///// ఆలోచనాలోచనాలు ///// ***** చాటుపద్య సుమ మాలిక***** తెనాలి రామకృష్ణ కవి కృతములు ***** 1* కం. వక్కలు చేరెఁడు నేఁగొని / చొక్కాలోఁబోసికొంటి --- చొచ్చొచ్చొచ్చో (ధ్వనివైచిత్రి, వ్రాయవీలుగాని పద్ధతి) యెక్కడి దొంగలు వచ్చిరొ! అక్కఱకును లేకపోయె హరిశ్రీకృష్ణా! 2* సీ. ప్రౌఢదీర్ఘ సమాసపదములఁ గూర్చి శ్రీనాథుండు కూలార్చె నైషధంబు. దానితల్లిగ నల్లసానిపెద్దన చెప్పె ముదిమదితప్పి యాముక్తమాల్య దూహించి తెలియరాకుండ సూరపరాజు భ్రమఁ గళాపూర్ణోదయము రచించె. నతిశ్లేషశబ్దవాగాడంబరంబొప్పఁ బస ఘటించెను మూర్తి వసుచరిత్ర. నిట్టికవులకు నేను వాకట్టు కొఱకు / చెప్పినాఁడ మదీయవైచిత్రి మెఱయ / బాండురంగవిజయమును బటిమ దనర / విష్ణువర్ధిష్ణుఁడగు రామకృష్ణ కవిని. ( సూరన కవి ఈ కవి తరువాత తరం వాడు. కావున ఇది కల్పిత పద్యమని సాహితీ విమర్శకుల భావన.) 3* మ. వరబింబాధరముం బయోధరములున్ వక్రాలకంబుల్ మనో / హర లోలాక్షులు చూప కవ్వలిమొగం బైనంతనేమాయె? నీ / గురుభాస్వజ్జఘనంబుఁ గ్రొమ్ముడియు మాకుం జాలవే? గంగ క / ద్దరి మేలిద్దరిఁ గీడునుం గలదె యుద్యద్రాజబింబాననా! 4* కం. విధుకృతకదనము వదనము/ మధుకరనికరములఁ గేరు మగువచికురముల్ / విధు మధుకరలీలాజయ / మధురోక్తులు పిక్కలౌర, మధురాధరకున్. 5* కం. తారకములఁ గోరకముల / వారకములకెల్ల నెల్ల వారకము లిడున్ / శ్రీరమణీ హారమణీ / భారమణీయత్వదీయ పదనఖరముల్. 6* కం. జలచరము మిడుత మ్రింగెను/ జలచరమును మిడుత మ్రింగె జగతీస్థలిలో/ వలరాజు రాజు మ్రింగెను / వలరాజును రాజు మ్రింగవచ్చినఁబడియెన్. 7* గీ. చాన నెమ్మోము గెల్చుఁ గంజాతములను / కాంత కంజాతములగెల్చుఁ గంధరమును/ కంధరమును సమదశంఖంబు గెల్చు / శంఖభావంబు నయ్యర్థచంద్రుగెల్చు. 8* కం. కమలాకర కమలాకర / కమలాకర కమలకమల కమలాకారా/ కమలాకరమైన కొలను గనిరాసుదతుల్. 9* గీ. నాని నీనాను నేనును నాని నాను / నాన నేనును నిన్నూని నున్న నన్ను/ నెన్న నున్నను నిన్నెన్న నున్న నాన / నిన్న నేనన్న నున్న నన్నెన్ను నన్ని. 10* కం. కమలాకమలామోదిత / కమలా కమలావతంస కమలాకమలా/ కమలా కమలాన్వయవర / కమలాకమలాస్య రాధఁ గానరె యిచటన్. తేది 3--10--2023, మంగళవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి