ఎంతటి మహానుభావులు! ఎంతటి కరుణాసముద్రులు!!
మాయవరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి (మాయవరం పెరియవ) చాలా బాధ పడుతూ ఏడుస్తూ శ్రీ మఠం వచ్చారు. ఆయన చేసే ‘భాగవత సప్తాహం’ మహాస్వామి వారు చాలా మెచ్చుకునేవారు. మాయవరం శాస్త్రి గారు ఎప్పుడు సప్తాహం చేసినా శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా వింటున్నాడా అన్నట్టు తమ ధ్యాసను భాగవతం పైన తప్ప వేరే వాటిపైన ఉంచేవారు కాదు. అంతటి మహాత్ముడు కన్నుల నీరు కారుస్తూ మఠం మేనేజరు శ్రీ విశ్వనాథ అయ్యర్ గారితో మాట్లాడుతున్నారు.
మేనేజరు వారు శ్రీ కణ్ణన్ మామతో “శాస్త్రి గారు ఎందుకో చాలా భారమైన హృదయంతో దీనంగా ఏడుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం వెంటనే మహాస్వామి వారితో చెప్పి శాస్త్రి గారు మహాస్వామిని కలుసుకునేలాగ చెయ్యాలి” అని అన్నారు.
శ్రీ కణ్ణన్ మామ విశ్రాంతిలో ఉన్న మహాస్వామి వారిని కలిసారు. మహాస్వామి వారు “ఏమిటి” అని అడిగారు. మామ శాస్త్రి గారి విషయం చెప్పారు.
అందుకు మహాస్వామి వారు “అతను కార్ లో వచ్చాడు కదా?” అని అడిగారు. అవును అన్నారు మామ. ”సరే అతన్ని పాద ప్రక్షాళన చేసుకుని వెనుక ఉన్న గుమ్మం వైపు నుండి రమ్మను” అని అన్నారు.
మహాస్వామి వారు ఒక ఉసిరికాయ చెట్టు కింద కూర్చుని ఉన్నారు. శాస్త్రి గారు వచ్చి స్వామి వారికి వందనం చేసి బాధపడుతూ “పెరియవ నా అల్లునికి ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎక్స్ రే తీయిస్తే అతని రెండు ఊపిరితిత్తులు సగం పాడైపోయాయని ఇప్పుడు ఒక్కటి మాత్రమే పనిచేస్తూ ఉందని చెప్పారు. అతను ఒక నెల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని కూడా చెప్పారు.” అని వాపోయాడు
శాస్త్రి గారు అలా చెప్తూ మాహాస్వామిని ప్రార్థిస్తూ “ఒకవేళ జరగరానిది జరిగినా కానీ ఈ దుఃఖం నన్ను ఆవరించకుండా మీరు నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను” అని అన్నారు. (మనలో ఎవరు ఇలా ప్రార్థించగలరు, ఒక్క జ్ఞానులు/పండితులు తప్ప). శాస్త్రి గారు మరలా చేతులు జోడించి మహాస్వామి తో “ఈ శరీరం వెళ్ళీపోయినా నాకు ఈ దుఃఖం నన్ను బాధింపకూడదు” అని అన్నారు.
అప్పుడు కణ్ణన్ మామ “అతను ఏడుస్తూ కూడా తనకు ఈ దుఃఖం బాధించకూడదు అని అంటున్నాడు” అనుకున్నారు. మహాస్వామి అది విని ఒక విచిత్ర మైన ప్రశ్న వేసారు ”ఒకవేళ ఆ యంత్రములు తప్పు చెప్తున్నయేమో కదా?” అని.
అప్పుడు శాస్త్రి గారు ”మేము 27 ఎక్సరేలు తీయించాము అన్నీ డాక్టర్లు చెప్పినదే రుజువుచేస్తున్నాయి. ఇక 20-25 రోజులకంటే ఎక్కువ బ్రతకడు అని”. అప్పుడు మహాస్వామి వారు “నువ్వు వేదాంతం బాగా నేర్చుకున్నావు కదా అందులో ‘భగవాన్ భయ నాశనః’ అని ఉంది కదా ఆయననే శరణువేడు” అన్నారు. ఆ మాటలను విని శాస్త్రి గారు తేలిక పడ్డ మనసుతో ప్రసాదమును స్వీకరించి వెళ్ళిపోయారు. కానీ 15 రోజుల తరువాత చాలా ఆత్రుతతో మఠానికి తిరిగివచ్చారు.
కణ్ణన్ మామ వారిని చూసి “ఆ రోజు చాలా చాలా బాధపడ్డాడు” అనుకున్నారు
మేనేజరు మామతో, “చూస్తూ ఉంటే వారి అల్లుడు మరణించినట్టు ఉన్నది త్వరగా తీసుకువెళ్ళు” అన్నారు.
కణ్ణన్ మామ మహాస్వామి వద్దకు పరిగెత్తారు. ఈసారి కూడా మహాస్వామి విశ్రాంతిలో ఉన్నారు. మామ మాటలు విని “ఎందుకు వచ్చాడు? అల్లుడు మరణించాడా? ఖచ్చితంగా అంత్యసంస్కారములు అన్నీ పూర్తి అయి ఉంటాయి. అంతా అయిపోయిన తరువాతనే ఇక్కడకు వచ్చుంటాడు. అతను పండితుడు కదా ఇవన్నీ బాగా తెలిసుంటాయి” అన్నారు.
మామ అవునన్నట్టు తల పంకించి ఆరోజు మహాస్వామి వారు చాలా సాధారణ వ్యక్తి లాగా మాట్లాడుతున్నారే అనుకున్నాడు. శాస్త్రి గారు మహాస్వామిని సమీపించి “ఈశ్వరా మీ నోటీనుండి వచ్చిన మాటలు నిజము అయ్యాయి. అన్ని యంత్రములు అబధ్ధం చెప్పాయి. వైద్యులు ఏం ప్రమాదం లేదని అన్నారు. మా అల్లుడు కూడా బాగున్నాడు” అని అన్నారు. అదే ఉసిరికాయ చెట్టు, అదే మహాస్వామి వారు, అదే శాస్త్రి గారు. కానీ సందర్భము వేరు.
మహాస్వామి నవ్వుతూ “ఓ యంత్రములు కూడా అబద్దాలు చెప్తాయా. మనుషులు మాత్రమే చెప్తారు అనుకున్నాను” అని, అన్ని వివరములు కనుక్కుని శాస్త్రి గారికి ప్రసాదమును ఉత్తరీయాన్ని ఇచ్చారు”. తరువాత మాయవరం శివరామకృష్ణ శాస్త్రి గారు తన పుస్తకములో ఆ సంఘటన గురించి చెప్తూ “మహానుభావుల నోటి నుండి వచ్చు మాటల వలన ఏమైనా జరుగవచ్చు” అని వ్రాసుకున్నారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి