*నమ్మకం..రక్షణ..*
"స్వామివారి సమాధి వద్దకు వెళ్ళడానికి అనుమతి ఇస్తారా?.." అంటూ ఆ యువకుడు నాలుగోసారి నన్ను అడిగాడు.."మీకు ఇందాకటి నుంచీ చెపుతూనే వున్నాను..మీవంతు రాగానే మిమ్మల్ని లోపలికి పంపుతాము..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..మీకోర్కెలు తెలపుకోండి..అంతవరకూ ఇక్కడ స్థిమితంగా కూర్చోండి..అందరికీ అవకాశం కల్పిస్తాము.." అని ఒకింత అసహనంగా అతనితో చెప్పాను.."సరేనండీ..వేచి ఉంటాను.." అన్నాడు..ఆదివారం నాటి ఉదయం ప్రభాతసేవ తరువాత స్వామివారి సమాధి దర్శనానికి వచ్చే భక్తులతో..ఆ చిన్న మంటపం నిండిపోయి ఉన్నది..వరుసక్రమంలో ఒక్కొక్కరినీ లోపలికి పంపుతున్నాము..ఆ సమయం లో ఈ యువకుడు పదే పదే అడుగుతున్నాడు..అందువల్ల అసహనానికి గురికావాల్సి వచ్చింది..మరో అరగంట తరువాత..ఆ యువకుడు స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చాడు..భక్తుల హడావిడి కూడా మరో రెండు గంటల్లో సమసిపోయింది..
"ఇప్పుడు మీతో కొద్దిసేపు మాట్లాడటానికి వీలవుతుందా?.." అంటూ మళ్లీ ఆ యువకుడు నా వద్దకు వచ్చాడు.."పొద్దున లాగా హడావిడి లేదు..మీరు చెప్పేదేదో చెప్పండి.." అన్నాను..అతను నా దగ్గరగా వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు.."ప్రసాద్ గారూ..నేను మిమ్మల్ని విసిగించడానికి రాలేదు..నాపేరు మనోహర్..నా స్వానుభవం లో స్వామివారు నన్ను ఎలా కాపాడిందీ మీకు చెప్పుకోవాలని అనిపించి వచ్చాను..పోయిన సంవత్సరం దాకా నాకు మొగిలిచెర్ల కానీ..ఈ స్వామివారి గురించి కానీ ఏమీ తెలీదండీ..నేను సాయిబాబా భక్తుడిని..మా ఊళ్ళో బాబా గుడికి తరచూ వెళుతుంటాను..రెండు మూడేళ్ల కు ఒకసారి శిరిడీ వెళుతుంటాను..నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరండి..నాకు చిన్న వ్యాపారం ఉన్నది..ఆ దుకాణం మీద వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాను..మా ఇద్దరికీ లోటు లేకుండా జరిగిపోతున్నది..పోయిన సంవత్సరం నేను ఒంగోలు వచ్చానండీ..అక్కడ సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు..నా మిత్రుడు ఈ స్వామివారి గురించి చెప్పాడు..ఆరోజు సాయంత్రం అతనితో కలిసి ఇక్కడకు వచ్చానండీ..ఆరాత్రికి ఇక్కడ నిద్ర చేసాము..తెల్లవారి స్వామివారి సమాధి దర్సనం చేసుకొని వెళ్ళాము..ఆరోజే మా ఊరు వెళ్ళిపోయాను..నాలుగు నెలల క్రితం..రోడ్డు విస్తరణ చేయాలని.. మా దుకాణం తొలగించమని మా ఊరు మున్సిపాలిటీ వాళ్ళు నోటీసు ఇచ్చారండీ..ఆరోజే మా అమ్మకు విపరీతంగా కడుపులో నొప్పి వచ్చింది..బాగా మనస్తాపం చెందాను..అమ్మను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి మందులు ఇప్పించాను..పరీక్షలు చేసి ఆపరేషన్ త్వరలో చేయించుకుంటే మంచిది అన్నారు..ఎందుకనో నాకు ఈ స్వామివారు గుర్తుకొచ్చారు..స్వామికి మనసులోనే మొక్కుకున్నాను..ఆ ప్రక్క ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి..స్వామివారి సమాధి వద్ద నా వేదన చెప్పుకొని వెళ్ళాను...మీరు నమ్మండి నమ్మకపోండి..ఒక వారం రోజుల్లో..మా ఊళ్ళో మంచి సెంటర్ లో నాకు దుకాణం పెట్టుకోవడానికి మరో గది అద్దెకు దొరికింది..అదికూడా తక్కువ అద్దెకు..పాత షాప్ ఖాళీ చేసి కొత్తదాంట్లో చేరిపోయాను..వ్యాపారము కూడా మెరుగుపడింది..అమ్మ ఆరోగ్యం కుదుటబడింది..ఇక్కడికి వచ్చి మొక్కుకున్నందువల్లే నాకు మేలు జరిగిందని నాకు బలంగా అనిపించింది..ఈరోజు స్వామివారికి మొక్కు చెల్లించుకుందామని వచ్చాను..స్వామివారి సమాధిని దర్శించుకొని..స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్న తరువాతే..మీతో మాట్లాడాలని అనుకున్నాను..అందుకే ఉదయం మిమ్మల్ని తొందరపెట్టాను..ఏమీ అనుకోవద్దు.." అన్నాడు..
"స్వామివారిని నమ్మి కొలిచినందుకు మీకు మంచి జరిగింది..చాలా సంతోషం మనోహర్.." అన్నాను.."ప్రసాద్ గారూ..స్వామివారి దయవల్ల లక్షణంగా వున్నాను..వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను..నా తరఫున పెద్దదిక్కు మా అమ్మ ఒక్కతే..ఈరోజు స్వామివారి వద్ద ఆ కోరిక కూడా కోరుకున్నాను..మాలో కలిసిపోయే అమ్మాయి వస్తే చాలు..కట్నకానుకలు వద్దు..వచ్చే బుధవారం నాడు ఇక్కడ అన్నదానం చేయించండి..మీరు కూడా నా తరఫున స్వామివారికి నా కోరిక విన్నవించండి.." అన్నాడు..ఆరోజు సాయంత్రం దాకా స్వామివారి మందిరం వద్దే వుండి..మరోమారు స్వామివారి సమాధిని దర్శించుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు..మరో రెండు నెలల తరువాత మనోహర్ కు వివాహం కుదిరిందని ఫోన్ చేసి చెప్పాడు..పెళ్లికాగానే తన భార్యను, తల్లిని తీసుకొని స్వామివారి సన్నిధికి వస్తానని చెప్పాడు..
మనోహర్ మనసా వాచా స్వామివారినే నమ్ముకున్నాడు..అతనిలో స్వామివారిపై ఉన్న భక్తి విశ్వాసాలే అతనికి అన్ని వేళలా రక్షగా ఉన్నాయి..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి