6, అక్టోబర్ 2023, శుక్రవారం

ఆశీస్సులూ..అండదండలూ..

 *ఆశీస్సులూ..అండదండలూ..*


"మరో పదిరోజుల్లో మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది..వెళ్లే లోపల ఒకసారి స్వామివారి వద్దకు వెళ్ళొద్దామని అడిగింది..అందుకని ఈరోజు అమ్మాయిని వెంటబెట్టుకొని తీసుకొచ్చాము..మళ్లీ మధ్యాహ్నం తిరిగి వెళ్లిపోతాము.." అన్నారు రాజేశ్వరి గారు.."అలాగా..బాగా హడావుడిలో ఉన్నట్టుగా వున్నారు.." అన్నాను.."అవునండీ.." అన్నారు..ఆరోజు ఆదివారం..భక్తుల తాకిడి కొద్దిగా ఎక్కువగానే ఉన్నది..రాజేశ్వరి గారు తన కూతురిని తీసుకొని ఒక ప్రక్కగా కూర్చున్నారు..మరో అరగంట లోపల..స్వామివారి సమాధి దర్శించుకునే భక్తుల హడావుడి తగ్గిపోయింది..రాజేశ్వరి గారిని లోపలికి వెళ్ళమని చెప్పాను..కూతురిని తీసుకొని స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చి స్వామివారి ఉత్సవమూర్తి వద్ద తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు..అర్చకస్వామి వారు ఇచ్చిన తీర్ధ ప్రసాదాలు తీసుకొని నా వద్దకు వచ్చి కూర్చున్నారు..


"ఏమిటో ప్రసాద్ గారూ..ఏ పని మొదలుపెట్టాలని అనుకున్నా..ముందుగా ఈ మొగిలిచెర్ల కు వచ్చి..స్వామివారి సమాధి వద్ద మొక్కుకున్న తరువాతే ఆ పని చేస్తాము..గత ముప్పై ఏళ్లుగా అలవాటు అయింది.." అన్నారు రాజేశ్వరి గారు..నిజమే..రాజేశ్వరి గారి వివాహం కాక ముందు..ఆవిడ తల్లిదండ్రులతో కలిసి మొదటిసారి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..అందుకు కారణం కూడా ఉంది..రాజేశ్వరి గారికి వివాహం చేద్దామని ప్రయత్నాలు మొదలుబెట్టారు ఆమె తల్లిదండ్రులు..ఆరేడు సంబంధాలు వచ్చాయి..ప్రతి సంబంధమూ వెనక్కు పోతోంది..జాతకరీత్యా ఏ దోషము లేదు..కానీ ఒక్క సంబంధమూ కుదరడం లేదు..రాజేశ్వరి గారి నాయనమ్మ గారు.."ఒక్కసారి అమ్మాయిని తీసుకొని మొగిలిచెర్ల వెళ్లి..ఆ అవధూత దత్తాత్రేయుడి సమాధి మందిరం వద్ద నిద్ర చేసిరండి..ఏదైనా దోషం వున్నా తొలగిపోతుంది.." అని కొడుక్కు సలహా ఇచ్చారు..తల్లిమాట కాదనలేక అమ్మాయిని తీసుకొని మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..ఆరోజుల్లో..స్వామివారి మందిరం వద్ద కనీస వసతులు కూడా లేవు..ఉన్న ఒక్క మంటపం లోనే..కూతురిని పెట్టుకొని..ఆ తల్లీదండ్రీ నిద్ర చేసారు..తెల్లవారి లేచి..స్వామివారి సమాధి ని దర్శించుకొని..తమ కూతురు కు వివాహం కుదరాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని వెళ్లారు..వాళ్ళ మొక్కుబడి ఫలితమో..స్వామివారి అనుగ్రహమో..తెలీదుకానీ..సరిగ్గా నెల లోపల రాజేశ్వరి వివాహం జరిగిపోయింది..ఆరోజు నుంచీ రాజేశ్వరి గారికి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి మీద అపరిమిత భక్తి భావం కుదిరింది..ఆమె భర్తకు కూడా స్వామివారి పై అచంచల విశ్వాసం..


"ఈసారి అమ్మాయి అమెరికా నుండి రాగానే వివాహం చేయాలని అనుకున్నామండీ..స్వామివారి వద్ద కోరుకున్నాను..ఇప్పటికే దీనికి ఇరవై నాలుగేళ్ల వయసు..ఇక ఎక్కువ ఆలస్యం చేయకూడదని నా భావన..ఇక ఆ స్వామివారి దయ..ఆ సమాధి లో కూర్చున్న ఆ స్వామివారిదే భారం అంతా.." అని చెప్పి..మరొక్కసారి స్వామివారి సమాధి దర్శించుకొని కూతురిని తీసుకొని వెళ్లిపోయారు..


మరో వారం తరువాత రాజేశ్వరి గారు ఫోన్ చేశారు..తమ కూతురు వివాహం కుదిరిందని..పెళ్లికూడా మరో పదిరోజుల్లోనే జరుపుతున్నామని..అమ్మాయి అమెరికా ప్రయాణం పూర్తిగా రద్దు చేసుకున్నామని..తమ కూతురికి అన్నివిధాలా తగిన వరుడు  లభించాడనీ..చెప్పారు.."అమ్మా..మీరు అమ్మాయి అమెరికా నుంచీ వచ్చిన తరువాత వివాహం చేస్తానన్నారు కదా..మరి సంబంధం ఎలా కుదిరింది?" అని అడిగాను.."అంతా స్వామిదయ అండీ..అమ్మాయిని తీసుకొని ఇంటికొచ్చిన ప్రక్కరోజే ఈ సంబంధం వాళ్ళు మాకు తెలిసిన వారిద్వారా అడిగించారు..మావారు వాళ్ళ గురించి విచారించారు..చాలా మంచి సంప్రదాయబద్ధమైన కుటుంబం అని తెలిసింది..మా అమ్మాయిని అడిగాము.."అబ్బాయిని చూసిన తరువాత చెపుతాను.." అన్నది..పెళ్లిచూపులు ఏర్పాటు చేసాము..అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు..ఇద్దరూ ఇష్టపడ్డారు..ముహూర్తం పెట్టుకున్నాము..అంతా ఒక కల లాగా జరిగిపోయింది..పెళ్లి కాగానే..వధూవరులను తీసుకొని స్వామివారి సన్నిధికి వచ్చి..ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాము..దాని పెళ్లి కావాలని కోరుకున్నాను..కాకుంటే అమెరికా నుంచి వచ్చిన తరువాత అని అనుకున్నాము..కానీ..ఆరోజు ఒకమాట అనుకున్నాను.."స్వామీ దీనికి ఇరవై నాలుగేళ్లు వచ్చాయి..ఎక్కువ ఆలస్యం లేకుండా వివాహం జరిగేటట్టు చూడు తండ్రీ..అని..ఆమాట స్వామివారు విన్నారు..వెంటనే స్వామివారు మా అమ్మాయికి తగిన వరుణ్ణి సిద్ధం చేసి ఉంచారు..అంతా ఆయన కరుణ..మా ప్రాప్తం.." అన్నారు..


రాజేశ్వరి గారు త్రికరణ శుద్దిగా స్వామివారినే నమ్ముకున్నారు..అందుకే ఆవిడ కు అడుగడుగునా స్వామివారి ఆశీస్సుల తోపాటు వారి అండదండలూ ఉంటాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: