6, అక్టోబర్ 2023, శుక్రవారం

మసకబారుతున్న పండగ సంప్రదాయాలu




 మసకబారుతున్న పండగ సంప్రదాయాలలో #బొమ్మలకొలువు ఒకటి. బొమ్మ అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ నుండి చీమ వరకు అన్నింటిలో భగవంతుడిని దర్శించవచ్చన్న భావనతో బొమ్మలకొలువును ఏర్పాటుచేసి, హారతి పట్టడం పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయం.


ఈ సంప్రదాయం ప్ర‌స్తుత త‌రం వారికి పెద్ద‌గా తెలియ‌దు అనే చెప్పాలి. కానీ ఒకప్పుడు బొమ్మలకొలువును ఏర్పాటు చేయడం లేదా వాటికి హాజరవడం అంటే ఎంతో సరదాగా ఉండేది. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అలనాటి నటి జమునగారికీ ఈ సరదా ఉంది. చిన్నతనంలో దుగ్గిరాలలో బొమ్మల పెళ్లిళ్లలో సేకరించిన తాటాకు బొమ్మలు మొదలుకొని, అమెరికాలో కొన్న బొమ్మల వరకు ఆమె బొమ్మల కొలువులో కొలువు తీరాల్సిందే.


జమునగారి ఉత్సాహానికి అప్ప‌ట్లో ఆమె తల్లిగారి ప్రోత్సాహం కూడా జత అయ్యేది. ఇద్దరూ ఎన్నో రకాల బొమ్మలను సేకరించేవారు. రామాయణ ఘట్టాలకు సంబంధించిన రామాయణం బొమ్మల సెట్, ఇంకా గజేంద్ర మోక్షం బొమ్మల సెట్, కైలాసం సెట్... అలాగే కొండపల్లి బొమ్మలు, మట్టి బొమ్మలు, తిరుపతి చెక్క బొమ్మలు, ఇంకా చిన్నప్పుడు తను ఆడుకున్న పొయ్యి బొమ్మ, పూజించిన సరస్వతీదేవి బొమ్మ... ఇలా ఎన్నో రకాల బొమ్మలతో శోభాయమానంగా, విజ్ఞానదాయకంగా కొలువును ఏర్పాటు చేసేవారు శ్రీమతి జమున.


ఆహ్వాన పత్రాలను కూడా ముద్రించి అందరికీ పంపేవారు. క్రమం తప్పకుండా ఎందరో ప్రముఖులు వచ్చేవారు. ఎందుకంటే జమునంటే ఇష్టం. జమున ఇంట పేరంటమన్నా ఇంకా ఇష్టం. నవరాత్రులప్పుడు రోజూ ఉదయం అమ్మవారి పూజలు, సాయంత్రం బొమ్మలకొలువు పేరంటం... ఇలా తన ఆరో యేట మొదలు గత ఏడు దశాబ్దాలుగా అలుపెరగకుండా జమున బొమ్మల కొలువు పెడుతూనే ఉండేవారు. జమున గారి బొమ్మలకొలువును చూడటానికి ప్రముఖ నటీమణులందరూ విచ్చేసేవారు.అప్ప‌ట్లో ఉన్న హీరోయిన్లంద‌రూ కూడా త‌ప్ప‌కుండా హాజ‌ర‌య్యేవారు, సావిత్రి, వాణిశ్రీ, కృష్ణ‌కుమారి ఇలా ఎంతో మంది వ‌చ్చేవారు. ఆమెతో క‌లిసి పూజ‌లో పాల్గొని పేరంటానికి హాజ‌య్యేవారు.


సేకరణ

కామెంట్‌లు లేవు: