6, అక్టోబర్ 2023, శుక్రవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-66🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-66🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*ఆచార్యుల అనుభవాలలో తిరుమల*


భగవద్రామానుజులకు ఆచార్యులైన పెరియ తిరుమల నంబిగారు (రామానుజాచార్యుడు) తమ ఆచార్యులైన ఆళవన్దారుల ఆదేశానుసారం ఇక్కడే వేంచేసియుండి తీర్థకైంకర్యంతో పాటు అనేక కైంకర్యాలను స్వామి సన్నిధిలో చేయుచుండెడివారు.


 ఒక నాడు వీరు పాపనాశనం నుండి తిరుమంజనం తీర్థం తెచ్చుచుండగా స్వామి మారువేషంలో వచ్చి "తాతా! దాహంగా ఉంది కాస్త తీర్థం ఇవ్వవూ" అని ప్రార్థించి వీరొసంగిన తీర్థం కడుపార త్రావి నిజరూపంతో సాక్షాత్కరించాడు.


 కావుననే వీరిని "పితామహస్యాపి పితామహాయ" అంటారు సంప్రదాయ వేత్తలు (అహంహి సర్వలోకానాం మాతాథాతా పితామహ:అని చెప్పిన సర్వేశ్వరునిచే "తాతా" అని పిలువబడుటచే పితామహునకు కూడా పితామహుడై నారు)


*తిరుమలై అనన్దాళ్వాన్ అను మహనీయులు రామానుజుల వారి శిష్యులు.* 


వీరు ఆచార్యాజ్ఞను శిరసావహించి తిరుమలలో వేంచేసి యుండి నందనవనమును పెంచి పెరుమాళ్లకు పుష్ప కైంకర్యము చేసెడివారు. 


వీరు ఆనాడు పెంచి పోషించిన నందనవనం నేటికిని అనన్తాళ్వాన్ తోటగా ప్రసిద్దమై నానాపుష్పలతా గుల్మతరుశోబితమై అలరారు చున్నది.


 వీరి యీ కైంకర్యమునకు సంతసించిన భగవద్రామానుజులు వీరిని "అనన్దాన్ పిళ్ళై" అని అనేవారట. 


ఒక పర్యాయం పద్మావతీ శ్రీనివాసులు రాజకుమారిక రాజకుమారుల వేషంలో అనన్దాళ్వాన్ తోటలోని పుష్పములను కోసికొని అలంకరించుకొంటున్నారు. ఇంతలో అనన్దాళ్వాన్ రావడం చూచి వారు సన్నిధికి అప్రదక్షిణంగా పరుగెత్తి ఉద్యానవనం దగ్గర అంతర్థానమై నారట. దీనికి సూచకంగా బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు స్వామివారు అప్రదక్షిణంగా ఉద్యానవనంలోనికి వేంచేస్తారట.


*భగవద్రామానుజుల కైంకర్యములు*


భగవద్రామానుజులు ఈ సన్నిధిలో గావించిన కైంకర్యములు అనేకములు.


 అవినేటికిని మనకు మనకు దర్శనీయములై యున్నవి.


 వీరు వేంకటాచలపతికి శంఖచక్రములను ప్రసాదించారు. స్వామి వక్షస్థలమున ద్విభుజయగు వ్యూహ లక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన రత్నమాలికా యోగమున సమర్పింప జేసినారు. 


కావుననే ప్రతి శుక్రవారం స్వామికి తిరుమంజనం జరుపుచున్నారు.


పూర్వం ఈస్వామి బ్రహ్మోత్సవములు "తిరుచానూరు" (తిరుచ్చుగనూరు) లో జరిగేవట-


కానీ రామానుజులవారు ఈ ఉత్సవములు కొండమీదనే జరిగేలాగున అచటి సన్నిధి చుట్టు వీధులను నిర్మింపజేసి భక్తులకు అవాస యోగ్యము గావించి అది మొదలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్కడే జరిగేటట్లు చేశారు.


ఈ సన్నిధిలో కౌతుక బేరంగా ఉండిన "మలైకువియా నిన్ఱపెరుమాళ్ళను" ఉత్సవమూర్తిగాను అప్పటివరకు ఉత్సవమూర్తిగా ఉండిన "వేంగడత్తుఱైవార్" అనువారిని కౌతుక బేరంగాను ఆలయ వైభవాభివృద్ధికై మార్పు చేయించినారట రామానుజులవారు.


 ఈ "మలైకువియా నిన్ఱ పెరుమాళ్లనే" మలైయప్పన్ అని అంటారు.


ఇట్లే ఈ సన్నిధిలో అర్చకులుగా "శెంగవిరాయన్" అను వైఖానస ఆచార్య సత్తముల వంశీయులే ఉండవలయునని నియమించారు.


 స్వామి పుష్కరిణీ తీరమునగల వరాహ ప్పెరుమాళ్ల సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి తులా (అల్పిశి) మాసం శ్రవణం నాడు తిరునక్షత్రోత్సవమును నిత్య తిరువారాదనమును యథావిధిగా జరుగునట్లు కట్టడి చేసారు.


ఒకప్పుడు ఈ ఆలయం శత్రు సమాకాస్తం కాగా పర పురుష స్పర్శనొల్లని పెరియపిరాట్టి (శ్రీదేవి) స్వామి వక్షస్థలమును చేరగా భూపిరాట్టి (భూదేవి) ఉద్యానవనమున గల " అళగప్పిరానార్" " అను బావియందు ప్రవేశించినారట.


శ్రీ ఆళవందారులు తిరుమలైకి వేంచేసినపుడు ఒక సందర్భంలో "మారిమారాద తణ్ణమ్మలై" అనునట్లు సంతత వర్షాతిశయమును చూచి ఇట్టి వర్షాతిశయ సమయములలో తిరుమంజన తీర్థము పాపవినాశం నుండి తేనవసరం లేదని ఈ నందనో ద్యానమునగల " అళగప్పిరానార్" " అను ఈ బావితీర్థమును వినియోగింప వచ్చునని ఆనతిచ్చిరట. 


ఈ బావికి "అళగప్పిరానార్" అను దివ్యనామము నుంచినవారు శ్రీఆళవందారులే. స్వామి రామానుజులు ఆనామమునే స్థిరపరచి దాని సమీపంలో భూదేవిని శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠింపజేసినారు.


ఈ బావిని త్రవ్వించినవాడు రంగదాసు అను గొప్ప భక్తుడు. అతడు స్వామివారికి ఆలయ ప్రాకార గోపురాదులను నిర్మింప సంకల్పించి ప్రాకార నిర్మాణమునకు అడ్డుగా ఉన్న తింత్రిణీ వృక్షమును; (ఈ నిర్ణిద్ర తింత్రిణీ వృక్షము క్రిందినే స్వామి వేంచేసియుండేవారు) స్వామి దక్షిణ పార్శ్వమున అమ్మవారు వేంచేసియున్న చంపక వృక్షమును అడ్డుతొలగవలసినదని సవినయంగా భక్తితో ప్రార్థించారట.


 ఆరాత్రి ఆరెండు వృక్షములు వెనుకకు తగ్గగా కట్టడములను నిర్మింపజేశారట. నేడు ఈవృక్షములు గలప్రాకారాన్ని చంపక ప్రాకారమని ఆబావిని పూలబావియని వ్యవహరిస్తున్నారు. 


రామానుజులవారు ఈ వృత్తాన్తాన్ని విని ఆరెండు వృక్షములు ఆదిశేషాంశములని భావించి వానికిని నిత్య తిరువారాధన జరిగేలా నియమించినారట.


మరియొకప్పుడు "వీరనరసింహదేవరాయలు" అను రాజు తిరుమలైకు యాత్రగా వచ్చి స్వామిని సేవించి స్వామికి గోపురము నిర్మించాలని సంకల్పించి పెద్దల అనుమతితో గోపురం కట్టనారంభించినారట.


ఒకరోజు రాత్రి ఒక సర్పం ఆరాజు కలలో కనిపించి "రాజా! నీవు ఈగోపురము నిర్మిస్తుంటే నాశరీరం నానా బాధలు పడుతున్నది" అని పలికిందట. రాజు ఆశ్చర్యపడి మరునాడు స్వామిని సేవింపగా ఆ సర్పం స్వామియొక్క వైకుంఠ హస్తమును చుట్టుకొని దర్శనమిచ్చి అంతర్ధానమైనదట.


 ఆ సన్నివేశం చూచిన రాజు ఆ పర్వతం ఆదిశేషుడే యని విశ్వసించి గోపుర నిర్మాణమును అంతటితో ఆపివేసినాడు. ఆ వృత్తాన్తమును విన్నపెద్దలు స్మారకంగా స్వామివారికి స్వర్ణనాగాభరణమును సమర్పించినారట. రామానుజులవారు దానిని విని రెండవ శ్రీహస్తమునకును నాగాభరణం సమర్పింపజేసినారట.


స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీశంకరాచార్యులవారికి శ్రీనరసింహస్వామి సాక్షాత్కరించి నందువలన అచట శ్రీనరసింహస్వామి సన్నిధియుండెడిది. 


కానీ లక్ష్మీసాహచర్యం లేనందువలన ఆస్వామి మహోగ్రంగా యుండె వారట. అందుచే వారిని ఆరాధింపరాదని కొందరు పలుకగా రామానుజులవారు అదిసరికాదని భావించి ఆస్వామిని శ్రీవేజ్కటాచలపతి సన్నిధి ప్రాకారములోనే ఈశాన్య దిక్కున విమానాభిముఖముగా ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాధన జరిగేలా ఆదేశించినారట.


 ఇట్లే పురాణ ప్రసిద్ధి ననుసరించి కొండనెక్కే మార్గంలోను నరసింహమూర్తిని ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాదన జరిగేలా ఆదేశించారట.


శత్రువుల వలన కలిగిన ఒక మహోపద్రవ సమయంలో తిల్లై తిరుచ్చిత్తర కూడమున (చిదంబరం) వేంచేసియున్న గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో

తిరుపతికి వేంచేసి మలై ఆదివారంలో కొంతకాలం ఆరాధింపబడినారట.


అట్లె శ్రీరంగము నుండి నంబెరుమాళ్ళు (శ్రీరంగనాథులు) దెవెరులతో తిరుమలైకు వేంచేసి ద్వజస్తంభమున కెదురుగనుండు రంగమండపమున కొంతకాలం భక్తులకు సేవసాయించినారట. 


ఈ సన్నిధిలో స్నపన బేరముగా నున్న "అలగప్పిరానార్" అనుమూర్తియే శయ్యా బేరముగను సేవలనందుకొనుచున్నారు. కాని దనుర్మాసం నెలరోజులు మాత్రం శ్రీవైఖానసాగమం ప్రకారం శ్రీకృష్ణమూర్తియే శయ్యా బేరముగ శయన సేవను అనుగ్రహించు చుండును.


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: