6, అక్టోబర్ 2023, శుక్రవారం

నవగ్రహ పురాణం - 72వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 72వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*కుజగ్రహ చరిత్ర - 2*


భూదేవి చిరునవ్వు నవ్వింది. *"నువ్వు ఆ తల్లి వద్దకు వెళ్ళడం కాదు , ఆమే నీ ముందు సాక్షాత్కరించాలి. కరుణనూ , వరాలనూ సముపార్జించుకునే సన్మార్గం అదే ! శరీరాన్ని ఈడ్చుకుంటూ కైలాసానికి శారీరకంగా వెళ్ళడం కాదు , నువ్వు చేయాల్సింది ! నువ్వు చేయాల్సింది మానసిక సాధన. శరీరాన్ని అదుపులో ఉంచి , నియమ నిష్ఠలతో ఇంద్రియాల వ్యాపారాలను నియంత్రించి , ఏకాగ్రతతో , ఏకైక దీక్షతో ఆ పరాశక్తిని ధ్యానిస్తూ తపస్సు చేయి. నీ ఆత్మ భావనా తరంగాలతో ఆ దేవిని ఆహ్వానించు !"* కుజుడు మౌనంగా , ఉద్రేకంతో చూశాడు.


ప్రశాంత వాతావరణం నిత్యవిహారం చేస్తున్న అందమైన అరణ్యప్రాంతంలో కుజుడు తపస్సు ప్రారంభించాడు. నియమం , నిష్ఠ , ఏకాగ్రత , ఏకైక దీక్ష... భూమాత చేసిన సూచనలు కుజుడిలో మారుమ్రోగుతున్నాయి.


కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు భూదేవి సూచనలు అతనికి వినిపించడంలేదు. *“ఎండిపోయిన ఆకులు గాలికి ఎగురుతూ వచ్చి తపస్సులో ఉన్న కుజుడి మీద తేలికగా వాలుతున్నాయి.


కాలచక్రం తిరుగుతోంది. తిరుగుతూ వర్తమానాన్ని గతంలోకి తోస్తోంది. భవిష్యత్తును వర్తమానంలోకి లాగుతోంది. నిరంతర కాలగమన విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ , ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది.


ఇప్పుడు చిగురాకులూ , మొగ్గలూ , పువ్వులూ గాలిలో నాట్యం చేస్తూ , కుజుడి మీదా , చుట్టూ వాలుతున్నాయి. కుజుడికి నీడనిస్తున్న చెట్టు రెమ్మల్లోంచి పిందెలు తొంగిచూస్తున్నాయి.


కాలం తన మంత్ర విద్యను ప్రదర్శిస్తూనే ఉంది. చెట్టు రెమ్మలోంచి తొంగిచూస్తున్న పిందెలు ముదిరి కాయలయ్యాయి.


కైలాసం...


పార్వతీ పరమేశ్వరుడు మానససరోవర తీరంలో ఆహ్లాదకరంగా విహరిస్తున్నారు. ఆదిదంపతులైన ఆ ఇద్దర్ని అనుకరిస్తూ , సరోవరంలో హంసల జంట ఒకదాన్నొకటి ప్రేమగా రాసుకుంటూ జల విహారం చేస్తున్నాయి....


*"స్వామీ..."* పార్వతి నడక ఆపి , అంది.


శివుడు ఆమె వైపు చూశాడు. ఆయన మూడవ కంటి క్రింద అందమైన కనుబొమలు , అందంగా కలుసుకున్నాయి.


*"చూశారా ? మీ పుత్రుడు 'కుజుడు' తపస్సు చేస్తున్నాడు"* అంది పార్వతి.. 


*"అలాగా ? ఎవరి గురించి దేవి ?"* శివుడు అమాయకంగా అడిగాడు. *“నా గురించే...”*


*"నీ గురించి తపస్సు చేస్తే , చూడాల్సింది నువ్వు నేను కాదు !"* పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు. 


*"మీ కుమారుడు నా గురించి తపస్సు చేయడం ఏమిటి ?"* పార్వతి చిరునవ్వు నవ్వింది.


పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. *"నా కళ్ళల్లోకి చూస్తూ , చెప్పు ! నా పుత్రుడు. నీ పుత్రుడు కాడా ? కాలేడా ? కానివ్వవా ?"* 


పార్వతి మనోహరంగా నవ్వింది. *"ఎందుకు కాడు ? ఎందుకు కాలేదు ? ఎందుకు కానివ్వను ?"*


*“అయితే నన్ను...”*


*"ఎందుకు అడిగానంటే , నేను రానప్పుడు మీరు కన్న కొడుకు కదా ! ఏమి వరం ఇవ్వమని ఆజ్ఞాపిస్తారో తెలుసుకుందామని అడిగాను !"* పార్వతి నవ్వుతూ అంది.


*“తండ్రి చెప్పడం తల్లిని చిన్నబుచ్చడమే ! తన బిడ్డలకు ఏమివ్వాలో తల్లికి తెలిసినంతగా తండ్రికి తెలీదు. తన బిడ్డలకు అమ్మ అడిగినవన్నీ ఇస్తుంది ; అడగనివి ఎన్నో ఇస్తుంది !"* 


పార్వతి ఒక్కసారిగా పరమేశ్వరుడిని తన బాహులతలతో బంధించింది. *"తల్లి తత్వాన్ని ఎంత గొప్పగా చెప్పారు !”* అంది.


*"తల్లి లేని వాణ్ణి కదా ! అందుకే అంత గొప్పగా చెప్పగలిగాను !"* శివుడు నవ్వుతూ అన్నాడు. *“అన్నట్టు 'నేను కన్న' కుజుడిని ఎప్పుడు అనుగ్రహిస్తావు ?”*


*"అది రహస్యం ! అతి రహస్యం !”* పార్వతి నవ్వింది.


వాహ్యాళి ముగించి పార్వతీ పరమశివులు మందిరం వైపు తిరిగారు. సరస్సులో విహరిస్తున్న హంసలు రెండూ వెంటనే నీళ్ళలోంచి ఇవతలకి వచ్చి , వాళ్ళ వెనకనే నడవసాగాయి.


హంసలు చేస్తున్న సవ్వడి విని శివుడు వెనుదిరిగి చూశాడు.


*"పార్వతీ , ఆ హంసలు ఎందుకు నడుస్తున్నాయో తెలుసా ?”*


*"ఊహూ ! నాకు 'హంస హృదయం' తెలీదు !"* పార్వతి నవ్వుతూ అంది. 


*“నాకు తెలుసు !”* శివుడు ఆమెనే చూస్తూ అన్నాడు. *“చెప్పనా ?”*


*“చెప్పండి !”* పార్వతి కుతూహలంగా అడిగింది.


*"నీ నడకను చూస్తూ , నీలా నడవడం నేర్చుకోవడానికి !"* శివుడు చిరునవ్వుతో అన్నాడు.


పార్వతి కిందికి వంగి , మానస సరోవరంలోని నీటిని దోసిటీతో తీసుకుని శివుడి మీదికి చల్లింది , చిలిపిగా.


కుజుడి మీద నీడ పరుస్తున్న చెట్టు మీది నుంచి కాయ , పండై , రాలింది. కుజుడు తదేక ధ్యానంలో ఉన్నాడు. ఉన్నట్టుండి ఎవరో తనలో ఏదో స్పందన కలుగజేస్తున్నారు. సున్నితంగా , సుఖకరంగా , చాలా నెమ్మదిగా ఎవరో తనను ధ్యానం నుండి మేల్కొలుపు తున్నారు. ఏదో అవ్యక్తానందాన్నీ , అద్భుత స్పర్శ సుఖాన్నీ కలిగించే మలయమారుతం తన శరీరాన్ని స్పృశిస్తూ ఉల్లాసాన్ని అందిస్తోంది. మధురాతి మధురమైన ఏదో పిలుపు లీలగా తన సర్వస్వానికీ వినిపిస్తోంది. ఏదో మహా సుగంధం తనను చుట్టుముట్టింది.


తదేక ధ్యానముద్రలో నిత్యనిమీలితంగా ఉండిపోయిన కుజుడి నేత్రాలు అసంకల్పితంగా విచ్చుకున్నాయి. కుజుడి శరీరం ఒక్కసారిగా జలదరించింది. ఎదురుగా మెరుపుతీగ ! కాదు... మెరుపుతీగలాంటి మహా సౌందర్యం ! కళ్ళెదుట చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ... పార్వతి , శివాని , త్రిలోక సుందరి ! త్రిజగన్మోహనమూర్తి ! దుర్గ ! చండిక !


*"అమ్మా...'*


*“ఆ పిలుపు వినిపించే వచ్చాను. ఏం కావాలో కోరుకో !"*


*"అమ్మా !”*


పార్వతి ముఖం చిరునవ్వుతో వికసించింది. *"అమ్మనే ! అడుగు , మంగళా ! ఏం కావాలి ?"* 


*'మంగళా !' అన్న సంబోధన కుజుడిలో ఆలోచనల్ని రేపుతోంది. కుజుడి పెదవులు 

కదిలాయి. అప్రయత్నంగా అడిగాడు.

కామెంట్‌లు లేవు: