సంభాషణలను కిటికీ బయటనుంచి ఆలకించిన మలయకేతు ఆవేశంతో ఏదో అనబోగా, బాగురాయణుడు సైగలతో అతనిని వారించి అవతలికి తీసుకెళ్ళాడు. ఇద్దరూ రాజభవనం చేరారు. 


"ఆ సంభాషణల ఆంతర్యమేమిటో బోధపడిందా ? చంద్రగుప్తుడు ప్రశంసించాడట... యీయన ఇక్కడ పరవశించిపోతున్నాడట... ఎందులకటా ?" అన్నాడు మలయకేతు ఉక్రోషంతో. 


"మగధరాజ్య మహామాత్య పదవి లభించనున్నదన్న పరవశమేమో...." అనేశాడు బాగురాయణుడు. 


మలయకేతు ఉలిక్కిపడి అనుమానంగా చూశాడు. 


బాగురాయణుడు సాలోచనగా తలపంకించి "అవును. ఎవరేమైపోయినా రాక్షసునికి కావాల్సింది మగధ మంత్రిత్వం. దాని కోసమే ఒకనాడు మహానందుల వారికి ద్రోహం చేసి మహాపద్ముడిని ఆశ్రయించాడు. ఆ పదవి కోసమే లోపలి నుంచి కోట తలుపులు తెరిపించి చంద్రుని ద్వారా నందులను చంపించాడు. కానీ అక్కడ చాణక్యుడు అడ్డగోడ వలె నిలిచాడు. ఇప్పుడా గోడకూలిపోయింది. ఇక అవాంతరం ఏదైనా ఉంటే... అది మనమే..." అన్నాడు సాలోచనగా. 


మలయకేతు కోపంతో పళ్లు కొరుకుతూ "తక్షణమే రాక్షసుని పిలిపించి..... " అంటున్నాడు. 


బాగురాయణుడు వారిస్తూ, "వద్దు. సరైన ఆధారాలు లేకుండా రాక్షసుని నిలదీయడం మంచిది కాదు. మనం కూడా నాటకమాడి వాళ్లకన్ను వాళ్ళ వ్రేలితో పొడవాలి. తక్షణం యుద్ధయాత్ర మొదలెడదాం. ప్రస్తుతం బలహీనుడైన చంద్రగుప్తుని జయించి, ఆ తర్వాత రాక్షసుని సంగతి ఆలోచిద్దాం. అంతవరకూ మనకు తెలిసిన ఈ రహస్యం... గప్ చిప్...." అని చెప్పాడు. 


ఆ సలహా నచ్చిన మలయకేతు యుద్దయాత్రకి ఏర్పాట్లు పూర్తి చేసి ఆ తర్వాత రాక్షసునికి ఆ విషయం తెలియపరిచాడు. ఆ మరునాడే యుద్ధయాత్ర ప్రారంభం. చేసేది లేక రాక్షసుడు అనుసరించాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: